* కేరళలో బిఎస్‌ఎన్‌ఎల్‌ నిర్ణయం
* ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకే : సిసిఎల్‌యు

తిరువనంతపురం : కేరళలో భారత సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధమైంది. ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మొదటిదశలో అన్ని స్థాయిల్లో కార్మికుల సంఖ్యను 30శాతం మేర తగ్గించాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ గతవారం ఆదేశాలు జారీ చేసింది. ఓనం పండుగ నేపథ్యంలో రెండు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని రెగ్యులర్‌ ఉద్యోగులు కూడా ఆందోళన బాటపట్టారు. గత నెల 20న జరిగిన సమావేశంలో ఆడిట్‌ కమిటీ పరిశీలనల ఆధారంగా కాంట్రాక్ట్‌ సిబ్బందిని సంస్థ తగ్గించాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయలేమని, రెగ్యులర్‌ ఉద్యోగులు చేయని పనులనే వారికి కేటాయించాలని ఈ సమావేశం పేర్కొంది. సంస్థ కార్యకలాపాలను బడా సంస్థలకు అవుట్‌ సోర్సింగ్‌కు ఇచ్చే ఉద్దేశంతోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడుతోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి.

పెద్దపనులను బడా కంపెనీలకు అప్పగించేందుకే
– (సిసిఎల్‌యు) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.మోహనన్‌
‘బిఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ ప్యాకేజీ పేరుతో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అందించాలని సంస్థ భావిస్తోంది. వేతనాలు ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులు అందుకు అంగీకరిస్తారని అంచనా వేస్తోంది. రెగ్యులర్‌ సిబ్బంది సంఖ్యను తగ్గించి, కొత్త నిబంధనలతో కాంట్రాక్ట్‌ సిబ్బంది ద్వారా ఆ పనులు చేయించాలని, పెద్ద పనులను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో బడా కంపెనీలకు అప్పగించాలని భావిస్తోంది’ అని బిఎస్‌ఎన్‌ఎల్‌ క్యాజువల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిసిఎల్‌యు) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.మోహనన్‌ విమర్శించారు. కాంట్రాక్ట్‌ సిబ్బందిలో ఎక్కువమందికి రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉందని, కొన్ని నెలలుగా పదవీ విరమణ వయసుకు సంబంధించి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంతో సుమారు రెండు వేలమంది వరకూ కాంట్రాక్ట్‌ సిబ్బంది పదవీ విరమణ చేయాలనుకుంటున్నారని చెప్పారు. పలు మాసాలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో కార్మికులు రెండు నెలల క్రితం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సిజిఎం) కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారని తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలను క్లియర్‌ చేయడానికి అత్యవసర ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కార్పొరేట్‌ కార్యాలయానికి సిజిఎం లేఖ రాశారు.

(Courtacy Prajashakti)