పైకి వైరం.. లోపల స్నేహం

బీజేపీతో టీఆర్‌ఎస్‌ వైఖరిపై ప్రజల్లో అయోమయం
కేంద్ర నియంతృత్వ వైఖరిపై ఒకవైపు విమర్శలు
మరోవైపు బిల్లులన్నింటికీ మద్దతు
ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

 

అధికార టీఆర్‌ఎస్‌ వైఖరి ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నది. ఒకవైపు బీజేపీతో వైరం ఉన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తూనే లోపల స్నేహ బంధాన్ని కొనసాగించటంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారుతో అనేక విషయాల్లో రాజీపడిపోతూ, సయోధ్య నడుపుతున్న ఆ పార్టీ.. మరోవైపు వివిధ సందర్భాల్లో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. మోడీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నట్టు నటిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం తెలపటం ద్వారా తాము ఒక్కటేననే సంకేతాలను ప్రజల్లోకి పరోక్షంగా పంపించింది. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతూ, హక్కులను అణచివేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారు.. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ వికాస సమితి మహాసభల్లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడిన మాటలే ఇందుకు సాక్ష్యం. ప్రశ్నించే హక్కు.. ప్రాథమిక లక్షణమంటూ ఆయన నొక్కి చెప్పారు. ఇంకా చెప్పాలంటే మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నట్టు ఆయన ప్రసంగం కొనసాగింది. లోక్‌సభ ఎన్నికలకు ముం దు ఫెడరల్‌ ఫ్రంట్‌, రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తి అంటూ కేసీఆర్‌ దేశం మొత్తం కలియదిరిగారు. ఇప్పుడు అదే రాష్ట్రాల హక్కులను హరించి వేసేందుకు ఉద్దేశించిన అనేక బిల్లులకు పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ మద్దతునిచ్చింది. వీటిలో సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణల బిల్లును సమర్థించింది. చట్టంలో సవరణల మూలంగా రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయంటూ కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌.. కేసీఆర్‌కు లేఖ రాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ బిల్లును రాజ్యసభలో తొలుత వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌ పక్షనేత కే.కేశవరావు.. ఆ మరుసటి రోజూ యూటర్న్‌ తీసుకోవటం పలు విమర్శలకు తావిచ్చిం ది. బిల్లుకు మద్దతివ్వాలంటూ ప్రధానితోపాటు హోంమంత్రి కేసీఆర్‌కు ఫోన్‌ చేశారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిం దే. ఆవెంటనే రాజ్యసభ సభ్యుడు జోగినేపల్లి సంతోష్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆఘమేఘాల మీద ప్రత్యే క విమానంలో ఢిల్లీకి పంపిన విషయం తెలిసిందే. దీంతో పాటు అత్యంత కీలకమైన ఆర్టికల్‌ 370నిఎత్తేయటం ద్వారా జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించటాన్ని వామపక్షాలతోపాటు కొన్ని విపక్షాలు ఖండిస్తున్నప్పటికీ.. కేసీఆర్‌ ఇప్పటి వరకూ ఈ అంశంపై నోరు మెదపకపోవటం గమనార్హం. ఉపా చట్టం విషయంలోనూ కేంద్రానికి మద్దతు ప్రకటించింది. కాగా సీఎం తనయ, మాజీ ఎంపీ కవిత.. కేంద్రం చర్యలను సమర్థించిన సంగతి విదితమే. కాశ్మీర్‌ అసెంబ్లీనిగానీ, అక్కడి ప్రజలనుగానీ సంప్రదించకుండానే చేసిన ఈ చర్యపై మౌనంగా ఉన్న టీఆర్‌ఎస్‌ అధినేత.. రాష్ట్రాల హక్కుల గురించి గతంలో మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉన్నదనే విమర్శలు పెల్లుబుకుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా చేయటానికి ప్రయత్నిస్తూనే కేంద్రంతో బంధం కొనసాగించటం ద్వారా ప్రజల్లో టీఆర్‌ఎస్‌ గందరగోళం సృష్టించడం గమనార్హం.

వివిధ రాష్ట్రాల్లో పలు అనైతిక పద్ధతుల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్న కమలం పార్టీ కన్ను.. ఇప్పుడు తెలంగాణపై కూడా పడిందనే వార్తలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లోని పలువురు సీనియర్లు, అసంతృప్తవాదులతో తమతో టచ్‌లో ఉన్నారనే బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేతలు నోరు మెదపటం లేదు. వాస్తవానికి రాష్ట్రాల హక్కులపై చిత్తశుద్ధి ఉంటే.. వాటికి వ్యతిరేకంగా ఉన్న బిల్లులను పార్లమెంటులో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అనైతిక, అప్రజాస్వామిక పద్ధతులపై నిలదీస్తే టీఆర్‌ఎస్‌ వైఖరి తేటతెల్లమయ్యేదని వారంటున్నారు. వాస్తవానికి ప్రజా సమస్యలపై ప్రశ్నించడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయి. విధానాల పరంగా ఒకటేరకంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

 

(Courtacy Nava Telangana)

Leave a Reply