బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వశక్తిమంతుడైన, ఎటువంటి చిక్కులనైనా సమర్థంగా ఎదుర్కోగల నాయకుడుగా ఓటర్ల మనస్సుల్లో సుస్థిర స్థానం సాధించుకున్నారు. మోదీకి లభించిన ఈ ఘనత, సార్వత్రక ఎన్నికలలో దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి విశేషంగా దోహదం చేసింది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభా ఎన్నికలలో భావోద్విగ్న ‘జాతీయవాద’ అంశాల కంటే సామాజిక వర్గాల ప్రయోజనాలు, స్థానిక విరోధాలు, కుల సమీకరణలే ఓటర్ల నిర్ణయాలను అధికంగా ప్రభావితం చేశాయి.

కాలం వైరుధ్యాలమయం, మన కాలం మరీనూ! దినపత్రికల బిజినెస్ పేజీలు చదవండి: దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత గడ్డు పరిస్థితిలో వున్నదో, ఆ దుస్థితి నుంచి ఆర్థికాన్ని ఉద్ధరించడానికి మోదీ సర్కార్ ఎంతగా ఆపసోపాలు పడుతుందో మీకు విదితమవుతుంది. ఆ తరువాత రాజకీయ వార్తలు, వార్తావ్యాఖ్యలు చదవండి: బీజేపీ మహాశక్తి ఒక ఎన్నికల విజయం నుంచి మరో ఎన్నికల విజయానికి జైత్రయాత్ర చేస్తున్న తీరు తెన్నులు మీకు తప్పక దిగ్భ్రాంతి కలిగిస్తాయి.

సరే, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చివుండవచ్చుగానీ, ఎన్నికలలో తిరుగులేని విజేతగా ఆ పార్టీ ఆవిర్భవించిందని చెప్పగలమా? తాగు నీటి సమస్య మొదలు హరించుకుపోతున్న ఉద్యోగాల దాకా పలు స్థానిక సమస్యల విషయంలో ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి, భావి ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని నెరపకుండా వుండేలా తగు చర్యలు చేపట్టేందుకు బీజేపీని ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తప్పక పురిగొల్పుతాయి.

ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి లభించిన ఓట్ల శాతం గణనీయంగా పడిపోయింది. గత వేసవిలో జరిగిన సార్వత్రక ఎన్నికలలో హర్యానాలోని మొత్తం పది లోక్‌సభా నియోజక వర్గాలను గెలుచుకోవడంతో పాటు 58 శాతం ఓట్లను బీజేపీ సాధించుకున్నది. దాదాపు 80 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లను సాధించుకోవడంలో బీజేపీయే అగ్రగామిగా వున్నది.

అటువంటిది ఇప్పుడు హర్యానాలో త్రిశంకు సభ (హంగ్ అసెంబ్లీ) ఏర్పడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొత్త శాసనసభలో బీజేపీ ఏకైక పెద్ద పక్షంగా ఉండబోతున్నప్పటికీ ఓటర్ల వైఖరిలో ఒక పెనుమార్పు చోటు చేసుకున్నట్టు అసెంబ్లీ ఎన్నికల పలితాలు సూచించడం లేదూ? మహారాష్ట్రలో సైతం గత వేసవిలో లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ–-శివసేన కూటమి 220కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో అగ్రగామిగా వున్నది. మరి ఇప్పుడో? కొత్త విధానసభలో ఆ కూటమి నాల్గవ వంతు సీట్లను కోల్పోయింది! శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య పెరిగిపోతున్న వ్యత్యాసాన్ని మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఓటర్ల తీర్పు సార్వత్రక, అసెంబ్లీ ఎన్నికలలో భిన్నంగా ఉన్నది. 2018 శీతాకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. గత సంవత్సరాంతంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలు..- మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్-లో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న ఆ మూడు రాష్ట్రాలలోనూ ఓడిపోయింది.

సార్వత్రక పోరాటంలో, ముఖ్యంగా బాలాకోట్ అనంతరం, ఎన్నికలను అధ్యక్ష తరహా పోటీగా మార్చివేయడంలో బీజేపీ సఫలమయింది. అధ్యక్ష తరహా పోటీలో స్థానిక, ప్రాంతీయ అంశాలు తమ ప్రాధాన్యాన్ని కోల్పోయాయి. ఓటర్ల ఆలోచనలను అవి ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. బాలాకోట్ ఘటనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్వశక్తిమంతుడైన, ఎటువంటి చిక్కులనైనా సమర్థంగా ఎదుర్కోగల నాయకుడుగా ఓటర్ల మనస్సుల్లో సుస్థిర స్థానం సాధించుకున్నారు. మోదీకి లభించిన ఈ ఘనత, దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి విశేషంగా దోహదం చేసింది.

మహారాష్ట్ర, హర్యానా శాసనసభా ఎన్నికలలోనూ అదే విధమైన ‘జాతీయవాద’ వ్యూహాన్ని బీజేపీ అనుసరించింది. అయితే భావోద్విగ్న ‘జాతీయవాద’ అంశాల కంటే సామాజిక వర్గాల ప్రయోజనాలు, స్థానిక విరోధాలు, కుల సమీకరణలే ఓటర్ల నిర్ణయాలను అధికంగా ప్రభావితం చేశాయని ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సువిదితం చేశాయి. కరువు కోరల్లో విలవిల్లాడుతున్న మరఠ్వాడా ప్రాంతంలోని పార్లీ నియోజక వర్గమే ఇందుకొక ఉదాహరణ. బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా, మహారాష్ట్రలో తన ప్రచారాన్ని ఈ నియోజక వర్గం నుంచే ప్రారంభించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో తమ ‘జాతీయవాద’, ‘దేశభక్తి ప్రపూరిత’ ప్రభుత్వం ఏ మాత్రం వెనుకాడబోదనడానికి జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగ అధికరణ 370ని రద్దుచేయడమే ఒక తిరుగులేని నిదర్శనమని పార్లీ ఓటర్లకు అమిత్ షా పదే పదే చెప్పారు. రాష్ట్ర మంత్రి పంకజ ముండే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అమిత్ షా వలే ఆయనకూడా జాతీయవాద భావోద్వేగాలను రెచ్చగొట్టారు. జాతి సాధిస్తున్న పురోగతి ప్రతి ఒక్కరికీ గర్వకారణం కావాలని మోదీ ఉద్భోదించారు. అయితే పార్లీ ఓటర్లు బీజేపీ అభ్యర్థిని తిరస్కరించారు. ఆ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ప్రజలు అప్పటికి చాలా వారాలుగా తాగునీటి కొరతతో సతమతమవుతున్నారు మరి.

గ్రామీణ హర్యానాలోనూ ఇదే పరిస్థితి. అధికరణ 370 రద్దును తమ విజయసూత్రంగా బీజేపీ పరిగణించింది. హర్యానాలో కూడా ఆ ‘జాతీయ వాద’ వ్యూహాన్నే అనుసరించింది. నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న రాష్ట్ర మది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా అక్కడ నిరుద్యోగం చాలా హెచ్చు స్థాయిలో వున్నది. ఆకలితో నకనకలాడుతూ నిరాశానిస్పృహల్లో వున్నవారు జాతీయవాద భావావేశాలకు ఎలా లోనవుతారు? బీజేపీ ప్రచార సరళి హర్యానా ఓటర్లను పరిమిత స్థాయిలోనే ప్రభావితం చేసింది. అజేయశక్తిగా కన్పిస్తున్న బీజేపీకి ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక, ఒక మేలుకొలుపు అని చెప్పవచ్చు. ఓటర్లను ఏ రాజకీయ పార్టీ కూడా ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. సతారా లోక్‌సభా నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితం ఈ సత్యాన్ని ఎలుగెత్తి చాటింది. ప్రజా శ్రేయస్సుకు చిత్తశుద్ధితో కృషి చేయడం మినహా మరేదీ ఓటర్లను సంతృప్తిపరచదని ఈ ఉప ఎన్నిక ఫలితం నిర్ధారించింది.

అయినప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ–-శివసేన కూటమి, హర్యానాలో కాషాయ పార్టీయే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో వున్నాయి. విస్మరించలేని ఈ వాస్తవం చెప్పుతున్నదేమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న ‘నిజమైన’ సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ బలహీనతలను తమకు సానుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం విఫలమయిందనే కాదూ! మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అసలు పోరాడలేదనే చెప్పాలి. ఆ పార్టీకి సరైన నాయకత్వమూ లేదు, స్ఫూర్తిదాయక లక్ష్యమూ లేదు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ మాత్రమే ఒక నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా పోరాడారు. ఆయన ఒక్కరే పోరాటాన్ని ఫడణవీస్ శిబిరం దాకా తీసుకువెళ్ళారు. అనేక పోరాటాలలో ఆరితేరిన ఈ మరాఠా కురువృద్ధుడు కుండపోత వర్షంలోనూ అశేష ప్రజలు పాల్గొన్న ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడం ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నిర్వచించే ఘట్టంగా ప్రజల స్మృతి పథంలో నిలిచిపోతుంది.

హర్యానాలో కాంగ్రెస్‌కు ఒక శక్తిమంతమైన ప్రాంతీయ నాయకుడు ఉన్నాడని చెప్పక తప్పదు. ఆయనే మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూదా. హర్యానాకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న హూదాను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. మరి కొన్ని వారాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా పిసిసి అధ్యక్ష పీఠంపై ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకురాలిని కూర్చో పెట్టింది. అయినప్పటికీ హూదా ఈ ప్రతి కూల పరిస్థితులన్నిటినీ అధిగమించి కాంగ్రెస్‌కు గణనీయమైన స్థానాలను సాధించారు. కనీసం కొన్ని నెలల ముందు హర్యానా పిసిసి నాయకత్వాన్ని హూదాకు అప్పగించినట్టయితే హర్యానా ఫలితాలు వేరే విధంగా వుండేవని ఖాయంగా చెప్పవచ్చు.

ఏమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే ఇప్పటికీ దేశానికి నెంబర్ 1 నాయకుడనడంలో సందేహమేమీ లేదు. బీజేపీకి రాష్ట్రాలలో పటిష్ఠ నాయకత్వాలు వున్నాయి. ఎన్నికలను కట్టుదిట్టంగా ఎదుర్కోగల యంత్రాంగం వున్నది. అపరిమిత వనరులు వున్నాయి. మరీ ముఖ్యంగా విజయం సాధించాలనే కృతనిశ్చయంతో పనిచేసే కార్యకర్తలు వున్నారు. మరి ప్రతిపక్షాల మాటేమిటి? నిరాశాపూర్వక మనస్తత్వం, నిరుత్సాహపూర్వకంగా ఎన్నికల గోదాలోకి దిగకుండా వున్నట్టయితే మహారాష్ట్రలోనూ, హర్యానాలోనూ అవి విజయాన్ని సాధించే అవకాశముండేది. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడమనేది ఇదే మొదటిసారి కాదు.

తాజా కలం: తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ, జార్ఖండ్‌లలో జరగనున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో పోరు హోరా హోరీగా జరగడం ఖాయం. ఇతర ప్రతిపక్ష నేతల వలే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ తప్పకుండా విజయం సాధించాలనే కృతనిశ్చయంతో పోరాడతారు. ఆయనకు ఆత్మ విశ్వాసం మెండు. జీవితంలో అయినా, ఎన్నికలలో అయినా విజయానికి మొదటి మెట్టు ఆత్మ విశ్వాసమే కదా!

రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)