హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను సిపిఐ ఎప్పటిలాగానే కొనసాగిస్తుంది. గిరిజనుల పోడు భూముల సమస్య, యురేనియం తవ్వకాలు, ఆర్‌టిసి, సింగరేణి సంస్థల పరిరక్షణ, పెను మార్పులను తలపెట్టిన రెవెన్యూ చట్ట రూపకల్పన లాంటి సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ వెనుకడుగు వేస్తుందని ఎలా భావిస్తున్నారు?

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన రాజకీయ వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం ఆకస్మిక నిర్ణయమని, యూ టర్న్ అని, ఆశ్చర్యం గొలుపుతుందని… ఇలా పరిపరివిధాల పలువురు తమ అభిప్రాయాలను వివిధ రూపాలలో వెల్లడిస్తున్నారు. మరికొందరు తిట్ల పురాణం అందుకున్నారు. అయితే, వీరందరూ సిపిఐ వ్యతిరేకులని చెప్పడం సాహసమే అవుతుంది. వీరిలో పార్టీ శ్రేయోభిలాషులు, సానుభూతిపరులూ ఉన్నారు. పార్టీని రాజకీయ శత్రువుగా భావించే వారున్నారు. అందుకని అందరిని ఈ విషయంలో ఒకేగాటన కట్టలేము. ఇందులో రాజకీయ వైరం గల వారి శాపనార్థాలకు, తిట్ల పురాణానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారు ఈ విషయంలో సిపిఐ వైఖరిని పూర్తిగా అవగాహన చేసుకోని వారు అయినందున, సిపిఐ వైఖరి వారి రాజకీయ, సైద్ధాంతిక విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నందున సమాధానం అవసరం లేదు.

ఇక రెండవ కేటగిరి,- పార్టీ శ్రేయోభిలాషులు, సానుభూతిపరులకు పార్టీ కార్యవర్గ నిర్ణయం కొంత విస్మయం కల్గించిన మాట యథార్థం. నిన్నటి వరకు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగిస్తున్న పార్టీ ఇక మిత్రపక్షంగా వాటికి స్వస్థి పలుకుతుందన్న ఆందోళన వారిలో నెలకొన్నది. ఈ సందర్భంగా వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం పార్టీకి వుంది. అలాంటి భావనకు ఆస్కారం లేదని మనవి చేస్తున్నాం. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటిలాగానే ఆందోళన మార్గం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు గిరిజనుల పోడు భూముల సమస్య, యురేనియం త్రవ్వకం, ఆర్‌టిసి, సింగరేణి సంస్థల పరిరక్షణ, పెను మార్పులను తలపెట్టే రెవెన్యూ చట్ట రూపకల్పన లాంటి సమస్యలపై కమ్యూనిస్టు పార్టీ వెనుకడుగు వేస్తుందని ఎలా భావిస్తున్నారు? సమస్యే లేదు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక అధికార పార్టీని తీవ్ర ఆలోచనలో పడవేసింది. గతంలో మహాకూటమిగా, 2018 శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌, టిడిపి, టిజెయస్‌ల మధ్య చేదు అనుభవాలే మిగిలాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీ నుండి సిపిఐకే కాదు టిజెఎస్‌కు కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన మూడు సీట్లను కూడా స్వీకరించవద్దన్న ఆలోచన పార్టీలో, తీవ్రస్థాయిలో వచ్చింది. అయితే, ఆ తరుణంలో అది పెడ అర్థాలకు దారి తీసే అవకాశం వున్నందున మనసు నొచ్చుకొని స్వీకరించిన మూడింటిలో రెండు చోట్ల కాంగ్రెస్‌ స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగారు. వారిపై క్రమశిక్షణా చర్యకు పూనుకోకపోగా, పరోక్షంగా కొందరు ప్రముఖ నాయకులు మద్దతు కూడా ఇచ్చారు. మహాకూటమి చర్చల తీరు, నాయకుల ప్రవర్తన చేదు అనుభవాలను మిగిల్చింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి వారం (సిపిఐ-–సిపిఎం కలిసి) పోటీకి దిగాం. ఈ రాష్ట్రంలో, ప్రస్తుత కాంగ్రెస్‌ నాయకత్వంతో కలిసి ఎన్నికల్లో పోరాడడం అన్నది ‘కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదిన’ చందంగా వుంటుంది. సిపిఐకి ఓట్లు ఎక్కడున్నాయని స్వయంగా పిసిసి అధ్యక్షులే ప్రశ్నించారు. అందువల్ల మహాకూటమి శాసనసభా ఎన్నికలతో పరిసమాప్తమైంది. ఈ ఎన్నికల సమీక్ష కూడా ఉమ్మడిగా నిర్వహించుకోలేకపోయాం.

ఇక మిగిలింది టిజెఎస్‌, సిపిఎంకు సంబంధించి. టిజెఎస్‌ అధినేత కోదండరామ్‌ ప్రభావం సాధారణంగా తప్ప ప్రభావంతమైన నిర్దిష్ట ఓటింగ్‌ హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో లేదన్నది వాస్తవం. సిపిఎంకు సంబంధించి ఉమ్మడి పోరుకు యోచనలు కొనసాగాయి. కాని అవి ఆచరణకు నోచుకోక ముందే వారి అభ్యర్థి నామినేషన్‌ పరిశీలనస్థాయిలోనే తిరస్కరణకు గురైంది.

అయితే, ఈ ఉప ఎన్నికల్లో సిపిఐ పోటీ చేయనప్పుడు తటస్థ వైఖరిగా వుండవచ్చుకదా అనే వాదన లేకపోలేదు. కాని, నేటి ప్రజాస్వామ్య ఎన్నికల బ్యాలెట్ యుద్ధంలో ఎలాంటి ప్రభావాలు వున్నాయో వేరే చెప్పనక్కరలేదు. పార్టీ హుజూర్‌నగర్‌ నియోజకవర్గ నాయకత్వం, సూర్యాపేట జిల్లా పార్టీ కార్యవర్గం తటస్థ వైఖరిని నిర్ద్వంద్వంగా నిరాకరించడంతోపాటు ఏ పార్టీకైనా బహిరంగ మద్దతును ప్రకటించాలని కోరింది. కాంగ్రెస్‌పై శాసనసభ ఎన్నికల ప్రభావం, స్థానికంగా శాసనసభ్యుని వైఖరితో టిఆర్‌యస్‌ను బలపర్చాలన్న నిర్ణయానికి రాష్ట్రపార్టీ కార్యవర్గం వచ్చిందని మనవి చేస్తున్నాను. ఇందులో సైద్ధాంతిక రాజకీయ ఎత్తుగడలు లేకపోలేదు.

ఇక, స్థానికంగా హుజూర్‌నగర్‌ పార్టీ నాయకులకు, శ్రేణులకు కార్యవర్గ నిర్ణయం ఆశ్చర్యపర్చక పోవడమేకాదు స్వాగతించారు కూడా. ఇతర ప్రాంతాల పార్టీ శ్రేణులు కొన్ని ప్రచార మాద్యమాల, ప్రత్యేకించి సోషల్‌మీడియాలో కొందరు వ్యక్తులు, శక్తులు సాగిస్తున్న విష ప్రచారానికి ఆందోళన పడ్తున్న మాట నిజం. ఎన్నికల్లో పార్టీ ఓడిన నాడు ఆడిపోసుకున్న శక్తులే ఈ విష ప్రచారానికి ఇప్పుడు పూనుకుంటున్నాయి. ఈ దేశంలో ఎన్నికలు ధన బలంతోను, గరిష్ఠ స్థాయిలో అధికార దుర్వినియోగంతోనూ జరుగుతున్నాయి. సేవాతత్పరత గల పార్టీలు, నాయకులు ఘోర పరాజయం పాలవుతున్నప్పుడు పెదవి విప్పని పెద్ద మనుషులు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్న యోచన చేయని శక్తులు కమ్యూనిస్టులపై వీలైనప్పుడల్లా ఆడిపోసుకోవడం వారికి ఆనవాయితీగా మారింది. వీరి విష ప్రచారం కొంత గందరగోళ పర్చినా, నిజం నిలకడ మీద తేలుతుందన్న విశ్వాసంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బూర్జువా పార్టీల నైజం ఎరిగినప్పటికీ ఇలాంటి కొన్ని సందర్భాలలో సహకారం అనివార్యమవుతుంది. అభివృద్ధి కాముకులు, బుద్ధిజీవులు కోరుతున్న సమాజం ఇప్పుడు నెలకొనిలేదన్నది వాస్తవం. ఈ ఉప ఎన్నికలో సిపిఐ నిర్ణయం అధికార టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లైసెన్స్‌కాదని, ప్రజాసమస్యలను ఎప్పటిలాగే ఎలుగెత్తి చాటడం, ప్రజావ్యతిరేక విధానాలను ఎదిరించి శక్తికొద్ది పోరాడడం ఎప్పటి లాగే సిపిఐ తన కర్తవ్యంగా భావిస్తున్నది. ఇప్పుడేర్పడిన నూతన పరిస్థితి ప్రభుత్వంపై మరింత వత్తిడి తేవడానికి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని పార్టీ భావిస్తున్నది. పార్టీ కార్యవర్గ నిర్ణయాన్ని ఈ పూర్వరంగంలో యోచించాలని అభిమానులకు, శ్రేయోభిలాషులకు, శ్రేణులకు సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది.

చాడ వెంకటరెడ్డి  సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

Courtesy andhrajyothi