బయటకు సొంత వాహనాల్లోనే జనం..
ఐటీ ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోంతో దెబ్బ
బుకింగ్స్‌ లేక రోడ్ల మీద ఖాళీగా వాహనాలు
రోజంతా 4 నుంచి 5 మించని బుకింగ్‌లు
పీకల్లోతు కష్టాల్లో క్యాబ్‌ డ్రైవర్లు
పన్నులు, ఈఎంఐలు కట్టలేక అగచాట్లు
పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఇక్కట్లు
కూలీ పనులు, పండ్ల విక్రయంతో జీవనం

హైదరాబాద్‌: బుకింగ్‌ల మీద బుకింగ్‌లతో పది నిమిషాలు కూడా ఖాళీ దొరక్కుండా పట్నం రోడ్ల మీద క్యాబ్‌లను పరుగులెత్తించి.. వచ్చే సంపాదనతో ఉన్నంతలో చక్కగా బతుకుబండిని లాక్కొస్తున్న డ్రైవర్లకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. మాయదారి కరోనా వారి ఉపాధినే దెబ్బకొడుతోంది. వైరస్‌ ఉధృతం అవుతుండటంతో ప్రజలు సొంత వాహనాలనే ఉపయోగిస్తుండటంతో క్యాబ్‌లు ఎక్కేవారే కరువైపోయారు. కరోనా ప్రభావంతో ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. సినిమా థియేటర్స్‌, షాపింగ్‌ మాల్స్‌, మల్టీ ఫ్లెక్సులు మూసే ఉన్నాయి. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా తిరిగే ఓలా, ఉబెర్‌ క్యాబ్‌ డ్రైవర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పేరుకు కారున్నా, డ్రైవర్లకు ఆటో రిక్షా కంటే తక్కువ ఆదాయం వస్తోంది.

లాక్‌డౌన్‌ సమయంలో సుమారు 40 రోజులు కార్లు నడ వక డ్రైవర్లు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా భయంతో ఇప్పుడు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకపోవడం, వచ్చినా సొంత వాహనాలనే వినియోగిస్తుండంతో క్యాబ్‌ల బుకింగ్‌ శాతం 30-40 శాతానికి పడిపోయింది. 10-12 గంటల్లో 4-5 బుకింగ్‌ల కంటే ఎక్కువ రావడంలేదు. తమకు నాలుగు నెలలుగా సరైన ఆదాయం లేదని, నెలవారీ ఈఎంఐలు, త్రైమాసిక పన్నులు, ఇన్సూరెన్స్‌, కారు నిర్వహణ, పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో క్యాబ్‌లను నడిపే పరిస్థితి లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్లలో కొందరైతే కూరగాయలు, పండ్లను విక్రయిస్తుండగా, మరి కొందరు భవన నిర్మాణ రంగంలో కూలీ పనులకెళ్తున్నారు. తాజాగా గ్రేటర్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారని వార్తలు వినిపిస్తుండటంతో క్యాబ్‌ డ్రైవర్లు మరింత ఆందోళన చెందుతున్నారు.

25 శాతం కమీషన్‌ కంపెనీలకే
ఓలా, ఉబెర్‌కు చెందిన క్యాబ్‌లు గ్రేటర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఎక్కువగా నడుస్తుంటాయి. అసలే కరోనా కారణంగా అరకొరగా వస్తున్న బుకింగ్‌ల ద్వారా వస్తున్న ఆదాయంలో ఆయా కంపెనీలే 20 నుంచి 25 శాతం వరకు కమీషన్‌ను వసూలు చేస్తున్నాయి. దీంతో డ్రైవర్లకు పెద్దగా గిట్టుబాటు కావడం లేదు. ఇలాంటి సమయంలోనైనా కంపెనీలు తక్కువ కమీషన్‌ను తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్‌ చేస్తుంటే వారు పట్టించుకోవడం లేదు. పైగా కార్లకు ఫిట్‌నెస్‌ లేదని, ఇన్సూరెన్స్‌, ఇతర పత్రాలు లేవని క్యాబ్‌ డ్రైవర్ల ఐడీలను ఆయా క్యాబ్‌ సేవలను నిర్వహిస్తున్న కంపెనీలు బ్లాక్‌ చేస్తున్నాయి.

గిట్టుబాటు కావడంలేదు
రోజుకు 10-12 గంటలు ఆన్‌లైన్‌లో ఉన్నా 3-4కు మించి బుకింగ్‌లు రావడం లేదు. ఎయిర్‌పోర్టు బుకింగ్‌ దొరికితే వచ్చే మొత్తంలో 40 శాతం వరకు కంపెనీకే వెళ్తోంది. అంత దూరం వెళ్లినా అక్కడికి నుంచి మళ్లీ సిటీ రావాలన్నా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. రోజుకు ఆదాయం రూ.600 నుంచి రూ.1000 దాకానే వస్తోంది. ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు, డీజిల్‌కు పోనూ ఏమీ మిగలడం లేదు. ఇలాంటి పరిస్థితిలో క్యాబ్‌ నడపడమంటే నష్టమే.
ఎం.శ్రీనివాస్‌, క్యాబ్‌ డ్రైవర్‌

ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రభావం
మునుపు ఐటీ కంపెనీల్లో సుమారు 40 వేల మంది డ్రైవర్లు కార్లను నడిపేవారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో 80 శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తుండడంతో వారికి పని లేకుండా పోయింది. క్యాబ్‌తో డ్రైవర్లు రోడ్డు మీదకు వెళితే ఎక్కేవారు లేరు. డీజిల్‌ ధర విపరీతంగా పెరిగింది. పైగా కంపెనీల కమీషన్లు. ఉబెర్‌ అయితే ఒక్కో బుకింగ్‌కు 25 శాతం తీసుకుంటోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆ కంపెనీ ప్రతినిధులు తాము ఏ కమీషన్‌ తీసుకోబోమని చెప్పారు. ఇప్పుడు యథాతథంగా వసూలు చేస్తున్నారు. పొద్దుట్నుంచి రాత్రి దాకా కారు నడిపితే 5-6 ట్రిపులు రావడమే కష్టంగా ఉంది.
టి.రాజశేఖర్‌ రెడ్డి, తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌

Courtesy AndhraJyothy