జాదూగోడాలో బుద్ధుడు ఎందుకు ఏడుస్తున్నాడు?

 కె సజయ

‘‘‌చర్మ క్యాన్సర్‌ ‌కు మొదటి దశ అయిన నల్ల మచ్చలు అనేకమందిలో కనిపించాయి. చాలా మందిలో ట్యూమర్లు వున్నాయి. పెద్దతలలతో (మాక్రోసెఫాలిక్‌), ‌చిన్నతలలతో(మైక్రోసెఫాలిక్‌) ‌పుట్టిన పిల్లలు కనిపించారు. బుద్ధిమాంధ్యం వున్న పిల్లలు ఎక్కువగా వున్నారు. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు కూడా చాలా బాధాకరం. అకస్మాత్తుగా జరిగే గర్భస్రావాలు రేడియేషన్‌ ‌ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు ఈ పరిస్థితి హిరోషిమా, నాగాసాకీలలో కూడా బయటపడింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా కనిపిస్తోంది’’.

– డా।। సంఘమిత్ర గడేకర్‌పిల్లలు వివిధ రకాల అంగవైకల్యాలతో పుట్టడం మొదలైంది. విపరీతమైన చర్మవ్యాధులు మొదలైయ్యాయి. మనుషుల్లోనే గాక, పశువులు, వృక్షాల నుంచీ వచ్చే పండ్లలో కూడా అనేక వికృతమైన మార్పులు రావటం మొదలైంది. ఈ మార్పులన్నీ కూడా కంపెనీ అక్కడ అడుగుపెట్టిన తర్వాతే అనే విషయం వారికి నెమ్మదిగా అర్ధమయ్యింది.

‘‘ఈనాడు బతికున్న పిల్లలం తా చైతన్యవంతులయ్యి, ఏదో ఒకనాడు న్యాయబద్ధమైన ప్రపంచ సమూహంగా ఏకమయ్యి సరైన జవాలు ఇస్తారు. వారికి ఈ చిత్రం అంకితం’’ అంటూ ఆ లఘుచిత్రం గొప్ప ఆశావహంతో మొదలవుతుంది. దానిపేరే ‘బుద్ధ వీప్స్‌ ఇన్‌ జాదూగోడా’ (జాదూగోడా లో బుద్ధుడు ఏడుస్తున్నాడు). ఏమిటీ జాదూగోడా? అక్కడ బుద్ధుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ నేపధ్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే రూపమే ఈ లఘు చిత్రం. 1999లో నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు శ్రీప్రకాష్‌.
జార్ఖండ్‌ రాష్ట్రంలో తూర్పు సింఘ్భూం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతమే జాదూగోడా. జార్ఖండ్‌ , సంథాల్‌, హోరాన్‌, ముండా, హో వంటి ఇంకా అనేక పురాతన ఆదివాసీ సమూహాల తో పెనవేసుకునిపోయిన అటవీ ప్రాంతం ఇది. శతాబ్దాలు గా అద్భుతమైన నాగరికతను స ృష్టించిన ప్రాంతం. దట్టమైన అడవుల తో, కమనీయమైన ప్రక ృతి అందాల తో, భూగర్భంలో విలు వైన ఖనిజాల తోనూ నిండివున్న ప్రాంతం. తమ పూర్వీకుల విశాల మైన తమ స్వంత భూముల నుండి గెంటివేయబడ్డారని అక్కడి ప్రజల నమ్మకం. తాము పవిత్రంగా పూజించే మరాంగ్‌ బురు వదిలిన బాణం ఎక్కడ పడిరదో అదే ఈ దట్టమైన మద్దిచెట్లతో వున్న జార్ఖండ్‌ ప్రాంతమని, ఇది తమకు ఎంతో పవిత్రమైనదని వీరి నమ్మకం. ఒకప్పుడు దీనినే ‘జారాగోరా’ అనేవారని అక్కడి ఆదివాసుల చెబుతారు.

ఇక్కడ యురేనియం నిక్షేపాలు వున్నాయని 1951 లోనే కనుగొన్నారు. అప్పటినుంచి చేసిన ప్రయత్నాలతో 1967 లో యురేనియంని తవ్వటం మొదలు పెట్టింది యురేనియం కార్పొరేషన్‌ అఫ్‌ ఇం‌డియా (యూసీఐఎల్‌). ఇవే భారతదేశంలోని మొట్టమొదటి యురేనియం గనులు. జాదూగోడా, భటిండ్‌, ‌సర్వపహార్లలో ఈ గనులు వున్నాయి. వీటినే దాల్భుమ్‌ ‌ఘడ్‌ అం‌టారు. ఇక్కడే సుప్రసిద్ధమైన రాతిగనులు రాఖా, మసాబని, సూర్ధ కూడా వున్నాయి. బ్రిటిష్‌ ‌వాళ్ళు ప్రప్రధమంగా ఈ ప్రాంతం ఆక్రమించుకోవటానికి వచ్చినపుడు ఆదివాసీలు తిరగబడి ప్రాణాలు ఎదురొడ్డి నిలిచి వారిని తరిమేశారు. ఆ రాతి గనుల పక్కనే యురేనియం గనులను తవ్వటం మొదలుపెట్టారు.

ఆదివాసీల జీవితం ప్రకృతితో మమేకమయ్యి వుంటుంది. ప్రకృతినే దేవుడిగా పూజిస్తారు. అలాంటి తమ జీవితాల్లో కనిపించకుండా పెనుముప్పు ఎలా వచ్చిందో తెలియక, తాము నిత్యం పూజించే దేవుడికి తమ మీద ఎందుకో కోపం వచ్చింది అనుకునే అమాయకులు. ప్రభుత్వమే అక్కడ గని తవ్వడానికి వచ్చి భూములు తీసేసుకుంది. ఇవి మా భూములు కదా అన్నప్పుడు, ఇవన్నీ ప్రభుత్వ భూములనీ మీ అంగీకారం అవసంలేదని నిర్దాక్షిణ్యంగా చెప్పారు. గని కోసం, వ్యర్ధాలను పోయటానికి కట్టే టైలింగ్‌ ‌చెరువుల కోసం అనేక గ్రామాలలో వుండే ఆదివాసీల భూములను తీసేసుకున్నారు. మీకు ఇక్కడ జీవన భద్రత కలిపించటానికి గనిలో తవ్వే పనులు ఇస్తామని చెప్పారు. అయితే, ఈ చర్యతో తమ భవిష్యత్‌ ‌జీవితాలే ప్రమాదంలో పడతాయని వారు ఊహించలేదు. ఏ రకమైన ముందు జాగ్రత్తలూ, అవసరమైన వస్తువులు లేకుండానే ఒట్టి కాళ్ళూ చేతులతో సంవత్సరాల తరబడి కంపెనీ ఆదేశాలతో యురేనియం తవ్వుతూ వెళ్ళారు. ముడి యురేనియం తీయడానికి టన్నుల కొద్దీ మట్టి తవ్వి బయటకు పోయాల్సి వుంటుంది. అయితే, ఈ ఖనిజం ప్రమాదకరమైందని మాత్రం వారికి ఎవ్వరూ చెప్పలేదు. తవ్వి బయట పోసిన ఆ మట్టితోనే ఇళ్లు కట్టుకున్నారు. ప్రతిసంవత్సరం పండగల సమయంలో జాజులాగా గోడలకు మెత్తుకున్నారు. యురేనియం వ్యర్థపదార్థాల నుంచి వచ్చిన వాటితో తాళ్లులాగా పేని పిల్లలు ఆడుకోవడం చేశారు. ప్రాసెసింగ్‌ ‌యూనిట్‌ ‌దగ్గర పెట్టిన ఎగ్సాస్ట్ ‌ఫానుల దగ్గర చల్లగా ఉంటుందని వేసవిలో కూర్చునేవారు. ఇతర ఉద్యోగులందరికీ అవసరమైన యూనిఫారాలు ఇచ్చిన కంపెనీ గనిలోకి దిగి పనిచేసే ఆ ఆదివాసీ కార్మికులకు మాత్రం తల మీద పెట్టుకునే ఒక్క బ్యాటరీ లైట్‌ ‌తప్పించి ఇంకేం ఇవ్వలేదు. కొద్దిమందికి ఇచ్చిన నూలు యూనిఫారాలు కూడా ఒక్క ఉతుకుతోనే పాడైపోయాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, తమ పరిసరాలలో వచ్చిన చెడు మార్పులను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక అల్లాడిపోయారు.

యురేనియం వ్యర్థ పదార్థాలను వేసే చెరువులపక్కనుంచీ వెళుతున్న మహిళలకు గర్భ స్రావాలవటం మొదలైంది. ముందు అక్కడ అసలు ఎవరూ నడవకూడదని కంపెనీ అధికారులు చెప్పలేదు. ముందు అక్కడేదో దెయ్యం తిరుగుతూ తమను వెంటాడుతోందని భయపడ్డారు. పిల్లలు వివిధ రకాల అంగవైకల్యాలతో పుట్టడం మొదలైంది. విపరీతమైన చర్మవ్యాధులు మొదలైయ్యాయి. మనుషుల్లోనే గాక, పశువులు, వృక్షాల నుంచీ వచ్చే పండ్లలో కూడా అనేక వికృతమైన మార్పులు రావటం మొదలైంది. ఈ మార్పులన్నీ కూడా కంపెనీ అక్కడ అడుగుపెట్టిన తర్వాతే అనే విషయం వారికి నెమ్మదిగా అర్ధమయ్యింది. తాము తవ్వి తీస్తున్న యురేనియం ఖనిజం గురించీ తెలుసుకోవటం మొదలుపెట్టారు. అది ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నారు. తమను పట్టిపీడిస్తున్న దుష్టశక్తి యురేనియమే అని తెలుసుకున్నారు. ఇంత ప్రమాదకరమైన ఖనిజం గురించీ కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్న కంపెనీ అధికారులను నిలదీయటం మొదలుపెట్టారు. అప్పుడు ఒత్తిడి తట్టుకోలేని కంపెనీ అధికారులు, యురేనియం గని నుంచి వచ్చే గాలి వైపు కూర్చోవద్దని, నీళ్ళను తాగొద్దని చెప్పారు. టైలింగ్‌ ‌చెరువుల వైపు వెళ్ళవద్దని చెప్పారు. అంతే కానీ, అంతకు మించి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.

సాధారణంగా గనిలోపల పనిచేసే కార్మికులు ఎక్కువగా కాంట్రాక్ట్ ‌పనివారుగా వుంటారు తప్పించి శాశ్వత ఉద్యోగులుగా వుండరు. దానితో వారికి ఏ విధమైన రక్షణ చర్యలు వుండవు. నిజానికి క్రమం తప్పకుండా కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, ఇవేవీ గనిలో పనిచేసే ఈ ఆదివాసీలకు అందలేదని వారు ఎంతో స్పష్టంగా చెప్పారు.

జాదూగోడా చుట్టు పక్కల గ్రామాలలో పర్యటించినప్పుడు ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరిశీలనలను డాక్టర్‌ ‌సంఘమిత్ర గడేకర్‌ ఈ ‌చిత్రంలో వివరిస్తారు. ‘‘చర్మ క్యాన్సర్‌ ‌కు మొదటి దశ అయిన నల్ల మచ్చలు అనేకమందిలో కనిపించాయి. చాలా మందిలో ట్యూమర్లు వున్నాయి. పెద్దతలలతో (మాక్రోసెఫాలిక్‌), ‌చిన్నతలలతో(మైక్రోసెఫాలిక్‌) ‌పుట్టిన పిల్లలు కనిపించారు. బుద్ధిమాంధ్యం వున్న పిల్లలు ఎక్కువగా వున్నారు. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు కూడా చాలా బాధాకరం. అకస్మాత్తుగా జరిగే గర్భస్రావాలు రేడియేషన్‌ ‌ప్రమాదాన్ని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు ఈ పరిస్థితి హిరోషిమా, నాగాసాకీలలో కూడా బయటపడింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా కనిపిస్తోంది’’ అని ఆవిడ వివరిస్తారు. ముప్ఫై సంవత్సరాలలోపు ఉన్నవారిలో వ్యంధ్యత్వం పెరుగుతోంది. ఆడవారిలో ఈ పరిస్థితి వున్నప్పుడు వారి వైవాహిక జీవితం వడిదుడుకులకు గురవుతోందని, పిల్లలు పుట్టటం లేదన్న కారణం చేత వదిలేస్తున్నారని అనేక మంది మహిళలు చెప్పారు. ఆ గ్రామాలలో తీవ్ర మానసిక, శారీరిక వైకల్యాలతో వున్న ఆ పసిపిల్లలను చూస్తుంటే దుఃఖం సుళ్లు తిరిగిపోతుంది. కానీ, ఇవి తమ కంపెనీ వల్ల జరుగుతున్న అనర్దాలని మాత్రం ఆ అధికారులు ఒప్పుకోరు. ఆదివాసీల అలవాట్లు శుభ్రంగా వుండవనీ, మంచి ఆహార అలవాట్లు లేవనీ, తాగుడు వల్లనే వాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిస్సిగ్గుగా అంటారు.

వీళ్ళు ఇలా ఒక పక్క అంటుంటారు, ఇంకో పక్క యురేనియం వంటి అణుధార్మిక పదార్ధాలతో తీసుకోవాల్సిన కచ్చితమైన అంతర్జాతీయ విధివిధానాల గురించి నిపుణుల అభిప్రాయం కూడా దీనిలో చూస్తాం. ‘‘రక్షణ కలిపించే యూనిఫారం, బూట్లు, చేతి తొడుగులు లేకుండా గనిలో కార్మికులు లోపలికి దిగటానికే లేదనీ, ముడి పదార్ధాన్ని డ్రమ్ముల్లోకి చాలా జాగ్రత్తలతో నింపాలని, అవి పగిలిపోకూడదని, టైలింగ్‌ ‌చెరువులను పకడ్బందీగా మూసేయాలని, వాటిలోనుంచి నీరు కానీ, వ్యర్ధాలు కానీ బయటకు రావటానికి వీల్లేదని, వాటి దరిదాపుల్లో మనుషులు, పశువులు వెళ్ళటానికి వీల్లేదని, అలాంటి పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాల్సింది కంపెనీనే అని, లేకుంటే అది తీవ్రమైన నేరంగా పరిగణించాలని’’ అణువిద్యుత్‌ ‌రెగ్యులేటరీ బోర్డు మాజీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ఆదినారాయణ గోపాలక్రిష్ణన్‌ ‌వివరిస్తారు.
ఆదివాసీలు అడవిలో తిరగకుండా యుసిఐల్‌ ‌కంపెనీ పారామిలిటరీ బలగాల సహాయంతో కంచెలు ఏర్పాటు చేసి నిర్బంధాన్ని ప్రయోగించింది. వాళ్ల ఇళ్ళను కూల్చేశారు. ఈ భూమి తమ పూర్వీకులదని, వాళ్ల శ్రమతో ఈ ప్రాంతం ఇన్నాళ్లు సుస్థిరంగా వుందని, ఇక్కడ గాలిలో, నేలలో వారి ఉనికి ఉంటుందని ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం. తమ భూములను కాపాడుకోవటానికి చిన్నా పెద్దా, ఆడా, మగా తేడా లేకుండా ప్రజలు ఉద్యమించారు. లాఠీలకు, బుల్దోజర్లకు అడ్డంగా పడుకున్నారు. లాటీ దెబ్బలు తిన్నారు, ఆస్పత్రుల పాలయ్యారు. జైళ్ళకు వెళ్ళారు. తమ చావైనా, బతుకైనా ఈ నేల మీదేనని, దీనిని వదిలిపెట్టే సమస్యలేదనీ స్పష్టం చేస్తారు. భారతదేశ పౌరులుగా తమ హక్కుల కోసం రాజ్యాంగ బద్ధంగానే పోరాడుతామని వాళ్ళు స్థిరంగా చెబుతారు. తాము పూజించే మద్ది వృక్ష సముదాయాల్ని, అడవుల్ని యురేనియం గనుల, టైలింగ్‌ ‌చెరువుల విస్తరణ కోసం నరికేసిన కంపెనీ మీద ఆదివాసులు చేసిన సంఘటిత పోరాటంతో యుసిఐల్‌ ‌కంపెనీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆదివాసీల పునరావాసం కోసం, వారి జీవన భద్రత కోసం రక్షణ ఏర్పాట్లకు అంగీకరించింది.
ఈ ఉద్యమం కేవలం పునరావాసం కోసం కాదని, భవిష్యత్‌ ‌తరాల కోసమని అక్కడి ఆదివాసీలు తేల్చి చెబుతారు. యురేనియంని భూమి నుంచీ బయటకు తీయటానికి లేదని, అది మానవాళికి శత్రువని, తమకు తెలియకుండానే తమని, తమ భవిష్యత్‌ ‌తరాలని దానికి బలి చేశారని, అభివృద్ధి పేరుతో తమ జీవితాల్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇది బుద్దుడు పుట్టిన ప్రాంతమనీ, ఆయన తమ పూర్వీకుడని, కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ అంగవైకల్యంతో పుడుతున్న పిల్లలను చూసి ఏడుస్తున్నాడని రుద్ధమైన కంఠం తో వివరిస్తారు.
ఇది కాల్పనిక సినిమా కాదు. మన కళ్ళ ముందు జరిగిన, ఇంకా జరుతున్న వాస్తవం. భూమిని, నీటిని, అడవిని కాపాడుకోవటం కోసం చేస్తున్న తోటి ఆదివాసీల పోరాటం.

సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఆ ప్రమాదకర పరిస్థితులు మన నల్లమలకు చుట్టుకోబోతున్నాయి. ముందే మేలుకుంటామా? లేక మరో దుర్భర జాదూగోడాగా మార్చడానికి ప్రయత్నిస్తున్న శక్తులను, కంపెనీలను, ప్రతిపక్షాల కుట్రలంటూ వత్తాసు పలుకుతున్న అధికారపక్ష శాసనసభ్యులను, నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వాలను నిలదీస్తామా? నల్లమల అడవా, యురేనియమా తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.

 

 

 

 

 

(Courtacy Prajatantra)

Leave a Reply