CAA– బీజేపీ పశ్చిమబెంగాల్‌ కార్యకర్తల అరెస్టు

కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్ట (సీఏఏ) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా ముస్లిం వేషధారణల్లో వెళ్లి అల్లర్లను సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లా సీల్దా-లల్గోల రైల్వేలైన్‌పై ఆగి ఉన్న రైలు ఇంజిన్‌పై రాళ్లు రువ్విన ఘటనలో బీజేపీకి చెందిన ఆరుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వీరందరూ బీజేపీకి చెందినవారేనని గ్రామస్థులు ఆరోపిస్తుండగా, పట్టుబడిన వారిలో అభిషేక్‌ సర్కార్‌ అనే యువకుడు కొంతకాలంగా కమలం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. నిందితులందరూ బుధవారం ముర్షిదాబాద్‌ జిల్లాలోని రధమధ్బాట్లా రైల్వే స్టేషన్‌ వద్దకు వెళ్లి ముస్లింలు ధరించే లుంగీ, టోపీ పెట్టుకుని అక్కడ ఆగి ఉన్న రైలు ఇంజిన్‌పై రాళ్లురువ్వారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న గ్రామస్థులు ఇది చూసి విస్మయానికి గురయ్యారు. ఇదే విషయమై ఓ గ్రామస్థుడు స్పందిస్తూ… ‘వారు ఆరుగురు రైల్వే స్టేషన్‌లో ముస్లింల మాదిరి వేషధారణ వేసుకుని రావడం నేను చూశాను. అభిషేక్‌ సర్కారు బీజేపీ సభ్యుడు. ఆయన గతంలో మమతాబెనర్జీ సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలల్లో తరుచూ పాల్గొనేవాడు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాం’ అని తెలిపాడు. బీజేపీకి చెందిన గ్రామశాఖ అధ్యక్షుడు సైతం అభిషేక్‌తో పాటు మరో వ్యక్తి సైతం తమ పార్టీకి చెందినవాడేనని నిర్ధారించాడు. కానీ అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్‌ ఘోష్‌ మాత్రం.. నిందితులకు తమ పార్టీతో సంబంధం లేదని తెలపడం గమనార్హం.

కాగా, జార్ఖండ్‌లో ఇటీవలే ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ‘ఆందోళనకారులు వేసుకున్న దుస్తులను చూసి చెప్పవచ్చు ఈ ఆందోళనలు ఎవరు చేస్తున్నారో..!’ అని వ్యాఖ్యానించిన విషయం తెలసిందే. ఇదే విషయమై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఈ అల్లర్లను హిందూ-ముస్లింల మధ్య గొడవలాగా చిత్రీకరిం చడానికి బీజేపీ యత్నిస్తున్నది. ఈ మేరకు బీజేపీ కార్యకర్త లకు టోపీలు, లుంగీలు కొనిపించి నిరసనకారుల్లో కలిసిపో యి ఆందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నదని మాకు సమాచారం ఉంది. ఒక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా కించపరి చేందుకే బీజేపీ ఇలా చేస్తున్నద’ని ఆమె వ్యాఖ్యానించారు.

(Courtesy Nava Telangana)