ఎన్నార్సీ, ఎన్పీఆర్‌నూ ఆపాలి
– ‘సుప్రీంమధ్యవర్తిత్వ బృందంతో షాహీన్‌బాగ్‌ నిరసనకారులు
సభ్యులకు ప్రశ్నల వర్షం కురిపించిన మహిళలు
చర్చలు నేటికి వాయిదా

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షాహీన్‌బాగ్‌లో పర్యటించిన మధ్యవర్తిత్వ బృందానికి అక్కడి నిరసనకారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వివక్షాపూరితమైన, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను రద్దు చేయాలి. నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్నార్సీ), నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌(ఎన్పీఆర్‌)లను నిలిపివేయాలని షాహీన్‌బాగ్‌లోని మహిళా నిరసనకారులు మధ్యవర్తిత్వ బృందానికి స్పష్టం చేశారు. కాగా, గురువారం కూడా నిరసనకారులతో బృందం చర్చలు జరపనున్నది.
బుధవారం షాహీన్‌బాగ్‌లోని నిరసనకారులతో మాట్లాడటానికి బృందంలోని సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులైన సంజరు హెగ్డే, సాధనా రామచంద్రన్‌లు నిరసన వేదిక వద్దకు చేరకున్నారు. తొలుత ఈనెల 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హెగ్డే నిరసనకారులకు చదివి వినిపించారు. అనంతరం నిరసనకారులకు ఉన్న ఆందోళనలు, అనుమానాల నివృత్తి కోసం మాట్లాడేందుకు మధ్యవర్తిత్వ బృందం అనుమతినిచ్చింది. మధ్యవర్తిత్వ బృందం, నిరసనకారులకు మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ” ప్రతిఒక్కరూ రోడ్లను ఖాళీ చేయాలని మాట్లాడుతున్నారు. జామియాలో మా పిల్లలపై దాడులు జరిగాయి. పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని ఓ మహిళ ప్రశ్నించింది. ఒకవేళ మేం ఇక్కడ నుంచి కదిలితే.. మా భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని సభ్యులను అడిగింది. స్కూల్‌ బస్సులు, అంబులెన్సులు నిరసనవేదిక నుంచి వెళ్లలేకపోతున్నాయని మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మహిళలు.. బృందానికి ప్రత్యక్ష ఉదాహరణతో సమాధానం చెప్పారు. చర్చలు జరుగుతున్న సందర్భంలో ఒక అంబులెన్సు వేదిక వద్దకు చేరింది. అంబులెన్సు వెళ్లడానికి నిరసనకారులు దారిచ్చారు. ”ఈ అంబులెన్సు వెళ్లడానికి దారి కల్పించినట్టే.. స్కూల్‌ బస్సులు, అత్యవసర సేవలో విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నాం” అని మరొకరు వివరించారు.

కలిసి సమస్యను పరిష్కరించుకుందాం మధ్యవర్తిత్వ బృందం
సమస్యను పరిష్కరించడానికి కలిసి పనిచేద్దామని చర్చల సందర్భంగా నిరసనకారులకు బృందసభ్యులు సూచించారు. ఇక్కడ అధిక సంఖ్యలో నిరసనల్లో పాల్గొన్న ప్రజల వాదనలు వినడానికి తాము ఇక్కడకు వచ్చినట్టు మధ్యవర్తులు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ”సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేం ఇక్కడకు వచ్చాం. ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మేం భావిస్తున్నాం. ప్రతి ఒక్కరి సహకారంతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని మేం ఆశిస్తున్నాం” అని సంజరు హెగ్డే తెలిపారు. ”నిరసన చేసే హక్కు మీకు ఉన్నదని సుప్రీంకోర్టు తెలిపింది. సీఏఏపై న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. మనకు లాగే.. ఇతరలకూ హక్కులుంటాయి” అని సాధనా రామచంద్రన్‌ వారికి గుర్తు చేశారు. నిరసన ప్రాంతాన్ని నిర్జన ప్రదేశానికి తరలించేలా షాహీన్‌బాగ్‌ నిరసనకారులతో మాట్లాడి ఒప్పించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఇద్దరు సభ్యులతో మధ్యవర్తిత్వ బృందాన్ని ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్‌ నుంచి నిరసన ప్రదేశాన్ని వేరొక చోటుకు మారిస్తే నిరసనల తీవ్రత తగ్గి అవి మరింత బలహీనంగా మారే అవకాశం ఉంటుందని నిరసనకారులు ఇప్పటికే తమ ఆందోళనను వ్యక్తం చేసిన విషయం విదితమే.

మంగళూరు పౌరనిరసనలపై కర్నాటక హైకోర్టు.. 22 మందికి బెయిల్‌
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత డిసెంబర్‌లో మంగళూరులో జరిగిన హింసాత్మక ఆందోళనల్లో అరెస్టయిన 22 మందికి కర్నాటక హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. హింసాత్మక ఘటనలో పోలీసు అతిని కప్పిపుచ్చుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందని న్యాయస్థానం తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా గత డిసెంబర్‌ 19న మంగళూరులో నిరసనలు చెలరేగడంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో హింసాత్మకంగా మారాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాలకు చెందిన కొంత మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జాన్‌ మైఖెల్‌ కున్హా.. విచారణ జరిపారు. అనంతరం 22 మందికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

పోలీసుల హింసకాండలో 2.66 కోట్ల ఆస్తినష్టం
దేశరాజధాని ఢిల్లీలోని జామియా విశ్వవిద్యాలయంలో సీఏఏ నిరసనల నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ 15న జరిగిన హింసకాండలో రూ. 2.66కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్డీ)కి యూనివర్సిటీ తెలిపింది. పోలీసుల దాడిలో రూ.4.75 లక్షల విలువైన 25 సీసీటీవీ కెమెరాలకు ధ్వంసమయ్యాయని వేదికలో వెల్లడించింది. జామియాలో హింసాకాండకు సంబంధించిన పలు సీసీటీవీ ఫుటేజీలు కొద్ది రోజులుగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో ఎంత మేరకు ఆస్తినష్టం జరిగిందనే దానిపై వర్సిటీ అధికారులు నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ప్రకారం రూ .55 లక్షల విలువైన పరికరాలు దెబ్బతినగా.. 75 తలుపులు ధర రూ .41.25 లక్షలు, 220 విండో పేన్‌ల విలువ రూ .22.5 లక్షలు, 18 లక్షల మేర రైలింగ్‌ ధ్వంసమయ్యిందని తెలిపింది. ఇవి కాక ఈ హింసాకాండలో రూ.15 లక్షల విలువైన హార్డ్‌వేర్‌ పరికరాలు, రూ.35 లక్షల విలువైన 35 లైబ్రరీ టేబుల్స్‌, ఇతర సామాగ్రి దెబ్బతిన్నాయని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ బృందం లైబ్రరీతో సహా జామియా క్యాంపస్‌ను మంగళవారం సందర్శించింది. హింసకాండ తర్వాత దర్యాప్తు కోసం పోలీసులు క్యాంపస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని పెట్టాలి : అసదుద్దీన్‌
అమరావతి : వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురావాలని ఏపీ సీఎం వై.ఎస్‌ జగన్‌ను.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కోరారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విజయవాడలోని కుమ్మరిపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముస్లిం ముత్తహిద మహజ్‌(ఆల్‌ మైనారిటీస్‌ అసోసియేషన్‌ నెట్వర్క్‌) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని తీసుకురావాలని సీఎంను అభ్యర్థించారు.

Courtesy Nava Telangana