– అంబులెన్సు వాగు దాటలేక గర్భిణీ కాలినడక
– కలెక్టర్‌ ఆగ్రహం..నివేదికకు ఆదేశం

గుండాల : ఏజెన్సీలో సరైన రహదారి లేక ఓ గర్భిణీకి అష్టకష్టాలు తప్పలేదు. వానలతో వాగులు ఉప్పొంగి అంబులెన్సు గ్రామానికి రాకపోవడంతో ఆమెకు కాలినడకనే దిక్కయ్యింది. అతికష్టమ్మీద ఆమె చేతులు పట్టుకుని బంధువులు వాగు దాటించి అంబులెన్సు వద్దకు చేర్చారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన గుండాల మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. దీనిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక అందజేయాలని ఆదేశించారు. రోళ్ళగడ్డ గ్రామానికి చెందిన ఈసం సంధ్యారాణికి శుక్రవారం పురిటినొప్పులు రావడంతో 108 కి సమాచారం అందించారు. కానీ మల్లన్నవాగు అవతలి వైపునే ఆగిపోవడంతో నిండు గర్భిణీని వాగు దాటించేందుకు నానా తంటాలు పడక తప్పలేదు. 6 కిలోమీటర్ల దూరం ఆటోలో తీసుకొచ్చి అక్కడి నుంచి ఇద్దరు పట్టుకొని వాగు దాటించారు. ఆ తర్వాత 108లో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ కాన్పు కాకపోవడంతో ఇల్లందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు చూసైనా గుండాల మండలంలోని వాగులపై వంతెనలు తొందరగా పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం
రోళ్లగడ్డకు చెందిన ఈసం సంధ్యారాణి పురిటి నొప్పులతో వాగు దాటుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చూసి తెలుసుకున్న కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న వాగుపై బ్రిడ్జి వానాకాలం నాటికి పూర్తి చేయాలని నిబంధన ఉన్నప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో గర్భిణీల వివరాలు సేకరించి ప్రసవ సమయాన్ని బట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆస్పత్రులకు తరలించాలని పలు సమావేశాల్లో ఆదేశించినా సంధ్యారాణి విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్యాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా వైద్యాధికారి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Courtesy Nava Telangana