-ఇప్పటికీ జైలులోనే 18 మంది ఆందోళనకారులు
– రాజస్థాన్‌ పోలీసుల కుట్రపూరిత చర్యలు
– బీజేపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి అరెస్టులు

జైపూర్‌ : ప్రమాదకర కరోనా(కోవిడ్‌-19) వ్యాప్తి, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పరిస్థితులను ఆసరాగా చేసుకొని సీఏఏ వ్యతిరేక నిరసనలపై అణచివేతలు క్రమక్రమంగా జరుగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో మొన్న.. దేశంలో నిరసనలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, జామియా మిలియా ఇస్లామియా(జేఎంఐ)తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను అక్కడి నుంచి పోలీసులు ఖాళీ చేయించడం ఇందులో భాగమే. ఇటు ఢిల్లీ పోలీసులను ఆదర్శంగా తీసుకొని రాజస్థాన్‌ పోలీసులు సైతం అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ నాయకుల ఒత్తిడి మేరకు పనిచేస్తూ నిరరసనకారుల గొంతులను నొక్కేస్తున్నారు.

షాహీన్‌ బాగ్‌ ప్రేరణగా దాదాపు రెండు నెలలనుంచి బారన్‌జిల్లాలో సీఏఏకు వ్యతిరేకంగా మహిళలు నిరసనలు తెలుపుతున్నారు. అయితే వీరిపై నెలరోజుల క్రితం సీఏఏ మద్దతుదారులుగా చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు, హిందూత్వ సంస్థల కార్యకర్తలు దాడికి దిగారు. మహిళలు అని చూడకుండా తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇంత జరిగినప్పటికీ పోలీసులు మాత్రం బీజేపీ, హిందూత్వ సంస్థల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను విడిచిపెట్టారు. పైగా నిరసనకారులనే ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేశారు. వారిపై తీవ్రమైన నేరారోపణలను మోపారు. దీంతో 18 మంది నిరసనకారులు ఇప్పటికీ జైలులోనే మగ్గుతున్నారు. ఫలితంగా సీఏఏ వ్యతిరేక నిరసన కార్యక్రమమే ప్రమాదంలో పడిపోయే అవకాశం ఏర్పడింది.

నిరసనకారులపై మళ్లీ ఇలాంటి ఘటనే ఈనెల 18నచోటు చేసుకున్నది. బీజేపీ మద్దతుదారులు జరిపిన ఈ దాడిలో షౌకత్‌ అలీ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై బాధితుడి కుమారుడు లియాకత్‌ అలీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, నిందితులపై పోలీసులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పైగా సీఏఏ వ్యతిరేక నిరసనకారులకు మద్దతుదారుగా ఉన్న మౌలానా ఇంతియాజ్‌ను పోలీసులు ఈనెల 20న అరెస్టు చేశారు. ఇది కాస్తా అక్కడిస్థానికులు, సీఏఏ వ్యతిరేక నిరసనకారుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. ” మౌలానా అరెస్టుతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. స్థానిక పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకొని వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ప్రజలపై పోలీసులు అన్యాయంగా దాడికి దిగి గాయపరిచారు. తీవ్రమైన పరుష పదజాలంతో ఆందోళనకారులను దూషించారు” అని నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు అడ్వకేట్‌ అన్సార్‌ లొనె తెలిపారు.

” నా సోదరుడు అప్పటి నుంచి పోలీసుకస్టడీలోనే ఉన్నాడు. ఆయనపై అనేక ఆరోపణలు మోపారు. ఈ సందర్భంగా ఒక మైనర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు” అని వసీం అహ్మద్‌ అనే వ్యక్తి వాపోయాడు. ”పోలీసులు, బీజేపీ కార్యకర్తల దాడిలో పలువురికి భుజాలు, తలల మీద తీవ్ర గాయాలయ్యాయి. ఎలాంటి మెడికల్‌ చెకప్‌లు కూడా చేయించలేదు. పోలీసులు.. బీజేపీ నాయకుల ఒత్తిడి మేరకు పనిచేస్తున్నారు. ఇది చాలా దారుణం” అని అబ్దుల్‌ మతీన్‌ అనే స్థానికుడు ఆందోళన వెలిబుచ్చారు. అయితే నిరసనకారులను అరెస్టు చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా.. కేసు దర్యాప్తు విషయంలో ఎలాంటి పురోగతీ లేదు. అసలు ఎన్ని రోజులు జరుగుతుందన్న దాని పైనా స్పష్టత లేకపోవడంతో పోలీసుల వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Courtesy Nava Telangana