–  భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంలో సర్కారు విఫలం
– 23 నుంచి చెన్నైలో సీఐటీయూ జాతీయ మహాసభలు
– బిల్డింగ్‌, అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణలో ఎం.సాయిబాబు

రియల్టరతో కార్మిక శాఖ అధికారులు మిలాఖత్‌ అవ్వటం వల్ల సెస్‌ వసూలులో ఏటేటా తగ్గిపోతున్నదనీ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు విమర్శించారు. సెస్‌ ద్వారా వసూలైన నిధులనూ భవన నిర్మాణ రంగ కార్మికులకు ఖర్చుపెట్టడంలో రాష్ట్ర సర్కారు తీవ్రంగా విఫలమైందన్నారు. ఈ నెల 23 నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బిల్డింగ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) క్యాలెండర్‌, డైరీలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి సెస్‌ ద్వారా వసూలైన ఫండ్‌ కేంద్రం వద్ద రూ.40 వేల కోట్లు, రాష్ట్రంలో రెండు వేల కోట్లకుపైగా మూలుగుతున్నదన్నారు. అంత డబ్బున్నా కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించడం కోసం పాలకులకు చేతులు రావడం లేదని విమర్శించారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుల కోసం 1996లో తీసుకొచ్చిన సంక్షేమ చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

భవన కార్మికులను ఎన్‌రోల్‌మెంట్‌ చేయించడంలో కార్మిక శాఖ విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లోని వ్యవసాయ కార్మికులే నేడు భవన నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. 2020 పోరాటాల సంవత్సరమనీ, ఉద్యమాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ నెల 19న కార్మిక-కర్షక మైత్రి దినంగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరి రాములు, ఆర్‌.కోటంరాజు, సీఐటీయూ సీనియర్‌ నాయకులు రాజారావు, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు పాల్గొన్నారు.

(Courtesy Nava Telangana)