• అధిక రక్తపోటు, మధుమేహ బాధితులకు..
  • ప్రాణాంతకంగా మారుతున్న అలసత్వం..
  • ఈ మరణాలకు బాధ్యులెవరని ప్రజల్లో ఆగ్రహం

రవి కుమార్‌ (పేరు మార్చాం) ఓ ప్రైవేటు ఉద్యోగి. ఇటీవలే అతనికి జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది ఎదురైంది. లక్షణాలను బట్టి తనకు వైరస్‌ సోకిందని అనుమానించాడు. పరీక్షల కోసం ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లాడు. తన సమస్యలను వివరించి.. కరోనా పరీక్షలు చేయాలని కోరాడు. కానీ, వైద్యులు సాధారణ జ్వరంగా భావించి, పరీక్షలు అవసరం లేదని ఇంటికి పంపేశారు. రెండు రోజుల తర్వాత శ్వాస సమస్య తీవ్రం కావడంతో ఓ కార్పోరేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. వారు నమూనాలను తీసి పరీక్షకు పంపగా పాజిటివ్‌ అని తేలింది. అప్పటికే అతడి ఊపిరితిత్తుల పనితీరు కొంత దెబ్బతింది. ప్రస్తుతం అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

బేగంబజార్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ఉద్యోగి(36) కి మే 2న తీవ్ర జ్వరం వచ్చింది. దగ్గు, జలుబు ఉండటంతో పలు సర్కారీ దవాఖానాల చుట్టూ తిరిగాడు. అన్నిచోట్లా.. అదేదో మామూలు జ్వరం అన్నట్టుగా మందులిచ్చి పంపించారు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతని రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. వైద్యులు ఆయనకు  పాజిటివ్‌గా నిర్ధారించి చికిత్స చేశారు. కానీ.. అతడి తండ్రికి (62), సోదరుడికి (28), భార్యకు (26), చివరకు అతడి పిల్లలకు కూడా వైరస్‌ సోకింది.

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధుల్లో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌కు జ్వరం, జలుబు వచ్చింది. తొలుత ఓ ఆస్పత్రికి తీసుకెళితే.. కొవిడ్‌ లక్షణాలు కావని ఇంటికి పంపారు. అనుమానంతో ఉన్నతాధికారులను కలిసి.. తనకు కరోనా పరీక్ష చేయించాలని ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన్ను హెడ్‌క్వార్టర్‌కు ఎటాచ్‌ చేశారు. అయినా ఆయన పట్టువదలకుండా పరీక్షల కోసం పట్టుబట్టి మళ్లీ రెండు ఆస్పత్రులకు వెళ్లారు. చివరికి పరీక్ష చేయగా.. వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన గాంధీలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారికి ఎదురవుతున్న పరిస్థితులివి. వైరస్‌ సోకిన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా చాలామందికి సకాలంలో నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు. దీనిప్రభావం మున్ముందు చాలా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతరదేశాలతో పోలిస్తే.. మనదేశంలో కరోనా బారిన పడిన చాలామందికి ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు. లక్షణాలు కనిపిస్తున్నవారిలోనూ అందరికీ పరీక్షలు చేయట్లేదు! రోగనిరోధక శక్తి చక్కగా ఉండి, బీపీ, మధుమేహం, గుండెజబ్బులు లేనివారికి వైరస్‌ సోకిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించినా.. కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువ.

కానీ, ఈ సమస్యలున్నవారికి సకాలంలో పరీక్షలు చేయకపోతే ప్రాణాలకే ముప్పు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో అత్యధికం ఇలాంటివే. ఉదాహరణకు.. ఇటలీలో కరోనాతోచనిపోయినవారిలో 69ు మందికి బీపీ, 32ు మందికి మధుమేహం, 27ు మందికి హృద్రోగాలున్నాయి. రాష్ట్రంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులంతా కలపి 80 లక్షల మంది దాకా ఉంటారని అంచనా. వైరస్‌ వ్యాప్తి పెరిగితే వారికి ప్రమాదమే.

ముందే గుర్తించగలిగితే..
కొవిడ్‌-19 పరీక్షలను సకాలంలో చేసి, వైరస్‌ సోకినవారిని గుర్తించి.. వారిని విడిగా ఉంచడం వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు. మరణాల సంఖ్య తగ్గుతుంది. అంతేకాదు.. ముందే గుర్తించగలిగితే తక్కువ ఖర్చులో చికిత్స పూర్తవుతుంది. వైరస్‌ ప్రభావం పెరిగితే ఆరోగ్యం క్షీణించి.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎంత మంచి చికిత్స చేసినా ఒక్కోసారి ఉపయోగం కూడా ఉండకపోవచ్చు. సకాలంలో పరీక్షలు చేయకపోవడం వల్ల సామాజికవ్యాప్తి ముప్పు ఉంటుంది. అప్పుడు అందరికీ వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఆ దశలో ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ఖర్చుచేసినా ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వందల్లో అవసరమవుతున్న వెంటిలెటర్లు వేలల్లో కావాల్సి వస్తాయి. ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా విస్తృతంగా పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని ఎపిడమాలజిస్టులు చెబుతున్నారు.

ఈ మరణాలకు బాధ్యులెవరు?
రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 10 మంది చనిపోయారు. 18 రోజుల వ్యవధిలో 95 మంది కన్నుమూశారు. మంచిర్యాల, షాద్‌నగర్‌, జనగాం జిల్లాలకు చెందిన మహిళలకు వైరస్‌ పాజిటివ్‌ అని తేలేసరికే ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ సోకి, సకాలంలో నిర్ధారణ కాక ఆరోగ్యం విషమించి చనిపోతే అందుకు ఎవర్నీ బాఽధ్యుల్ని చేయాలి? ఈ విషయంలో కచ్చితంగా సర్కారే బాధ్యత వహించాలని కొందరు మృతుల కుటుంబీకులు వాదిస్తున్నారు.  తాము విదేశాలకు వెళ్లలేదని, అక్కడికెళ్లి వైర్‌సను తెచ్చుకోలేదని, అలాంటప్పుడు కరోనా కారణంగా తామెందుకు చనిపోవాలని నిలదీస్తున్నారు.

సామాజిక వ్యాప్తి ముప్పు
రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. తక్కువ పరీక్షల వల్ల.. రోగలక్షణాలు కనిపించనివారి నుంచి వైరస్‌ ఇతరులకు భారీగా సోకి, సామాజిక వ్యాప్తికి దారితీస్తుంది. అదే జరిగితే.. వృద్ధులను కాపాడుకోలేని పరిస్థితి వస్తుంది. వైద్యులపై తీవ్ర పనిభారం పడుతుంది. మన దగ్గర ఉన్న సదుపాయాలు సరిపోవు. ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎక్కువ పరీక్షలు చేయాలి.
డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి,  ప్రెసిడెంట్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

అసలే మధుమేహ రాజధాని
మన భారతదేశానికి ‘డయాబెటిస్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’ అనే పేరుంది. అధికారిక గణాంకాల ప్రకారమే మనదేశంలో 2016 నాటికి 6.5 కోట్లమందికి పైగా మధుమేహ బాధితులున్నారు. అధిక రక్తపోటు బాధితుల సంఖ్య కూడా చాలా ఎక్కువే. మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. అందుకే మృతుల్లో 50 ఏళ్లు పైబడినవారు ఎక్కువగా ఉంటున్నారు. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే.. ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వస్తాయి. ఇటలీలోలాగా ఎవరికి చికిత్సనందించాలి? అనే సంకట స్థితి దాపురించే ప్రమాదం ఉంది.’

Courtesy Andhrajyothi