వాషింగ్టన్‌ : జార్జి ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు మంటలు రేగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏడోరోజుకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక నగరాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి పోలీసుల జాత్యహంకార వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. పలు నగరాల్లో కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నా కూడా ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ‘జస్టిస్‌ ఫర్‌ జార్జి’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మరోవైపు వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌ ఎదుట ఆందోళనలు కొనసాగాయి.

ట్రంప్‌ వైట్‌హౌస్‌ నుంచి దగ్గర్లోని చర్చ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై రబ్బరు బులెట్లు ప్రయోగించడంతో పాటు, బాష్పవాయువు ప్రయోగించారు. అనంతరం చర్చ్‌కు చేరుకున్న ట్రంప్‌ బైబిల్‌ గ్రంథం చేతపట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. జార్జి హత్య జరిగిన మినియాపొలిస్‌ నగరంలో సోమవారం ఆందోళనలు ప్రశాంతంగా జరిగాయి. పిలడెల్పియాలో ఆందోళనకారులు రోడ్లను బ్లాక్‌ చేశారు. ఈ సందర్భంగా వారిపై పోలీసులు రబ్బర్‌ బులెట్లు, బాష్పవాయువు ప్రయోగించారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. ఐదేండ్ల కిందట పోలీస్‌ కస్టడీలో ఫ్రెడ్డీ గ్రే అనే ఒక నల్లజాతీయుడి మృతి ఘటనకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు జరిగిన మేరీల్యాండ్‌లోని బల్టీమోర్‌లో తాజాగా జార్జి హత్యకు నిరసించారు.

హింస సరికాదు : ఒబామా
జాత్యహంకారం, అసమానత్వానికి వ్యతిరేకంగా అమెరికాలోని అనేక నగరాల్లో జరుగుతున్న ఆందోళనల్లో పలు ప్రాంతాల్లో హింస చెలరేగడం సరికాదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆందోళనకారుల పట్ల ఆధిక పోలీసు బలగాలను ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

మీరు నోరు మూసుకోండి..
రాష్ట్రాల గవర్నర్‌లను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఒక పోలీసు అధికారి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. జార్జి హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను అణచివేయాలనీ, అలా చేయకుంటే మీరు మీ సమయం వృథా చేస్తున్నట్టు అని గవర్నర్‌లను ఉద్దేశించి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై హౌస్టన్‌ పోలీస్‌ ఛీప్‌ ఆర్ట్‌ అసివిడో ఒక టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నోరు మూసుకొని ఉండాలి’ అటూ ట్రంప్‌కు సూచించారు. ‘ ఈ దేశంలోని పోలీసు చీఫ్‌ల తరపున ట్రంప్‌కు ఒక్కటి చెప్పదలచుకున్నా, నిర్మాణాత్మకంగా చెప్పేందుకు మీ వద్ద ఏం లేకుంటే మీరు నోరు మూసుకొని ఉండండి’ అంటూ తీవ్రంగా స్పందించారు. ప్రజల మనసులను గెలుచుకోవాలే తప్ప అణచివేయాలని అనుకోవడంరికాదన్నారు. యువకుల జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దని ట్రంప్‌ను కోరారు.

ప్రవాస భారతీయ వైద్యుల ఖండన
అమెరికాలో పెట్రోగుతున్న జాతి వివక్షపై ప్రవాస భారతీయ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్జి ఫ్లాయిడ్‌ హత్య ఘటనను వ్యతిరేకిస్తూ ది అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌(ఏఏపీిఐ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మైనార్టీపై రోజురోజుకు పెరిగిపోతున్న హింసను సంఘం ఈ సందర్భంగా ఖండించింది. అమెరికాలో జాత్యహంకారం ఏండ్లుగా వేళ్లూనుకుపోయిందనీ, ఇటువంటి కష్టతరమైన బాధ కలిగించే సమయాలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అవకాశం ఉందని ఏఎపీఐ అధ్యక్షుడు సురేష్‌ పేర్కొన్నారు. వైద్యులుగా తాము ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు సిద్ధంగా ఉన్నామనీ, అయితే అనేక మంది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే, దెబ్బతీసే జాత్యహంకారాన్ని ప్రత్యక్షంఆ ఎదుర్కోకుండా ఈ లక్ష్యం నెరవేరే అవకాశం లేదని అన్నారు.

Courtesy Nava Telangana