ముంబయి : దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలను నిరసిస్తూ పలు రాష్ట్రాలు, నగరపాలక సంస్థలు వ్యతిరేక తీర్మానాలు చేస్తుండగా.. తాజాగా బీజేపీ పాలనలో ఉన్న ఓ మున్సిపాలిటీలోనూ అదే విధంగా చేశారు. ఆ రెండింటికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. మహారాష్ట్రలోని ప్రభాని జిల్లాలో ఉన్న సెలు మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉంది. 27 మంది కౌన్సిలర్లున్న ఈ మున్సిపాలిటీలో… బీజేపీతో పాటు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌కు చెందిన ముస్లిం ప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారు.
ప్రతిపక్షాల ఒత్తిడితో బీజేపీ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా అందరూ దీనిని ఆమోదించటం గమనార్హం. దీనిపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వినోద్‌ బొరడె స్పందిస్తూ.. ‘గతనెల 2న సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాం. స్థానిక ప్రజా ప్రతినిధులందరి డిమాండ్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.

Courtesy Nava Telangana