లోతుకు పడిపోయిన బోటు
కచ్చులూరు మందం వద్ద దుర్ఘటన
గల్లంతైనవారిలో జిల్లాతోపాటు విశాఖ, వరంగల్‌, హైదరాబాద్‌, పశ్చిమ వారే అధికం
ఘోర ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని నిర్థారణ
వరద ఉధృతి మరో కారణం
నేడు సైడ్‌స్కాన్‌ సోనార్‌తో గాలింపు
నేడు సీఎం జగన్‌ రాక 
ఇది ఘోర విషాదం. వరద గోదావరిలో వారి ప్రయాణం అంతిమ యాత్రఅయ్యింది. ప్రకృతి సోయగాలను, గోదావరి అందాలను తిలకించాలనే వారి స్వప్నాలన్నీ గోదారిలో కలిసిపోయాయి. కేవలం కొంతమంది నిర్లక్ష్యం ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. వరద గోదావరిలో ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా, బోట్ల యాజమాన్యాలు యథేచ్ఛగా పాపికొండల యాత్ర కోసం టిక్కెట్లు విక్రయించేశాయి. ఈ ప్రమాదకర ప్రయాణాన్ని అడ్డుకోవాల్సిన అధికారులంతా పట్టించుకోవడమే మానేశారు. పాపికొండల బోట్లు తిరుగుతునా ్నయని, ఇది ప్రాణాంతకర ప్రయాణమని ఆంధ్రజ్యోతిఆదివారం నాడు ఒక కథనం ద్వారా హెచ్చరించినా అటువైపు చూసిన అధికారే లేరు. జరిగిన ఘోరం ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కచ్చులూరు మందం వద్ద జరిగిన ప్రమాదంతో గోదావరి తీరం.. కన్నీటి సంద్రమే అయ్యింది. 
 వాళ్లంతా ఎక్కడెక్కడివాళ్లో… గోదావరి అందాలను వీక్షించి..పాపికొండల సొగసులు చూసొద్దామని ఇక్కడకు వచ్చారు.. భార్య,భర్తలు.. తల్లీకొడుకులు.. స్నేహితులు.. చుట్టాలు.. పిల్లలు.. ఇలా ఆదివారం సరదాగా గోదారమ్మ అందాలు చూసి పరవశించడానికి వాలిపోయారు. ఆనం దంగా…జాలీగా..హుషారుగా.. మునుపెన్నడూ చూడని గోదారమ్మను చూసేందుకు పయనయ్యారు. ఉదయం 9.30 గంటలకు రాయల్‌ వశిష్ఠ బోటు ఎక్కి పాపికొండలుకు ప్రయాణమయ్యారు…. గోదారి పులకరింపులు.. డ్యాన్స్‌లు.. ఆటపాటల నడుమ సరదా సరదాగా విహారం సాగించారు. సరిగ్గా భోజనం సమయానికి అంతా కలిపి బోటుపైకి ఎక్కారు.. ఈలోపు ఒక్కసారిగా కచ్చులూరు మందం వద్దకు వచ్చేసరికి ఉలికిపాటు. బోటు ఒక్కసారిగా కుదుపులకు గురైంది.. అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఒక్క సారిగా హాహాకారాలు… ప్రాణభయంతో అరుపులు… ఈలోపు గోదావరి నీటిసుడుల్లో చిక్కుకుని బోటు మునిగిపోయింది… ఈ ఘోర విషాదం నుంచి తప్పించుకోలేక, ప్రాణాల నుంచి బయట పడలేక…72 మంది పర్యాటకుల్లో 40మందికిపైగా గల్లంతయ్యారు. మరో 8 మంది మృతి చెందారు.. 24 మంది సురక్షితంగా బయటపడ్డారు. గోదావరి చరిత్రలో జిల్లాలో మరో ఘటన ఆదివారం చోటుచేసుకుని పెను విషాదం నింపింది.
 ఇలా జరుగుతుందని అనుకోలేదు…
జిల్లాతోపాటు విశాఖ, పశ్చిమగోదావరి, వరంగల్‌, హైదరా బాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఆదివారం ఉదయం 9.30 గంటలకు 72 మంది పర్యాటకులతో రాయల్‌ వశిష్ఠ బోటు పోశమ్మ గండి నుంచి బయల్దేరారు. దేరారు. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు దేవీపట్నం చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేయించుకుంది. అయితే ఆ సమయంలో తనిఖీ చేసిన అధికారులు గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందని…. పాపికొండల విహారం సరికాదని అభ్యం తరం వ్యక్తం చేశారు. కానీ పర్యాటకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను అనుమతించకపోతే టిక్కెట్లు ఎందుకు విక్రయించారని కొందరు పర్యాటకులు గొడవపడ్డారు. అయితే అధికారులు పాపికొండలు చూడ్డానికి అంగీకరిస్తూ పర్యాట కులంతా లైఫ్‌ జాకెట్లు ధరించాలని హెచ్చరించారు. దీంతో అంతా వీటిని ధరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బోటు బయలుదేరిన తర్వాత 12.30 గంటలకు కచ్చులూరు ప్రాంతానికి చేరుకుంది. అప్పటికే బోటులో సాంస్కృతిక ప్రదర్శనలు పూర్తవడంతో భోజనం కోసం బోటుపైకి రావాలని నిర్వాహకులు పిలిచారు. దీంతో బోటు కింద అంతస్తులో ఉన్న పర్యాటకులు పైకి వెళ్లారు. కొందరు భోజనాలు చేస్తున్నారు.
ఈలోపు బోటు కచ్చులూరు మందం వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వరద ప్రవాహం ఎక్కువవడంతో ఊగిసలాటకు గురైంది. ఇక్కడ గోదావరి చాలా ఉగ్రరూపంలో ఉంటుంది. సముద్రం కెరటాల ఉధృతి తరహాలో వరద ప్రవాహం ఒత్తిడికి కచ్చులూరు మందం వద్ద ఉన్న కొండకు నీరు బలంగా తాకి సుడులు తిరుగుతూ వెళుతోంది. ఈ క్రమంలో బోటు నీటి సుడికి దూరంగా గోదావరి మధ్యలోంచి ప్రయాణించాలి. కానీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా బోటు నీటి సుడులను తట్టుకోలేక విపరీతంగా కిందకు, పైకి ఊగింది. అటు వరద ప్రవాహం ఒత్తిడికి కూడా తోడవడం, బోటు ఊగిసలాటతో ఒక్కసారిగా పర్యాటకులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో వణికి పోయారు. కొందరైతే జారుకుంటూ ఓ పక్కకు ఓరిగి పోయారు. ఈక్రమంలో బోటుపై మరింత ఒత్తిడి పెరిగింది. నీటిలోకి స్వల్పంగా మునిగింది. దీంతో లైఫ్‌ జాకెట్లు వేసుకున్న పర్యాటకులు బోటుపైకి ఎక్కేశారు.
మిగిలిన వారు పక్కకే ఉండిపోయారు. ఈక్రమంలో బోటు తీవ్రంగా ఊగిసలాటకు గురై మునిగిపోయింది. అదే సమయంలో భారీగా అరుపులు, బోటు శబ్దం రావడంతో సమీపంలో నాలుగు చిన్నపాటి బోట్లపై చేపలవేట సాగిస్తోన్న తూటుగంటు, మత్స్యకారులు తమ పడవలతో 16 మందిని కాపాడగలిగారు. కానీ ఈలోపు బోటు పూర్తిగా నదిలోకి మునిగిపోవడంతో అంతా గల్లంత య్యారు. దీంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దుర్ఘటన జరిగిన సమయంలో చాలా మంది పర్యాటకులు లైఫ్‌జాకెట్లు ధరించలేదు. ఉక్కపోత కారణంతో అప్పటివరకు వేసిన జాకెట్లు తీసేశారు. దీంతో బోటు మునిగిన తర్వాత చాలామంది నలుదిక్కులా కొట్టుకుపోయారు. కాగా పిట్టల లంక నుంచి అయితే బోటు క్షేమంగా గమ్యస్థానం చేరుకునే వీలుండేది. కానీ దూరం అనే నెపంతో బోటు నిర్వాహకులు కచలూరు మందంవైపు వెళ్లారు. ఇదికాస్తా విషాదం నింపింది.
  జాడ లేదే…
గోదావరిలో గల్లంతైన 40మందికిపైగా పర్యాటకులతోపాటు మృతిచెందిన 8మందికి సంబంధించిన చిరునామాలు తేలలేదు. వీరు బోటు ఎక్కుతున్నప్పుడు పూర్తివివరాలు తీసుకుని భద్రపర్చాల్సి ఉండగా అదేం చేయలేదు. దీంతో ఎవరు ఎక్కడివారో కనిపెట్టలేని పరిస్థితి. అయితే గల్లంతైన 40మందికిపై పర్యాటకుల్లో ఎంతమంది సజీవంగా దొరుకుతారనే దానిపై అధికారుల్లోను ఆశలు అడుగంటాయి. ఉధృత వరదలో ప్రాణాలు కాపాడుకోవడం అసాధ్యమని, పైగా పర్యాటకుల్లో చాలామందికి ఈత కూడా రాని పరిస్థితుల్లో సజీవంగా ఉండకపోవచ్చని తద్వారా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
 రూ.10 లక్షల సాయం…
గోదావరి వరద మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. అటు మృతుల్లో తెలంగాణకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరికి అక్కడ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున సాయం ప్రకటించింది. అటు బాధితులకు, మృతుల కుటుంబాలకు జరిగిన దుర్ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ తదితరులు దిగ్భారంతి వ్యక్తం చేశారు. తమతమ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అటు మంత్రులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అయితే జగన్‌ రాజమండ్రి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో మాట్లాడారు. తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మరో వైపు దుర్ఘటన నేపథ్యంలో పాపికొండలకు వెళ్లే బోట్ల అనుమతులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు.
 అర్ధరాత్రి అయినా…
గోదావరి విషాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, నేతలు, మంతుల్రు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు..ఆరు అగ్నిమాపక సిబ్బంది.. నేవీ, గజ ఈతగాళ్ల బృందాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. అలాగే రెండు హెలీకాఫ్టర్లు, 8బోట్లు… ఆస్కా లైట్లతో గాలింపు చేస్తున్నారు. అటు సోమవారం ఉత్తరాఖండ్‌ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్‌స్కాన్‌ సోనార్‌తో మృతదేహాల గాలింపు చేయనున్నాయి.
గుర్తించడం ఎలా?
ప్రమాదం జరిగిన స్థలం వద్ద ఎలాంటి విద్యుత్‌ వసతిలేదు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా లేదు. దీంతో ఆదివారం రాత్రి అయ్యేసరికి సహాయకచర్యలు అతికష్టంగా మారాయి. కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులు దగ్గర వుండి పరిస్థితిని సమీక్షించారు. అయితే గల్లంతైన పర్యాటకులను హెలికాఫ్టర్‌తో గాలించినా ప్రయోజనం దక్కలేదు. వాస్తవానికి వరద లేకపోయి ఉంటే ఆచూకీ కొంతవరకైనా లభించేది. కానీ వరద ఉధృతికి ఎవరు ఎక్కడకు కొట్టుకుపోయారో అంతుచిక్కని పరిస్థితి. మరోవైపు పర్యాటకులు బోటు ఎక్కే సమయంలో వారి వివరాలు పూర్తిగా లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇవ్వడం కూడా కష్టంగా మారింది. ఎనిమిది మృతదేహాలు లభించగా అందులో కొందరిని గుర్తుపట్టడం కుదరలేదు. ఈ మృతదేహాలను ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బోటెలా వెళ్లింది?
వరద వస్తుంటే ఎవరు అనుమతిచ్చారు?..
పాపికొండలు బోట్లపై నియంత్రణేదీ?
2.5 లక్షల క్యూసెక్కుల నీరుంటేనే పర్మిషన్‌
ప్రమాద సమయంలో 5 లక్షల క్యూసెక్కులు
వరద ఉధృతి తట్టుకోలేకే ఘోర ప్రమాదం
గతంలో వీటిపై నీటిపారుదల శాఖ అజమాయిషీ
కృష్ణా నదిలో ప్రమాదం తర్వాత దాని పవర్‌ కట్‌
బాధ్యతలన్నీ కాకినాడ పోర్టుకు అప్పగింత
కొరవడిన పోర్టు అధికారుల పర్యవేక్షణ
గోదావరికి వరద పోటు సమయంలోనూ పాపికొండలుకు పర్యాటక బోట్లు బరితెగించి ప్రయాణిస్తున్నాయి. పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వరద సమయంలో ఈ బోట్లను నియంత్రించాల్సిన కాకినాడ పోర్టు అధికారులు కూడా తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఘోరప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి గోదావరిలో వరద ప్రవాహం రెండున్నర లక్షల క్యూసెక్కుల లోపు ఉంటేనే నదిలో బోటు ప్రయాణానికి అనుమతివ్వాలి. కానీ ఆదివారం వరద ఐదు లక్షల క్యూసెక్కులకు పైనే ఉంది. పైగా పాపికొండలు వైపు వెళ్తున్న బోటు భారీ వరద ప్రవాహానికి ఎదురుగా వెళ్తుండడం వల్లే ప్రమాదం జరిగింది. గోదావరికి వరదపోటు ఉన్నప్పుడు పర్యాటక బోట్ల ప్రయాణానికి ఇదివరకు ధవళేశ్వరంలోని నీటిపారుదల శాఖ అనుమతి ఇచ్చేది కాదు. కానీ ఈ అధికారాలను దాని నుంచి లాగేసి.. కాకినాడ పోర్టుకు కట్టబెట్టారు. కానీ పోర్టు అధికారులు పెద్దగా పర్యవేక్షించకపోతుండడంతో బోట్ల యజమానులు రెచ్చిపోయి వరద ఉన్నా ఖాతరు చేయకుండా సర్వీసులు నడుపుతున్నారు.
కొంపముంచిన అధికారాల కత్తెర
రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు వెళ్లే పర్యాటక బోట్లకు అనుమతి, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, వరద సమయంలో ప్రయాణానికి నిరాకరణ వంటి బాధ్యతలను మొత్తం ధవ ళేశ్వరంలోని నీటిపారుదలశాఖ విభాగం హెడ్‌ వర్క్స్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ పర్యవేక్షించేవారు. గోదావరికి వరద వచ్చినప్పుడు ఈ విభాగంలోని బోటు సూపరింటెండెంట్‌ ఈ శాఖ వద్ద రిజిస్టర్‌ అయిన పాపికొండలు బోటు ఆపరేటర్లందరికీ ఫోన్లు చేసి ప్రయాణాలు చేయవద్దని ఆదేశించే వారు. ఇదే సమాచారాన్ని రెవెన్యూ, పోలీసు శాఖలకు అందించి వారినీ అప్రమత్తం చేసేవారు. దాంతో సదరు శాఖల అధికారులు వరదలప్పుడు నదిలో బోట్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేవారు.
పర్యవేక్షణ అధికంగా ఉండేది. కానీ 2017 నవంబరులో కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచీ కృష్ణా, గోదావరి నదుల్లో పర్యాటక బోట్ల ప్రయాణానికి అనుమతులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ, బోట్లకు లైసెన్సు ఇచ్చే బాధ్యతలను నీటిపారుదల శాఖ నుంచి పూర్తిగా తప్పించేశారు. ఆ స్థానంలో బాధ్యతలను రాష్ట్ర పోర్టు శాఖకు అప్పగించారు. కృష్ణానదిలో బోటు ప్రయాణ అనుమతులు, లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు, వాటి పరిశీలన మచిలీపట్నం పోర్టుకు.. గోదావరిలో బోట్లకు అనుమతి, రద్దు బాధ్యతలను కాకినాడ పోర్టుకు అప్పగించారు. కానీ కాకినాడ పోర్టు అధికారులు వీటిపై పర్యవేక్షణ జరపడం లేదు. అటు నీటిపారుదల శాఖ అధికారులతోనూ సంప్రదించడం లేదు. నీటిపారుదల శాఖ కూడా వరద సమాచారాన్ని పోర్టుకు వివరించడం, అప్రమత్తం చేస్తూ ఉండాలి. అదీ జరగడం లేదు. కేవలం వరదలప్పుడు నదిలో ఇసుక మేటలు ఏయే ప్రాంతాల్లో వేశాయో గుర్తించి ఆ సమాచారం ఇవ్వడానికే పరిమితమైంది. అటు రెవెన్యూ శాఖ వరద సమాచారం ఆధారంగా బోట్లను నియంత్రించాలి. ఇది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
ఎవరికి వారే గోదావరి తీరే..
పాపికొండల అందాలను చూడడానికి రాజమహేంద్రవరానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టుపక్కనున్న రాష్ట్రాల నుంచీ పర్యాటకులు వస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో పాపికొండలు వెళ్లే బోట్లు అస్సలు ఖాళీ ఉండవు. రాజమహేంద్రవరం నుంచి పాపికొండలు వెళ్లేందుకు పురుషోత్తపట్నం సమీపంలోని అంగలూరు వెళ్తే.. అక్కడుండే బోట్లు పర్యాటకులను ఎక్కించుకుని పాపికొండలు వెళ్తాయి. ప్రస్తుతం 40కి పైగా భారీ ప్రైవేటు బోట్లు పాపికొండలుకు పర్యాటకులను తీసుకెళ్తున్నాయి. అయితే వీటిలో సగానికిపైగా బోట్లకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, లైఫ్‌ జాకెట్లు ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి.
 లైఫ్‌ జాకెట్లను కేవలం అలంకారప్రాయంగా బోట్లలో తగిలిస్తున్నారని అంటున్నారు. అలాగే పాపికొండలుకు బోట్లు బయల్దేరే ముందు దేవీపట్నం నుంచి పోలీసులు వచ్చి తనిఖీ చేసి పంపాలి. ఇదేమీ జరగడం లేదు. మరోపక్క గోదావరికి జూలై నుంచి అక్టోబరు వరకు వరదల కాలం. ఈ సమయంలో పర్యాటక బోట్లపై అధికారుల నియంత్రణ పూర్తిస్థాయిలో ఉండాలి. కానీ పట్టించుకోవడం లేదు. డబ్బుల కోసం బోట్ల యజమానులు, వరదను వీక్షించాలనే సాహసంతో ప్రయాణికులు ఉండడంతో బోటు సర్వీసులు వరదల సమయంలోనూ నడుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గి రెండు నుంచి రెండున్నర లక్షల క్యూసెక్కులకు పరిమితమైతేనే ముందు వెనుకలు పరిశీలించి పర్యాటక బోట్ల ప్రయాణానికి అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. అంతకు మించిన వరదలో ప్రమాదకరం. ఆదివారం బోటు ప్రమాదం జరిగినప్పుడు గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. పైగా ఈ వరద పాపికొండలు ఎగువ నుంచి ధవళేశ్వరం వైపు ఉధృత ప్రవాహంతో వస్తోంది. బోటు దీనికి ఎదురువెళ్లి మునిగిపోయింది.

(Courtacy Andhrajyothi)