హైదరాబాద్‌: బోనాల ఉత్సవాలు ఎవరి ఇళ్లల్లో వారు జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ ఏడాది ఆషాడం బోనాలు సామూహికంగా నిర్వహించడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు. అమ్మవార్లకు దేవాదాయశాఖ అధికారులే పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఆషాడం బోనాల నిర్వహణపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని అధ్యక్షతన కీలక సమావేశం బుధవారం జరిగింది. మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, వివిధ ఆలయాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

కరోనా దృష్ట్యా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ఈ ఏడాది బోనాలు ఇళ్లవద్దనే జరుపుకోవాలని అనంతరం తలసాని చెప్పారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారు, సికింద్రాబాద్‌ ఉజ్జాయిని మహంకాళి, లాల్‌ దర్వాజ ఉమ్మడి ఆలయాల్లో ఈ ఏడాది పురోహితులు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పూజలు, అలంకరణ, బోనం సమర్పిస్తారన్నారు. ఆడపడుచులందరూ తమ తమ ఇళ్లలోనే బోనాల పండగ జరుపుకోవాలని కోరారు. బోనాల జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉందని అందుకే ఈ సారి బోనాలు జరపడం లేదని మంత్రి వివరించారు.

నచ్చిన పద్ధతిలో బోనం తయారు చేసి సూర్యభగవానుడికి చూపించి ఇంట్లోనే పూజలు నిర్వహించా ల్సిందిగా మంత్రి తలసాని సూచించారు. నాయిని నర్సింహారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, రాజాసింగ్‌, దానం నాగేందర్‌, మాగంటి గోపినాథ్‌, కాలేరు వెంకటేశ్‌, సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌, ఎగ్గే మల్లేశం, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కలెక్టర్‌ శ్వేత మహంతి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, హైదరాబాద్‌, రాచకొండ కమిషనర్లు అంజనీ కుమార్‌, మహేష్‌ భగవత్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Courtesy Andhrajyothy