– ఆందోళనకారులకు ట్రంప్‌ హెచ్చరిక
– జార్జి హత్యకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు

వాషింగ్టన్‌ : మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్‌ నగరంలో జరిగిన నల్లజాతీయుడు జార్జి ఫ్లోయిడ్‌ హత్య ఘటనకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా శుక్రవారం ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో ఆందోళనకారుల పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన అక్కసు వెళ్లగక్కారు. వారిని నిలువరిచేందుకు మిలటరీని దించుతామని, ఆందోళనకారులను కాల్చిపారేస్తామంటూ ట్విట్టర్‌ వేదికగా హూంకరించారు. ‘ ప్రఖ్యాత మిన్నియాపోలిస్‌ నగరంలో జరుగుతున్న ఘటనలను చూస్తే ఉండలేను. మేయర్‌గా ఉన్న జాకబ్‌ ఫ్రే నగరంలోని పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలి లేకుంటే నేషనల్‌ గార్డులను పంపిస్తాం. వారు వెంటనే పని పూర్తి చేస్తారు’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ ఈ సందర్భంగా ఆందోళనకారులను దుండగులుగా వర్ణించారు. ‘ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే నిలువరిం చేందుకు యత్నిస్తాం. దోపిడీ గనుక ప్రారంభమైతే కాల్పులు కూడా ప్రారంభం అవుతాయి’ అని వ్యాఖ్యానించారు.

జార్జి ఫ్లోయిడ్‌ను శ్వేతజాతీయులైన పోలీసు అధికారులు ఒకరు అవమానకరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిన్నియాపోలిస్‌లో జార్జి హత్య జరిగిన సమీప ప్రాంతంలో వేలాది మంది ఆందోళనకు దిగారు. న్యూయార్క్‌ నగరంలో కూడా ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా కోలంబస్‌, ఓహియో, అల్బుక్వేర్‌క్యూ, న్యూ మెక్సికో, పెనాస్‌కోలా, ఫ్లోరిడా, లూయిస్‌విల్లె, కెంటుకి, లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియా నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఆందోళనకారుల ఆగ్రహం తాజాగా జరిగిన జార్జి హ్యత గురించి మాత్రమే కాదని, ప్రతి ఏడాది అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, నగరాల్లో ఏడాదికి దాదాపు వెయ్యి మంది హతమవుతున్నారని సామాజిక ఉద్యమకారులు పేర్కొన్నారు. ఇప్పటికే కరోనాతో భయాందోళనలో బతుకుతున్న అమెరికా పౌరులకు పోలీసుల హింసా వైఖరి మరింత ఆందోళనగా తయారైంది.

ట్రంప్‌ ట్వీట్‌ను బ్లాక్‌ చేసిన ట్విట్టర్‌
ట్రంప్‌నకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ సంస్థ శుక్రవారం గట్టి ఝులక్‌ ఇచ్చింది. మిన్నేసోటా రాష్ట్రంలో ఆందోళనకారులను కాల్చిపారేస్తామని ఆయన చేసిన ట్వీట్‌ను బ్లాక్‌ చేసింది. సోషల్‌ మీడియా కంపెనీలపై నియంత్రణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేసిన గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. హింసను ప్రేరేపించేలా ఉండే ట్వీట్లకు సంబంధించి ఉన్న నిబంధనల ప్రకారం ట్రంప్‌ చేసిన ఈ ట్వీట్‌ను ట్విట్టర్‌ నోటీస్‌తో బ్లాక్‌ చేసింది. నోటీసును క్లిక్‌ చేయడం ద్వారా ట్వీట్‌ను చూడొచ్చని, అది ప్రజల ఇష్టమని పేర్కొంది.

Courtesy Nava Telangana