ఢిల్లీ అల్లర్లలో నిప్పంటించిన అల్లరిమూకలు

న్యూఢిల్లీ: సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో.. బోర్డర్‌ సెక్యూరీటి ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది ఇంటిని సైతం వదలకుండా అల్లరి మూకలు నిప్పం టించాయి. అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని పలు కాలనీల్లో వందలాది ఇండ్లు కాలిపోయాయి. అందులో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మహ్మద్‌ అనీస్‌కు చెందిన ఇంటిని సైతం దుండగులు తగులబెట్టారు. ఇంటి ముందు నేమ్‌ప్లేట్‌లో ఉన్న ‘బీఎస్‌ఎఫ్‌’ను చూసైనా వదిలిపెట్టలేదు. మరో మూడు నెలల్లో ఆ ఇంట్లో జరగాల్సి ఉన్న రెండు పెండ్లిళ్ల కోసం డబ్బు దాచుకోగా.. అది కూడా తగలబడిపోయిందని కుంటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు… అనీస్‌ ఇంటిని పునర్నిర్మిస్తామని తెలిపారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించిన బీఎస్‌ఎఫ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) పుష్పేంద్ర రాథోడ్‌ .. కాలిపోయిన ఆ ఇంటిని తిరిగి నిర్మించి.. అనీస్‌ పెండ్లి కానుకగా ఇస్తామని చెప్పారు. అలాగే బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ వేల్ఫేర్‌ ఫండ్‌ నుంచి రూ.10 లక్షల సాయం అందిస్తామని తెలిపారు.

Courtesy Nava Telangana