మోడీకి పాలగుమ్మి సాయినాథ్‌ సవాల్‌
మూడు వ్యవసాయ బిల్లులూ కార్పొరేట్ల కోసమే
ఏ ఒక్కదానిలోనూ ఎమ్‌ఎస్‌పీ ప్రస్తావన లేదు
రైతులకు అండగా సోషల్‌ మీడియా
అన్నదాతలపై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌ పెట్టాలి

హైదరాబాద్‌ : రైతుల పట్ల నిజమైన ప్రేమ ఉంటే ఐదు పాయింట్లు..ఐదు పేరాలతో ఒక బిల్లు ప్రతిపాదిస్తా? దాన్ని చట్టం చేసే దమ్ము మోడీ ప్రభుత్వానికి ఉందా? అని రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత, సీనియర్‌ జర్నలిస్ట్‌ పాలగుమ్మి సాయినాథ్‌ సవాల్‌ విసిరారు. అన్నదాతల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సెషన్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘వ్యవసాయ బిల్లులు…రైతులకు ఉరితాళ్లు’ అనే అంశంపై వెబినార్‌ను మంగళవారం సాయంత్రం నిర్వహించారు. దీనికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాయినాథ్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలూ కార్పొరేట్ల కోసమేననీ, వాటిలో ఏ ఒక్కదానిలోనూ ఎమ్‌ఎస్‌పీ(కనీస మద్దతు ధర) ప్రస్తావన లేదని విమర్శించారు. వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న రైతు పోరాటాలను తగ్గించి చూపేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, అందులో భాగంగానే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌, సినీ పరిశ్రమ డ్రగ్స్‌ కేసును తెరపైకి తెచ్చి మీడియా దృష్టిని మరల్చిందని వివరించారు. అయితే, రైతులే స్వచ్ఛందంగా వీడియోలు తీసి పోస్టులు చేశారనీ, వారి పోరాటాల కు సోషల్‌ మీడియా మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

కార్పొరేట్ల ప్రయోజనాల కోసం సంస్కరణలను మోడీ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ పెట్టి రైతుల నుంచి వ్యాపారులు పంటలను కొనకుండా చూడాలని 2011లో నేషనల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కన్‌జ్యూమర్‌ అపైర్స్‌ కమిటీకి చైర్మెన్‌గా నరేంద్రమోడీ చెప్పారనీ, ఇప్పుడాయన ప్రస్తుత బిల్లులో ఎక్కడా కనీస మద్దతు ధర గురించి ప్రస్తావించలేదని విమ ర్శించారు. మద్దతు ధర ఇవ్వకుండా 2020 కల్లా రైతుల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేస్తారని ప్రశ్నిం చారు. వ్యవసాయ మార్కెట్ల నిర్వీర్యం సరిగాదన్నారు. వాటి కమీషన్‌ ఏజెంట్లు వందలో 90 మంది ఉపాధి కోల్పోతారనీ, మిగతా పది మందిని మాత్రం కార్పొరేట్‌ కంపెనీలు తమ ఏజెంట్లుగా నియమించు కుంటాయని చెప్పారు. బీహార్‌లో మొక్కజొన్న, మహారాష్ట్రలో పత్తి, పాలరైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఉదహరణలతో వివరించారు. సరైన ధర కట్టివ్వకపోతే ఎక్కడైనా అమ్ముకోవచ్చునని చెప్పడ మూ బూటకమేనన్నారు. ఒప్పంద వ్యవసాయ చట్టం లోని సెక్షన్‌-19లో ఈ కేసులు సివిల్‌ కోర్టుల్లో చెల్లవనీ, క్రిమినల్‌ కోర్టులకు వెళ్లాలని స్పష్టంగా ఉందని చెప్పారు.

ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లను పంట దిగుబడి వచ్చే సమయంలో 20రోజులు ఆలస్యంగా తెరుస్తున్నారనీ, వాటిని 20రోజుల ముందే మూసేస్తున్నారని వివరించారు. దీంతో రైతు లు తమ అవసరాల విధిలేని పరిస్థితుల్లో మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్మేసుకుని నష్టపోతు న్నారన్నారు. వ్యాపారులు పంటలను తమ వద్ద పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుని రేట్లను పెంచే ప్రమాదం పొంచి ఉందన్నారు. పంట దిగుబడి సమయంలో రేట్లు తగ్గించి అది తమ చేతుల్లోకి వచ్చాక వ్యాపా రులు రేట్లు మళ్లీ పెంచుతారని విడమర్చి చెప్పారు. తాను చూసిన ప్రాంతాల్లో కేరళలోని వ్యవసాయ విధానం బాగుందన్నారు. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే తాను చెబినట్టుగా ఐదు పేరాగ్రాఫ్‌లు..ఐదు పాయింట్లతో చట్టం తెస్తారా? అని ప్రధాని మోడీకి సవాల్‌ విసిరారు. అందులో గిట్టుబాటు ధర ప్రక టన, ఎమ్‌ఎస్‌పీ కంటే తక్కువ ధరకు వ్యాపారులు పంట కొనుగోలు చేయకుండా చూడటం, పంట సేకరణ గ్యారంటీ, రైతుల అప్పుల రద్దు- రుణాలి వ్వడం, సహకారం సంఘాల బలోపేతం అంశాలను పొందుపర్చాలని సూచించారు.

రాజ్యాంగ లక్ష్యాలకు, ఫెడరలిజానికి మోడీ సర్కారు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పాలన్నారు. వ్యవసాయ బిల్లులను ఆమోదించుకునే క్రమంలో మోడీ సర్కారు నిసిగ్గుగా వ్యవహరించిందని విమర్శించారు. డివిజన్‌ కోరితే ఓటింగ్‌ పెట్టాలనే నిబంధనలకు పాతరేసి ప్రజాస్వామాన్ని ఖూనీచేసిందన్నారు. ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Courtesy Nava Telangana