జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని ఆ రోజుల్లో సర్ధార్‌ వల్లబాయ్ పటేల్‌, అంబేద్కర్‌, శ్యామప్రసాద ముఖర్జీలు వ్యతిరేకించారని బిజెపి ప్రచారం చేస్తోంది. అందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి తాము వారి కలను నిజం చేశామని పచ్ఛిగా అబద్ధాలు చెబుతోంది. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉండడం వలనే జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధి చెందలేకపోయిందని, ఉగ్రవాదం పెరిగిందని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సెలవిస్తున్నారు. అయితే బిజెపి నేతల వాదనలు తప్పని కొంతమంది ఆధారాలతో ముందుకు వస్తున్నారు. అభివృద్ధి పరంగా చూస్తే జమ్ముకాశ్మీర్‌ కంటే ప్రధాని మోడీ, అమిత్‌షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌ చాలా వెనుకబడి ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక ఉద్యమకారుడు జీన్‌ డ్రెజే పేర్కొన్నారు. అభివృద్ధిలో జమ్ముకాశ్మీర్‌ వెనుకబడలేదని, ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని పటేల్‌, అంబేద్కర్‌, శ్యామప్రసాద ముఖర్జీలు కూడా వ్యతిరేకించలేదన్న దానికి సంబంధించి పలు వివరణలు కూడా వినిపిస్తున్నాయి.

జీన్‌ డ్రెజే నోబెల్‌ అవార్డు గ్రహీతలైన అమర్త్యసేన్‌, ఆంగూస్‌ డేటాన్‌లతో కలిసి అనేక పుస్తకాలు రచించారు. జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఇటీవల ఢిల్లీలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా జీన్‌ డ్రెజే ప్రదర్శించిన ప్లేకార్డులపై ప్రస్తుతం పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన గణాంకాలను కూడా ఆయన ప్లేకార్డుల్లో పొందుపరిచారు. జమ్ముకాశ్మీర్‌ అభివృద్ధికి ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదానే అడ్డు అని వాదించే బిజెపి నేతలకు డ్రెజే పక్కా గణాంకాలతో గట్టి పంచ్‌ ఇచ్చారు. అయితే తిరిగి ఇదే వాదనను బుధవారం దేశాన్ని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ఆరోగ్యం, విద్య తదితర అంశాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే జమ్ముకాశ్మీర్‌ వెనకబడి ఉందన్న మోడీ వ్యాఖ్యలను డ్రెజే ఖండించారు. ఇది పూర్తిగా తప్పుడు వాదన అని పేర్కొన్నారు. విభిన్న వాదనలు వస్తున్న ఇటువంటి తరుణంలో నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) నమోదు చేసిన గణాంకాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. పలు మానవ అభివృద్ధి సూచికల్లో ఇతర రాష్ట్రాల కంటే జమ్ముకాశ్మీర్‌ మెరుగైన స్థితిలో ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్టికల్‌ 370 అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పథాన నిలిచిందనే దానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యేక ప్రతిపత్తిలో పటేల్‌ కీలకపాత్ర
జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత రాజ్యాంగ అసెంబ్లీ అమోదించడంలో పటేల్‌ కీలకపాత్ర పోషించాడు. ప్రత్యేక ప్రతిపత్తి అంశంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల మధ్య వివాదం వచ్చిన సమయంలో వల్లభారు పటేల్‌ జోక్యం చేసుకున్నారు. ఆర్టికల్‌ 306 (ప్రస్తుతం ఆర్టికల్‌ 370) సజావుగా ఆమోదించేలా చూడాలని ఈ అంశాన్ని పరిశీలిస్తున్న మంత్రి గోపాలస్వామి అయ్యంగార్‌ను కోరారు. అయితే ప్రస్తుతం బిజెపి దీనికి విరుద్ధంగా వాదన చేస్తోంది. తమ వాదనకు బలం చేకూర్చుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్‌పై కూడా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాశ్మీర్‌, పాకిస్తాన్‌ అంశాలపై అంబేద్కర్‌ ప్రసంగాలు, రాజ్యాంగ అసెంబ్లీలో జరిగిన చర్చలు, రాసిన పుస్తకాలను పరిశీలిస్తే ఆర్టికల్‌ 370పై ఎక్కడా ఎటువంటి ప్రస్తావన లేదనేది సత్యం. ప్రత్యేక ప్రతిపత్తి ముసాయిదాని అంబేద్కర్‌ వ్యతిరేకించారని 1991లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన తరుణ్‌భాస్కర్‌ అనే పత్రికలో ఎడిటోరియల్‌లో అంబేద్కర్‌ చనిపోయిన దాదాపు నాలుగు దశాబ్ధాల క్రితం వచ్చిందని అంబేద్కరైట్‌ స్కాలర్‌ ప్రతీక్‌ తెంబూర్న్‌ తెలిపారు. అంబేద్కర్‌కు ఆపాదించబడిన నకిలీ ప్రచారాన్ని అంబేద్కరైట్‌ వెబ్‌ జర్నల్‌ ‘వెలివాడ’ బహిర్గతం చేసింది.

శ్యామ ప్రసాద ముఖర్జీ పాత్ర
ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా తాము జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద ముఖర్జీ కలను నిజం చేశామని ప్రధాని మోడీ, అమిత్‌షాలు తమ ప్రసంగాల్లో పేర్కొంటున్నారు. కాగా ఆర్టికల్‌ 370 అమలు అనివార్యతను ముఖర్జీ ప్రాథమికంగా అంగీకరించిన అంశాన్ని ఇక్కడ బిజెపి నేతలు తప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రముఖ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఎజి నూరాని రాసిన పుస్తకం ‘ఆర్టికల్‌ 370- ఎ కాన్‌స్టిట్యూషన్‌ హిస్టరీ జె అండ్‌ కె’లో ప్రస్తావించారు. ఇదే అంశంపై జమ్ముకాశ్మీర్‌కు చెందిన జర్నలిస్టు బాలరాజ్‌ ‘ ది గ్రేటర్‌ కాశ్మీర్‌’ పత్రికలో రాసిన వ్యాసం ద్వారా మరిన్ని వివరాలు అందించారు. జమ్ముకాశ్మీర్‌ కు స్వయంప్రతిపత్తిపై నెహ్రు, షేక్‌ అబ్దుల్లాతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ముఖర్జీ ఆర్టికల్‌ 370కి అంగీకరించారు. అంతేకాదు జమ్ముకాశ్మీర్‌కు అధ్యక్షుడిగా షేక్‌ అబ్దుల్లాను నియమించేందుకు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నింటినీ ప్రధాని మరుగున పరిచి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు.

అంబేద్కర్‌, పటేల్‌ ఆర్టికల్‌ 370ని వ్యతిరేకించారా.
జమ్ముకాశ్మీర్‌లో అంశంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు బిజెపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. కాశ్మీర్‌పై డాక్టర్‌ బిఆర్‌ ఆంబేద్కర్‌, మాజీ హోంమంత్రి సర్ధార్‌ వల్లభారుపటేల్‌ కన్న కలలను తాజా చర్యల ద్వారా తాము నిజం చేశామని ప్రధాని తన ప్రసంగంలోనూ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి మండలి అనేది సమిష్టి బాధ్యతపై పనిచేస్తుంది. అటువంటిది బిజెపి నేతలు చెబుతున్నట్లుగా ఆర్టికల్‌ 370ని అంబేద్కర్‌, పటేల్‌లు వ్యతిరేకిస్తే అసలు అది అమల్లోకి వచ్చే అవకాశం లేదు. బిజెపి నేతలది పూర్తిగా అసంబద్ధ వాదన అనేది ఇక్కడ అర్ధమౌతుంది. మరొక విషయాన్ని పరిశీలిస్తే కాశ్మీర్‌ విషయంలో అందరితో సంప్రదించిన తర్వాతనే అప్పటి ప్రధాని నెహ్రూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిలా అధికార కేంద్రీకరణ అనేది ఆ రోజుల్లో లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. గాంధీ, నెహ్రూ, పటేల్‌లు కలిసి ఒక త్రిసభ్య కమిటీగా ఏర్పడి స్వతంత్ర భారత్‌ అనేది హిందూ రాజ్యంగా ఉండకూడదని, అందరికీ సమానహక్కులు ఉండాలని భావించారని పటేల్‌ జీవిత చరిత్ర రాసిన రాజమోహన్‌ గాంధీ తన పుస్తకంలో పేర్కొన్నారు. నెహ్రూ, పటేల్‌లు ఇతర నేతలతో కలిసి రాజ్యాంగంలో లౌకికవాదం, సమానత్వం కోసం పనిచేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జునాఘడ్‌, హైదరాబాద్‌, కాశ్మీర్‌ సంస్థానా విలీనంపై నెహ్రూ, పటేల్‌లు ఉమ్మడిగా పనిచేశారు.

(Courtacy Prajashakti)