ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకించిన డెబ్బీ అబ్రహామ్స్‌
వీసా తిరస్కరణకు గురైందని దుబారుకు తిప్పి పంపిన అధికారులు
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘటన

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ ఎంపీ డెబ్బీ అబ్రహామ్‌కు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె వీసా తిరస్కరణకు గురైందని ఓ కస్టమ్స్‌ అధికారి ఆరోపించారు. ఆమె పాస్‌పోర్టు, ఈ-వీసాలను పరిశీలించిన అనంతరం ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. అంతేగాకుండా, ఆమెను న్యూఢిల్లీలో అడుగుపెట్టొందంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అనంతరం దుబారు విమానంలో ఎక్కించి ఆమెను వెనక్కి తిప్పి పంపారు. డెబ్బీ అబ్రహామ్‌ పట్ల కస్టమ్స్‌ అధికారి ప్రవర్తించిన తీరు పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. డెబ్బీ అబ్రహామ్‌ సన్నిహితుడు హర్‌ప్రీత్‌ ఉపాల్‌ తెలిపిన వివరాల ప్రకారం…మోడీ సర్కారు వైఖరికి నిరసనగా గళమెత్తి భారత్‌లో అడుగుపెడుతున్న విదేశీ ఎంపీలు, అధికారులు వివక్ష ఎదుర్కొంటున్నారు. మోడీకు మద్దతిస్తున్న వారికి విమానాశ్రయాల్లోనూ రాచమర్యాదలు లభిస్తున్నాయని అన్నారు. ఆయన విధానాలను వ్యతిరేకించినవారి పట్ల ఎయిర్‌పోర్టు అధికారులు కూడా భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇమ్మిగ్రేషన్‌ డెస్క్‌కు చేరుకున్న ఆమె ఈ-వీసాను, పాస్‌పోర్టును కస్టమ్స్‌ అధికారి లాక్కొని అమర్యాదగా ప్రవర్తించారని విమర్శించారు. కాశ్మీరీల హక్కులను కాలరాస్తూ గతేడాది మోడీ సర్కారు ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలకు తూట్లు పొడిచిందంటూ ఆమె బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు గతేడాది ఆగస్టు5న లేఖ రాశారని చెప్పారు. ఆమె వీసా గడువు ఈఏడాది అక్టోబర్‌ వరకు ఉన్నదని తెలిపారు. వీసా గడువు ముగియనప్పటికీ అధికారులు ఆమెను ఎందుకు తిప్పి పంపించారో తనకు అర్థంకాలేదని చెప్పారు. బ్రిటన్‌ ఎంపీకి జరిగిన అవమానంపై జాన్సన్‌ సర్కార్‌ భారత్‌ నుంచి వివరణ కోరే అవకాశముందని అన్నారు. కాగా, దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించలేదు. 2011 నుంచి అబ్రహామ్స్‌ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. తన వ్యక్తిగత పర్యటనపై రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించేందు కోసం వచ్చారు. బ్రిటన్‌లోని ఆల్‌పార్టీ పార్లమెంటరీ గ్రూపు ఫర్‌ కాశ్మీర్‌కు చైర్మెన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. మరోవైపు గతవారం భారత ప్రభుత్వం 20 మంది విదేశా దౌత్యాధికారులను కాశ్మీర్‌ పర్యటనకు తీసుకెళ్లింది. గత ఆరు నెలల్లో ఇది రెండో పర్యటన కావడం విశేషం.

Courtesy Nava Telangana