దయనీయ స్థితిలో భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలు
జీతాలిచ్చి గెంటేసిన కంపెనీల యాజమాన్యాలు
కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీఐటీయూ

హైదరాబాద్‌ సిటీ/చిక్కడపల్లి : ఏపీలోని విశాఖపట్నం జిల్లా కొంతలంలోని రోలుగుంటకు చెందిన 110 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. బంజారాహిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకుంటూ గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో పనులు ఆగిపోయాయి. సొంత ఊరికి వెళ్దామంటే రైళ్లు, బస్సులు బంద్‌ అయ్యాయి. చేయడానికి పనుల్లేవు.. చేతిలో డబ్బుల్లేవు. వీరికి ఇక్కడ రేషన్‌కార్డు లేనందున.. ప్రభుత్వం ప్రకటించిన సా యం పొందడానికి అర్హత లేదు. దీంతో పూట గడిచేదెలా? అని వీరు ఆందోళన చెందుతున్నారు. ఈ స్థితిని కేవలం ఏపీ నుంచి వలస వచ్చిన కుటుంబాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన వేలాది కార్మిక కుటుంబాలూ ఎదుర్కొంటున్నాయి. వీరంతా సొంత ఊర్లకు వెళ్లలేక, పూట గడిపే పరిస్థితి లేక బిక్కుబిక్కుమంటున్నారు.

నిర్మాణ రంగంలోనే 6 లక్షల మంది..
హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చినవారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు 6 లక్షల మంది పని చేస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల వద్ద  5వేల నుంచి 10 వేల మంది వరకు కార్మికులు షిప్టుల వారీగా పని చేస్తున్నారు. ఆయా ప్రాజెక్టుల సమీపంలోనే వీరికి షెడ్లను ఏర్పాటు చేసి వసతులు కల్పించారు. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల వద్ద షెడ్లలో ఉన్న కార్మికులను ఖాళీ చేయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. అయితే వీరిలో చాలా మంది బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారున్నారు. రైళ్లు, బస్సులు అన్నీ బంద్‌ కావడంతోపాటు రాష్ట్రాల సరిహద్దులను మూసేయడంతో తాము ఎక్కడికెళ్లాలని  ఆందోళన చెందుతున్నారు.

వీరితోపాటు మియాపూర్‌, చందానగర్‌ తదితర ప్రాంతాల్లో అద్దెకు ఉండే వారిని యజమానులు ఖాళీ చేయిస్తున్నారు. వీరు కూడా ఎటూ వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ఇక జీడిమెట్ల, బాలానగర్‌, చర్లపల్లి, చౌటుప్పల్‌, బీబీనగర్‌, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో వివిధ కంపెనీల్లో పని చేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల కు పనుల్లేవని, ఇళ్లకు వెళ్లండంటూ ఇప్పటికి పనిచేసిన వరకు యాజమాన్యాలు జీతాలిచ్చా యి. కంపెనీల షెడ్‌లో నుంచి బ్యాగ్‌లతో సహా ఖాళీ చేయించారు. దీంతో చౌటుప్పల్‌ నుంచి  50 మంది కార్మికులు హైదరాబాద్‌కు కాలినడకన వెళ్తున్నారు.

ఆదుకోవాలని సీఎ్‌సకు వినతి
లాక్‌డౌన్‌ కర్ఫ్యూలో చిక్కుకున్న కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాయిబాబు, అధ్యక్షుడు చుక్క రాములు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.   ప్రభుత్వ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుర్తింపుకార్డులిచ్చి రవాణా సదుపాయం కల్పించాలని  కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కోరింది.

Courtesy Andhrajyothi