* మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన కాంగ్రెస్‌, ఎన్‌సిపి, శివసేన
ముంబయి : మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ‘హోటల్‌’ క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపి ప్రలోభాలకు లొంగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌, ఎన్‌సిపి, శివసేన పార్టీలు తమ ఎమ్మెల్మేలను ముంబయి నగరంలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. జుహూ ప్రాంతంలోని జెడబ్ల్యు మారిటట్‌ హోటల్లో కాంగ్రెస్‌ తన ఎమ్మెల్యేలను ఉంచగా, పోవాయి ప్రాంతంలోని రినైసెన్స్‌ హోటల్‌లో ఎన్‌సిపి ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేవిధంగా ముంబయి అంతర్జాతీయ విమానా శ్రయానికి సమీపంలో ఉన్న లలిత్‌ హోటల్‌లో శివసేన ఎమ్మెల్యేలను ఉంచారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను సుప్రీంకోర్టు ఏ క్షణంలో అయినా బలపరీక్షకు అదేశించనున్న నేపథ్యంలో పార్టీలు తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బలపరీక్ష సమయానికి తమ ఎమ్మెల్యేలు ఎవరూ జారిపోకుండా, అందుబాటులో ఉండేలా పావులు కదుపుతున్నాయి. కాగా, బిజెపి ఇప్పటికే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ముందుగా రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించాలని ఆ పార్టీ ముందుగా భావించింది. అయితే రాష్ట్రంలో వేగవంతంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తరువాత నిర్ణయం మార్చుకొని ముంబయిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రిసార్టు రాజకీయాలు నడవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇంతకు ముందు ఎన్నికల ఫలితాలు విడుదలైన తొలినాళ్లలో బిజెపి-శివసేన మధ్య పొరపొచ్చాలు నెలకొన్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలను ఇతర ప్రాంతాలకు తరలించిన విషయం తెలిసిందే.

ఐక్యంగా ఉండండి : అహ్మద్‌ పటేల్‌
బిజెపి నుంచి ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా ఉండాలని కోరారు. జెడబ్ల్యు మారిటట్‌లో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఇంతవరకూ వచ్చేందుకు చాలా కష్టపడ్డామని, బలపరీక్షలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. న్యాయానికి అండగా ఉండి విలువలను కాపాడాలని పటేల్‌ అన్నారు. ఈ భేటీలో పటేల్‌తో పాటు ఇంకా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, సుశీల్‌కుమార్‌ షిండే, కెసి వేణుగోపాలు పాల్గొన్నారు.

Courtesy Prejasakti…