బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో రిషి సునక్‌
ఇప్పటికే ప్రీతి పటేల్‌, అలోక్‌ శర్మ 

లండన్‌, ఫిబ్రవరి 13: బ్రిటన్‌ నూతన ఆర్థిక మంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న పాక్‌ సంతతి నేత సాజిద్‌ జావిద్‌ స్థానంలో రిషి సునక్‌ను ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నియమించారు. 39 ఏళ్ల రిషి 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా 2015లోనే ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టిన రిషి.. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే (బ్రెగ్జిట్‌) విషయంలో అప్పటి ప్రధాని థెరిసా మేకు పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం గత ఎన్నికల్లో జాన్సన్‌కు జైకొట్టారు. రిషి సునక్‌ చేరికతో జాన్సన్‌ కేబినెట్‌లో భారత సంతతి మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ప్రీతి పటేల్‌, అలోక్‌ శర్మ మంత్రులుగా ఉన్నారు. కాగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్‌లో చదివిన రిషి సునక్‌.. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహమాడారు.

Courtesy Andhrajyothi