• కేంద్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం
  • కేటాయించాల్సిన నిధులు రూ.9.49లక్షల కోట్లు
  • గత ఐదేండ్లలో కేటాయింపులు రూ.5.11లక్షల కోట్లు…
  •  ఇందులో రూ.3.13లక్షల కోట్లు ఇతర పథకాలకు ఖర్చు
  • పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించిన మోడీ సర్కార్‌ :
  •  నేషనల్‌ క్యాంపెయిన్‌ ఆన్‌ దళిత్‌ హ్యూమన్‌రైట్స్‌

దేశ జనాభాలో ఎస్సీలు 16.6శాతం, ఎస్టీలు 8.6శాతం(2011జనాభా లెక్కల ప్రకారం) ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం వారి జనాభా మేరకు కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలి. ఒక విశ్లేషణ ప్రకారం గత ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం రూ.9.49లక్షల కోట్లు కేంద్రం కేటాయించాలి. కానీ మోడీ సర్కార్‌ రూ.5.11లక్షల కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇందులోనూ రూ.3.13లక్షల కోట్లు జనరల్‌ పథకాలకు నిధుల్ని మళ్లించినట్టు బడ్జెట్‌ గణాంకాల్లో స్పష్టంగా కనపబడింది. అంటే నికరంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జరిగిన వ్యయం రూ.1.98లక్షల కోట్లు. కనీసం (టార్గెట్‌ స్కీమ్స్‌కు)20 శాతం నిధులు కూడా ఖర్చు కాలేదన్న సంగతి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. న్యూఢిల్లీ : విద్య, వైద్యం, జీవనోపాధి….మొదలైవాటిల్లో ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశం కల్పించటమే తమ లక్ష్యమని 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొన్నది. అయితే ఈ ఐదేండ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చేసింది పరిశీలిస్తే తీవ్ర నిరాశకలు గుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌ను ఉద్దేశిస్తూ, నేషనల్‌ క్యాంపేయిన్‌ ఆన్‌ దళిత్‌ హ్యూమన్‌ రైట్స్‌ కొన్ని గణాంకాల్ని విడుదలచేసింది. బడ్జెట్‌ కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితం చేశారనీ, ఇదంతా కూడా ఎలక్షన్‌ ‘జుమ్లా'(తప్పుడు వాగ్దానం)గా మార్చేశారనీ దళిత్‌ హ్యూమన్‌రైట్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి అత్యంత కీలకమైనవి..ఎస్సీసబ్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌(టీఎస్‌పీ). ఈ సబ్‌ప్లాన్‌లోని ప్రధానమైన అంశం…ఎస్సీ, ఎస్టీ జనాభాకు అనుగుణంగా వీరి సంక్షేమం, అభివృద్ధికోసం నిధుల్ని ఖర్చుచేయాల్సిందే. ఇందులో కేటాయించిన
(నిధుల్నిదారి మళ్లించటానికి వీల్లేదు. కానీ ఈ ఐదేండ్లలో వాస్తవంగా జరిగిందేమోటో తెలుసుకుంటే ఎంతో ఆవేదన కలుగుతుంది.
కేటాయించింది సగం..అందులోనూ కోత..
ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని నిధులు కేటాయించాలి? అన్నదానికి ఒక విధానముంది. ఈ విధానంలోని మార్గదర్శకాల ప్రకారం 2014-15 నుంచి 2018-19వరకు (ఐదేండ్ల కాలంలో) జరపాల్సిన కేటాయింపులు రూ.6.20లక్షల కోట్లు. కానీ మోడీ సర్కార్‌ ఐదేండ్లుగా చేసిన బడ్జెట్‌ కేటాయింపులు రూ.3.10లక్షల కోట్లు. అంటే ఇవ్వాల్సిన నిధుల్లో సగం కోతపెట్టారు. దేశ జనాభాలో ఎస్సీలు 16.6శాతం ఉన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు సగం తగ్గాయి కాబట్టి, ఈ రూ.3.10లక్షల కోట్లు 8శాతం ఎస్సీలకు కేటాయించారన్నది అర్థమవుతోంది.
కేటాయించిన నిధులను కేంద్ర పథకాలు (సీఎస్‌), కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌)కు కేంద్ర ప్రభుత్వం వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ ఐదేండ్లలో బడ్జెట్‌ వాస్తవ వ్యయాలను పరిశీలిస్తే, సీఎస్‌, సీఎస్‌ఎస్‌లకు కేంద్రం చేసిన వ్యయం రూ.2.07లక్షల కోట్లు. ఎస్సీ జనాభాలో 43శాతం మందికి సరిపోయే నిధుల్ని వ్యయం చేసినట్టుగా తెలుస్తోంది. రూ.6.20లక్షల కోట్లు అవసరం అయిన చోట మోడీ సర్కార్‌ చేసిన ఎస్సీలకు చేసిన సామాజిక న్యాయం రూ.2.07లక్షల కోట్లు. కనీసం సగం నిధులు కూడా ఇక్కడ ఖర్చు చేయలేదు.
ఎస్టీలకు 
2014-15, 2018-19 మధ్యకాలంలో ఎస్టీలకు కేటాయించాల్సిన నిధులు రూ.3.28లక్షల కోట్లు. కానీ ఈ ఐదేండ్లలో మోడీ సర్కార్‌ బడ్జెట్‌ కేటాయింపులు రూ.2లక్షల కోట్లు. వారి జనాభా ప్రకారం ఇవ్వాల్సిన దాంట్లో 40శాతం కోతపెట్టారు. దేశ జనాభాలో ఎస్టీలు 8.6శాతం ఉన్నారు. కేటాయించిన నిధులు రూ.2లక్షల కోట్లు…5.12శాతం ఎస్టీ జనాభాకు సరిపోతుంది. కేటాయించిన ఈ రూ.2లక్షల కోట్లలో వాస్తవ వ్యయం…రూ.1.36లక్షల కోట్లు. మళ్లీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కోతపెట్టారు.
జనరల్‌ పథకాలకు నిధులు మళ్లింపు
బడ్జెట్‌లో అసలు విషయానికి వస్తే, కేటాయించిన నిధుల్లో 37.35శాతం ఎస్సీ సంక్షేమం కోసం వ్యయం చేశారు. అంటే దాదాపు 63శాతం నిధులు ‘నాన్‌ టార్గెట్‌’ (జనరల్‌) పథకాల్లో వ్యయం చేశారు. అలాగే ఎస్టీ సంక్షేమం కోసమే చేసిన వ్యయం 40.7శాతం. దాదాపు 60శాతం నిధులు ‘నాన్‌ టార్గెట్‌’ పథకాల్లో ఖర్చుపెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్ని పెద్ద ఎత్తున ‘జనరల్‌ పథకాల’కు మరలించారని పై గణాంకాల్ని బట్టి అర్థమవుతోంది.
ఎస్సీ సంక్షేమానికి సంబంధించి 329 సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇందులో 233 ‘నాన్‌ టార్గెట్‌’ పథకాలే. వీటిపై పెద్ద ఎత్తున ఖర్చుపెట్టడం ద్వారా ఎస్సీ సామాజికవర్గానికి మేలు జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. అలాగే ఎస్టీలకు 338 సంక్షేమ పథకాలున్నాయి. ఇందులో 71 పథకాలు మాత్రమే నేరుగా ఎస్టీలకు లబ్దిచేకూర్చేవి. మిగతావి నాన్‌ టార్గెట్‌ పథకాలే. మొత్తం కేటాయింపుల్లో నాన్‌ టార్గెట్‌ పథకాలపై చేసిన వ్యయమే ఎక్కువగా ఉంది. ఎస్సీ, ఎస్టీ పేరుతో మోడీ సర్కార్‌ నిధుల్ని తరలించి వేరే చోట వ్యయం చేసిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కేటాయింపుల్లో తేడా! 
(2014-15 మరియు 2019-20, విలువ రూ.లక్ష కోట్లు)
ఎస్సీ ఎస్టీ మొత్తం
కేటాయించాల్సిన నిధులు(ఏ) 6.20 3.28 9.49
బడ్జెట్‌ కేటాయింపులు(బీ) 3.11 2.00 5.11
ఏ-బీ నిధుల తేడా(సీ) 3.09 1.28 4.38
టార్గెట్‌ పథకాలు 1.16 0.82 1.98
నాన్‌-టార్గెట్‌ పథకాలు(ఈ) 1.95 1.19 3.13
మొత్తం తేడా (సీ+ఈ) 5.04 2.47 7.51

(నవ తెలంగాణ సౌజన్యంతో)