(దేశీ దిశ పరిశోధన, విశ్లేషణ విభాగం)

2019 కేంద్ర బడ్జెట్ మత్స్యకారుల ప్రయోజనాలని పూర్తిగా విస్మరించింది. మత్స్యకారుల పడవలకు ఉపయోగించే డీజిల్ కిరోసిన్, లను సబ్సిడీపైఇవ్వాలని, తీవ్ర అప్పులతో దినదిన గండంగా బతుకుతున్న తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు పాత రుణ బకాయిలను రద్దు చేయాలని మత్స్యకార సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. నిర్మల సీతారామన్ బడ్జెట్లో ఈ విషయాలకే మీ సమాధానమే లేదు. కేరళ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇటీవలి కాలంలో దేశంలోని మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారికి నిర్మలమ్మ ఏమాత్రము ఉపశమనం కలిగించలేదు.

తాజా కేంద్ర బడ్జెట్లో మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వశాఖ కోసం రూ 3 73 7 కోట్లు కేటాయించారు. ఇందులో రూ2932.35 కోట్లు సంవర్ధక, డైరీ రంగాలకు పోతుంది. మిగిలిన రూ.804.75 కోట్లు మత్స్య విభాగానికి మిగులుతుంది. ఇది ప్రధానంగా మార్కెటింగ్ విస్తరణ, సేకరించిన మత్స్య సంపద భద్రత పరిరక్షణ వంటి విభాగాలకు ఖర్చు చేస్తారని బడ్జెట్ ప్రకటించింది.

విదేశీ భారీ పడవలు మన తీర ప్రాంతాల్లో మత్స్య సంపదను భారీగా కొల్లగొడుతున్నాయి. ఇది మన మత్స్యకారులను తీవ్రంగా దెబ్బ కొడుతున్నాయి. అలాగే బుల్ ట్రాలింగ్ (అంటే రెండు అంతకన్నా ఎక్కువ పడవలతో భారీ వలలు తీసుకొని చేపలు పట్టటం, నిషేధించాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. వీటి వల్ల పర్యావరణం, మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతోంది. కోస్తా రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ నాటి నుంచి ఈ పేరిట జరిగే అభివృద్ధి ప్రాజెక్టులు, టూరిజం పేరిటచేపట్టిన పథకాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వంటివన్నీ మన కోస్తా ప్రాంతాన్ని విధ్వంసం చేస్తుందని మత్స్యకార సంఘాలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. 6068 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం జీవావరణం మొత్తం విధ్వంసకర అభివృద్ధికి నాశనంకానుంది. అలాగే కోస్తా చుట్టూ జరిగే అభివృద్ధి నిర్మాణాలు ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలను పెంచుతాయి. ఇదంతా మన కోస్తాలో నివసిస్తున్న కోటి ఇరవై లక్షల మంది మత్స్యకారుల జీవనానికి, జీవనాధారానికి భారీ నష్టం కలిగించనుంది. కేరళవరదల్లో నష్టపోయిన మత్స్యకారులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. కానీ కేవలం 9 వేల రూపాయలు మంజూరు చేశారు. ఈ విషయమై ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం.

మొత్తంగా నిర్మల సీతారామన్ తొలి బడ్జెట్ మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం, సామాజిక భద్రత నీ పూర్తిగా విస్మరించింది.