Hyderabad book fair పుస్తకాలు.. వ్యక్తుల నుంచి వ్యవస్థల వరకు జరిగే నిర్మాణంలో అసలు సిసలైన వేదికలు. సంపూర్ణ వ్యక్తిత్వంతో మనిషిని తీర్చిదిద్దడంలో వీటిది కీలక భూమిక. లక్షలాదిమందిని ప్రభావితం చేసిన రచనలు ఎన్నో..ఎన్నెన్నో. ప్రస్తుతం నగరంలో పుస్తకాల పండగ ఆరంభమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటింటా ఉండాల్సిన కొన్ని అపురూప పుస్తక నేస్తాలు, వాటి విశేషాలపై ‘సాహిత్య సుమాలు’ 

* జాతీయ పుస్తక ప్రదర్శన సందర్శిద్దామా మరి
ఎక్కడ: ఇందిరాపార్కు సమీప ఎన్టీఆర్‌ స్టేడియంలో
ఎన్ని రోజులు: ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు
మొత్తం ఎన్ని స్టాళ్లు: 330

సాహిత్య సుమాలు
పుస్తకం: పెద్దబాలశిక్ష
రచయిత: గాజుల సత్యనారాయణ

సాహిత్య సుమాలు

కథావస్తువు: విజ్ఞాన సర్వస్వం. తెలుగునాట ప్రతి ఇంటా ప్రామాణిక గ్రంథం. అన్ని వర్గాల వారికి వికాసాన్ని అందించే నేస్తం.

కాలం: 1832లో చదలవాడ సీతారామశాస్త్రి రూపొందించినా.. కొత్త అంశాలతో మళ్లీ ముందుకొచ్చింది.

ధర: రూ.180

శైలి: అరటి పండు ఒలిచి పెట్టినట్లు ప్రతి విషయాన్ని బొమ్మలతో సహా వివరిస్తుంది.  అప్పుడే మాటలు నేర్చిన పిల్లలకు సైతం అర్థమయ్యేలా సరళమైన భాష ఉపయోగించారు.

సందేశం: ప్రాథమిక విద్యలో ఇది తప్పనిసరిగా చదవాల్సిన పాఠ్యాంశం. అక్షరమాల నుంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పాఠాలూ ఉంటాయి.

ఇంట్లో ఎందుకు:  తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, చరిత్ర, సైన్స్‌, గణితం అన్నీ ఒకేచోట ఉండటం వల్ల పిల్లలు చదివేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఎక్కడ దొరుకుతుంది: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర.

విశేషాలు: దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయల మాటలకు ఇది అక్షరరూపం.  మరిచిపోయిన ఆటలు, పాటలు, అలవాట్లతో పాటు ఆధునిక కాలాన్ని పరిచయం చేస్తుంది. భాష నేర్చుకోవటమే కాదు, పద ప్రయోగం, వ్యాకరణం, సంస్కృతీ సంప్రదాయాలు, శాస్త్రసాంకేతిక తదితర అంశాలను పిల్లలు తేలికగా గ్రహించేందుకు అనుకూలం.

మెరుపు: ఆంగ్లేయులకు తట్టిన ఆలోచనకు బాలశిక్ష ప్రతిరూపం.

సాహిత్య సుమాలు
పుస్తకం:విశ్వంభర
రచయిత: డాక్టర్‌ సి.నారాయణరెడ్డి

సాహిత్య సుమాలు

కథా వస్తువు: ప్రకృతిలోని వైవిధ్యాలు.. మనిషిలోని భావోద్వేగాలు రెండింటి కలబోత ఇది. మనల్ని మనకు ఓ సారి గుర్తు చేసే రచన. చెట్టూ, పుట్ట, మట్టి, మిన్ను అన్నింటి ఆవశ్యకత చాటుతుంది.

ధర: రూ. 75

విశేషాలు: ఈ కావ్యానికి నాయకుడు మానవుడు, రంగస్థలం.. విశాల విశ్వంభర అన్నారు కవి. మనిషిలోని భిన్న మనస్తత్వాలు.. విభిన్నమైన ప్రవృత్తులు ఇంకెన్నో ఉంటాయి. వాటన్నింటినీ కవితా వరుసల్లో పేర్చారు. అందుకే.. 1988లో జ్ఞానపీఠ పురస్కారం దక్కించుకుంది. హిందీ, ఇంగ్లిషు భాషల్లోకి తర్జుమా అయింది.

శైలి: రోజూ వినిపించే మాటలతో పాడుకునేలా సాగే పద్యకావ్యం.

మంచిమాట: విశ్వంభర అంటే భూమి, ప్రపంచం. అలాగని భూగోళం అనే మట్టి ముద్దను గురించిన కావ్యం కాదు. మనిషి పొందిన చైతన్యస్థాయి, దానికి మూలమైన మట్టి.. వీటి సంబంధమే విశ్వంభర అన్నాడు ఆచార్య గోపి.

సందేశం: ఇదొక విశ్వరూప సందర్శనం. మనిషి జీవన వికాసాన్ని..  సున్నితమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: మనిషిలోని కోణాలను తరచి చూడాలంటే.. విశ్వంభర ఒక్కసారైనా చదవాలి. ఆ తర్వాత మళ్లీ చదువుతారు.

ఎక్కడ లభిస్తుంది: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రముఖ పుస్తక కేంద్రాల్లో..

సాహిత్య సుమాలు
పుస్తకం : కాళోజీ కథలు
రచయిత: కాళోజీ నారాయణరావు

సాహిత్య సుమాలు

కథా వస్తువు: ప్రజా ఉద్యమంలో ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేయాలని, ప్రజా జాగృతికి కాళోజి సమాజాన్ని వస్తువుగా చేసుకొని చేసిన కథల సంపుటి.

ధర: రూ. 70

శైలి: ముక్కుసూటిగా ఉండే కాళోజీ రచన. తెలంగాణ మాండలికం, కొంత గ్రాంథీకం ఉంటుంది. ‘నా గొడవ’ పుస్తకం అర్థం కావాలంటే ముందీ గొడవ వినాలంటారు వరవరరావు.

సందేశం: ‘ఆకలికి అన్నము దొరికినదె చాలు అడుక్కొని తింటేమి?’ అనే భావాలు ప్రతి లైనులో దర్శనమిస్తాయి.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: ఒక జాతి వందేళ్ల చరిత్రను కథల రూపంలో ఆకళింపు చేసుకోవచ్చు. జాతి పడిన తపనను తెలుసుకోవచ్చు.

ఎక్కడ లభిస్తుంది: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌజ్‌..

విశేషాలు: ‘మన ఆలోచనలను ప్రకటించడానికి భాష అవసరం. ఆ భాష రెండుతీర్లు. ఒకటి బడి పలుకుల భాష. రెండోది పలుకుబళ్ల భాష. నాది పలుకుబళ్ల భాష. ఎక్కడయినా పలుకుబళ్ల భాష కావాలె. పలుకుబళ్ల భాషయితే అవతలోనికి తెలుస్తది భాష గురించి నేను చెప్పేదిదే.’ అంటూ కాళోజీ తెలంగాణ భాషలోని ఔన్నత్యాన్ని చెప్పకనే చెప్పారు.

మంచిమాట: ‘కాళోజీ..తెలుగు జాతి 87 ఏళ్ల సంచలన జీవితానికి నిలువుటద్దం.’ వరవరరావు మాట.

సాహిత్య సుమాలు
పుస్తకం:మహాప్రస్థానం
రచయిత: శ్రీశ్రీ

సాహిత్య సుమాలు కథా వస్తువు: సమాజమే ఈ పుస్తకానికి కథావస్తువు. మేల్కొలుపే ఈ సిరా ఉద్దేశం. ఉద్యమానికి ఉద్యుక్తులను చేయడానికే కదిలిందీ కలం అని చదివితే తప్పక తెలుస్తుంది.

ధర: రూ. 80

విశేషాలు: ఇది కవులు, రచయితలకు పరిశోధన గ్రంథం. ఎంతమంది మేధావులు, విద్యావంతులు దానిపై అధ్యయనం చేశారనేది లెక్కబెట్టడం కష్టమే. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి’ అంటూ శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన సాహిత్యం.. నిప్పులు చెరిగింది.

మెరుపు: గురజాడ తెలుగు కవిత్వానికి ఒక కొత్త మలుపు చూపితే.. ఆ మలుపును మహాప్రస్థానం గీతాలతో మరింత వెడల్పుచేశాన’ంటూ ‘నా మాట’లో శ్రీశ్రీ రాశారు.

శైలి: కవిత్వం, గేయం.. అని ఎవరెన్ని పేర్లతో పిలిచినా.. చదివిన వారెవరైనా అది ఓ విప్లవం అంటారు. ప్రాసలతో పదాలు పరుగు తీస్తున్నట్లు.. అనిపిస్తుంది.

సందేశం: అందమైన అబద్ధాలలో కన్నా, నిష్టూరమైన నిజంలోనే మంచి కవిత్వం దర్శనీయ మవుతుందని అంటారు కవి.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: ప్రతి తరాన్ని కదిలిస్తూ.. మరో ప్రపంచం వైపు అడుగులు వేయమంటూ.. పురిగొల్పుతుంది.

ఎక్కడ లభిస్తుంది: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రముఖ పుస్తక కేంద్రాల్లో..


సాహిత్య సుమాలు
పుస్తకం: అమరావతి కథలు
రచయిత:సత్యం శంకరమంచి

సాహిత్య సుమాలు

కథా వస్తువు: పుట్టిపెరిగిన ఊరితో అనుబంధం. చారిత్రక నేపథ్యం. తన చుట్టూ జరిగే సంఘటనల సమాహారాన్ని పేర్చి చేసిన రచన అమరావతి కథలు.

ధర: రూ. 300

మంచిమాట: కథా సంపుటి 1979లో ఆంధ్రరాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంది. ఈ కథలను హిందీలో ధారావాహికగా తీశారు. కథా  సంపుటిలో 100 కథలున్నాయి.

సందేశం:  సామాజిక కోణాన్ని, మనిషిలోని భిన్న మనస్తత్వాలను వివరిస్తారు. అందులోనే మంచి, చెడులను విశ్లేంషించుకోవాలి.

ఇంట్లో ఎందుకు: కథల్లోని ప్రతి ఒక్క పాత్ర జీవన నైపుణ్యాలు నేర్పుతుంది. ఆ తెలుగుతనం చూసి ఏం కోల్పోయామో గుర్తుకొస్తాయి.

ఎక్కడ దొరుకుతుంది: నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌజ్‌

విశేషాలు:  సామాన్యుల నుంచి రాజుల పాలన వరకూ భిన్న అంశాలను స్పృశించారు. కొన్ని కథల్లోని పాత్రలు దైనందిన జీవితంలో మన ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తాయి. ఇవి కథలుగా భావించాలా.. ఆ నాటి ఘటనలకు.. చారిత్రక అంశాలుగా చదవాలా! అనే అనుమానం పాఠకులకు వస్తుంది. కథలన్నీ అమరావతిలో జరిగినవే కావటం విశేషం. ప్రతి కథలోనూ వైవిధ్యం పాఠకులను ఆకట్టుకుంటుంది.

మెరుపు: అద్భుతమైన కథలకు బాపూ గీసిన బొమ్మలు నిండుతనం తెచ్చాయి.

సాహిత్య సుమాలు
పుస్తకం: పాకుడురాళ్లు
రచయిత: డాక్టర్‌ రావూరి భరద్వాజ

సాహిత్య సుమాలు

కథా వస్తువు: సినిమా రంగుల వెనుక చీకటి వెలుగులను ప్రపంచానికి తెలియజేయడం. పుస్తకం చదువుతుంటే ఓ సినిమా చూస్తున్నంత ఆసక్తి కలుగుతుంది. కథాకాలం: 1965

ధర: రూ. 290

విశేషాలు: గుంటూరుకు చెందిన రంగస్థల కళాకారిణి మంగమ్మ.. సినీ రంగంలో మంజరిగా వెలుగుతుంది. ఆ కాలంలో ఆయా రంగాల్లో పరిస్థితి, మహిళల స్థానం పాత్ర పరిచయం చేస్తుంది. మహిళలను అప్పట్లో సమాజం ఎలా చూసేది, చివరి దశలో మంజరికి ఎందుకు ఇబ్బందులు వచ్చాయో రచయిత చక్కగా వివరించారు.

మెరుపు: తెలుగు కలం సృజనను జ్ఞానపీఠంతో దశదిశలా చాటిన నవల.

శైలి: సున్నితమైన అంశాలను గుదిగుచ్చి హృదయానికి హత్తుకునేలా పేర్చిన అక్షర మాలిక. రచయిత తన వృత్తి రీత్యా చేసిన ‘మాయ జలతారు’అనే రచనలే ‘పాకుడు రాళ్ల’గా కూర్చారు.

సందేశం: సినీ రంగం పాకుడు రాయి లాంటిది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే జారి పడిపోయే ప్రమాదం ఉంది.

ఇంట్లో ఎందుకు..: అతివిశ్వాసం, అమాయకత్వం, అహంకారం మధ్య సన్నని రేఖను దృష్టిలో ఉంచుకోపోతే ఎంతటి వారైనా పాతాళానికి పడిపోతారని గుర్తు చేస్తుంది.

ఎక్కడ లభిస్తుంది: విశాలాంధ్ర, ఆన్‌లైన్‌లోనూ దొరుకుతుంది.

సాహిత్య సుమాలు
పుస్తకం: మైదానం
రచయిత: చలం

సాహిత్య సుమాలు కథా వస్తువు: స్త్రీ స్వేచ్ఛ. స్త్రీ, పురుషుల మధ్య సున్నితమైన అనుబంధాలను సాహసోపేతంగా చూపిన నవల.

కథాకాలం: 1960

ధర: రూ. 100

శైలి: విలువల సాకులు, ముసుగు దొంతరలు లేకుండా అక్షరాలు స్వేచ్ఛగా విహరించి.. సమాజంలోని ఓ సున్నితత్వాన్ని బహిర్గతం చేసిన నవల. విమర్శలూ మూటగట్టుకుంది.

సందేశం:  మైదానం ద్వారా స్త్రీ స్వేచ్ఛను.. ఆమె ప్రేమను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: ప్రేమ, ఆప్యాయతలు ఒక్కటే కాదు.. భద్రత, భరోసా ముఖ్యమేనని స్త్రీ, పురుషులను అప్రమత్తం చేస్తుంది.

ఎక్కడ లభిస్తుంది: ప్రముఖ పుస్తక శాలల్లో, ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చు.

విశేషాలు: సాధారణ గృహిణి స్వేచ్ఛ, ప్రేమ కోసం ఎంతగా తెగించిందనే విషయాన్ని రాజేశ్వరి పాత్ర ద్వారా చెప్పారు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు తెలిసింది భర్త, ఇల్లు. అమీర్‌ అనే యువకుడి వ్యామోహంలో పడి తాను గడుపుతున్న బందీఖానా నుంచి బయటపడుతుంది. స్వేచ్ఛను ఆస్వాదిస్తుంది. కానీ ఆ నాటి సమాజం వీటిపై ఎలా స్పందించిందో ఆద్యంతం చదివిస్తుంది.

మెరుపు:  దశాబ్దాల క్రితమే సహజీవనం అంశాన్ని చర్చకు లేపారు రచయిత.

సాహిత్య సుమాలు
పుస్తకం: అసమర్ధుని జీవయాత్ర
రచయిత: త్రిపురనేని గోపీచంద్‌

సాహిత్య సుమాలు

కథా వస్తువు: మానవ సంబంధాలు.. జమీందారి వ్యవస్థ.. గ్రామీణ వాతావరణం. వంశ ప్రతిష్ఠ నిలబెట్టే సాకుతో ఓ మనిషి తనను తాను మరిచిపోయిన వైనం.

ధర: రూ. 100

శైలి: భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో సంబంధంలేని నవల. భావోద్వేగంగా సాగే రచన. సులువుగా చదువుకునేలా ఉంటుంది. సాహితీ ప్రపంచంలో ప్రత్యేక స్థానం పొందింది.

సందేశం: కాలంతోపాటు మార్పును ఆహ్వానిస్తూ ముందుకు సాగాలి. సిద్ధాంతాలే జీవితాలు కారాదు.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: సమాజంలో మీ స్థానం ఎక్కడ అని పుస్తకం ప్రశ్నిస్తుంది.. సమాధానం వెతకమంటుంది. తనకుమాలిన ధర్మం తగదంటుంది.

ఎక్కడ లభిస్తుంది: ప్రముఖ పుస్తక దుకాణాలు, ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చు.

విశేషాలు: జమిందారీ వంశం నుంచి వచ్చిన సీతారామారావు పాత్ర ద్వారా నాటి కాలమాన పరిస్థితులను కళ్లకుకట్టారు. సీతారామారావు తండ్రి ‘మన వంశం పేరు నిలబెట్టు.’ అని చెప్పి కనుమూస్తాడు. అప్పటి నుంచి పక్కవారి పొగడ్తలతో పెరిగి, కేవలం కీర్తికి దాసోహం అవుతాడు.  సీతారామరావు చివరికి ఏవిధంగా మిగిలిపోయాడో వివరిస్తుందీ పుస్తకం.

మెరుపు: సమర్ధుడెవరు, అసమర్ధుడెవరు అనే విచిత్ర ప్రశ్నకు సమాధానం  చెబుతుందీ గ్రంథం.

సాహిత్య సుమాలు
పుస్తకం: అమృతం కురిసిన రాత్రి
రచయిత: బాలగంగాధర తిలక్‌

సాహిత్య సుమాలు

కథా వస్తువు: ఒక సామాజిక జీవి భావాలు, భావోద్వేగాలు. గల్లీ నుంచి దేశాల సంబంధాలు. ఇంకా.. కవితలతో కాలాన్ని.. కరగని మనసులను కదిలించి చిరంజీవిగా నిలిచారు తిలక్‌.

ధర: రూ. 140

శైలి: అందమైన భావాలను, అద్భుతమైన భావోద్వేగాలను వచన కవిత్వంలో పలికించారు. 94 కవితలతో 200 పేజీల కవితాసంపుటి ఇది.

సందేశం: మనుషుల మధ్య హద్దులు, దేశాల మధ్య సరిహద్దులను చెరిపివేస్తూ.. మానవత్వంతో మెలగాలి.

ఇంట్లో ఎందుకు ఉంచాలి: సామాన్యుడి అంతరంగాన్ని ప్రాసాయుక్తంగా పాడుకునేలా, కాలాలకతీతంగా పదాల దొంతరల్లో చూసుకునేందుకు.

ఎక్కడ లభిస్తుంది: నవ చేతన పబ్లిషింగ్‌ హౌజ్‌, ప్రజాశక్తి, విశాలాంధ్ర పుస్తకశాలల్లో..

విశేషాలు: ఎవ్వరూ లేని సమయాన కవి అనుభూతి చెందిన ఉద్వేగాలకు రూపం అమృతం కురిసిన రాత్రి. వ్యక్తులను, వ్యక్తిత్వాలను, వ్యవస్థలను దగ్గరగా చూసి సున్నితంగా ఎత్తి చూపారు. అభ్యుదయ భావాలను రమణీయంగా పలికించారు. మానవత్వంతో స్పందించి అక్షరాలకు జీవం పోశారు. ట్యాంక్‌బండ్‌ నుంచి ప్రపంచ యుద్ధాల్లో మరణించిన సైనికుల భార్యల అంతరంగాన్ని కవిగా చూశాడు.

మెరుపు: 1970లోనే ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకుంది.


సాహిత్య సుమాలు
పుస్తకం: చిల్లర దేవుళ్లు
రచయిత: దాశరథి రంగాచార్య

సాహిత్య సుమాలు

కథా వస్తువు: తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం పాలనలో తెలంగాణ పరిస్థితులను కళ్లకుకట్టిన రచన. పల్లెల్లో జరిగిన వాస్తవాలను రక్తికట్టించారు. కథాకాలం: 1936-40

ధర: రూ. 60

విశేషాలు: బతుకు బాటలో విజయవాడ నుంచి వచ్చిన సారంగపాణి గడీలో సంగీత గురువుగా చేరుతాడు. ఈ ప్రధాన పాత్ర.. నిజాం ఇచ్చిన అధికారంతో గ్రామాల్లో దొర, కరణం సాగించే దౌర్జన్యకాండ, గడీల పెత్తనం, భూస్వామ్య వ్యవస్థను తేటతెల్లం చేస్తుంది. నిజాం ప్రతినిధులుగా చెప్పుకొనే కొంత మంది వల్ల ఎలా జీవించాలో కూడా తెలియని జనాల వేదన పుస్తకంలో కనిపిస్తుంది.

శైలి: అచ్చమైన తెలంగాణ యాస పదాలతో చదివేందుకు సౌకర్యంగా సాగే నవల. బాంచెన్‌ కాల్మొక్తా, బందూక్‌, కరణీకం.. వంటి ఎన్నో పదాలను పరిచయం చేస్తుంది.

సందేశం: సమాజంలో చిల్లర దేవుళ్ల రాజ్యం పోవాలంటే మనిషి తనలోని జ్ఞానాన్ని వికసింపజేసుకోవాలి.

ఇంట్లో ఎందుకు ఉంచుకోవాలి: ప్రశ్నించే తత్వం నేర్పుతుంది. యాసలో గొప్పను రుచి చూపిస్తుంది. ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తుంది.