ఎస్పీఎం హౌస్‌ నిర్మాణంలో కూలిన మట్టి పెళ్లలు..
మరో ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మృతులు, క్షతగాత్రులు జార్ఖండ్‌ వాసులు

కాగజ్‌నగర్‌ : కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూరు పేపర్‌ మిల్లు (ఎస్పీఎం)లో శనివారం రాత్రి  బాయిలర్‌ హౌస్‌ నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. పై నుంచి మట్టిపెళ్లలు కూలిపడటంతో ముగ్గురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు. మృతులను కాంట్రాక్టు కార్మికులు రఘునాథ్‌ రామ్‌ (38), చోటు బనియా(25), రంజీత్‌(33)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వారిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులంతా జార్ఖండ్‌ వాసులే.

ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. ఎస్పీఎంలో నాలుగు నెలల నుంచి నూతన బాయిలర్‌ హౌస్‌ పిల్లర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి 12 మంది కార్మికులు విధులు నిర్వహించేందుకు వచ్చారు. రాత్రి 11:30 గంటల సమయంలో బాయిలర్‌ పిల్లర్‌కు 11 ఫీట్ల లోతున బైండింగ్‌ (ఇనుపతీగలు కట్టడం) పనులు చేసేందుకు వారంతా కిందకు దిగారు. అప్పటికే పిల్లర్‌ గుంతలో నీరు చేరి ఉంది. కార్మికులు పనుల్లో ఉండగానే పైనుంచి మట్టి పెళ్లలు కూలాయి. గుంత అడుగుభాగంలో ఉన్న కార్మికులు రఘునాథ్‌ రామ్‌, చోటు బనియా, రంజీత్‌ మట్టిపెళ్లలో చిక్కుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనున్న కార్మికులు కేకలు వేయడంతో వెంటనే తోటి కార్మికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎక్స్‌కావేటర్‌ సహాయంతో కూలిన మట్టిని తొలగించారు. క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పైన ఉన్న మరో నలుగురు కార్మికులు  సురక్షితంగా బయటకు వచ్చారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునఃప్రారంభమైన తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. కాగా ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారనే విషయాన్ని అధికారులు, యాజమాన్యం మీడియాకు తెలుపకపోవటం పలు అనుమానాలకు దారి తీసింది.

రాత్రి వేళలో బైడింగ్‌ పనులు ఎందుకు చేపట్టారని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో పాటు ఏఎస్పీ వైవీఎస్‌ సుదీంధ్ర, డీఎస్పీ స్వామి సంఘటన స్థలాన్ని సందర్శించి రెస్క్యూ టీం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. బాఽధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం చేస్తామని, యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని కోనప ప్రకటించారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు హరీశ్‌బాబు డిమాండ్‌ చేశారు. కార్మికుల హక్కులను తొక్కేందుకు యాజమాన్యం యత్నిసో ్తందని, ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Courtesy Andhrajyothi