ప్రొ. ఆర్‌. వి. రమణమూర్తి

నా ఉద్దేశంలో స్వయం నిర్ణయాధికారం కశ్మీరు సమస్యకు పరిష్కారం కాదు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఎల్‌ఓసీనే సరిహద్దుగా అంగీకారం చేసుకుని, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యను పరిష్కరించాలి. కానీ, 370ని రద్దు చేసి, కర్ఫ్యూపెట్టి, కశ్మీరీల బాగు కోసమే అంటూ వాళ్లకు చెప్పకుండా చేయడం కూడదు. వైద్యం వికటిస్తే ఉనికికే ప్రమాదం. కశ్మీర్‌ ప్రజలు ఈ గండం నుంచి తొందరగా గట్టెక్కుతారని ఆశిద్దాం.

జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదం ఆర్టికల్‌ 370 అని చెప్తూ, కశ్మీరీలను, కనీసం ప్రతిపక్షాలను కూడా సంప్రదించకుండా బీజేపీ ప్రభుత్వం దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం బహుశా కశ్మీరు విధానంలో భారత్‌ చేసిన అతి పెద్ద తప్పుగా మిగిలిపోవచ్చు. రాచపుండు బ్రహ్మరాక్షసిగా మారుతుందనడానికి సందేహం లేదు. నిజానికి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం చేసిన తప్పును వాజపేయి, మన్‌మోహన్‌ ప్రభుత్వాలు సరిదిద్దడానికి ప్రయత్నాలు చేశాయి. మిలిటెన్సీ సమస్య చాలావరకూ తగ్గింది. తగ్గింది. కానీ, నాలుగైదేళ్లుగా మోదీ ప్రభుత్వం పరిస్థితిని పాడు చేసి మళ్ళీ మిలిటెన్సీ తీవ్రతరం అయ్యే పరిస్థితి తెచ్చింది.

బీజేపీ అభిమానులు చేసే వాదన ప్రకారం రాజు హరిసింగ్‌ భారత్‌ విలీనానికి ఒప్పుకున్నాడు కాబట్టి కశ్మీరు భారత్‌లో అంతర్భాగం అయింది. భారత సైన్యం గిరిజన ఆక్రమణదారులను, వారి వేషంలో ఉన్న పాకిస్థానీ సైనికులను తరిమికొట్టి కశ్మీరును పాక్షికంగా కైవసం చేసుకుంది. కానీ భారత ఆర్మీని ఈ తరుణంలో అక్కడే ఆపి, విషయాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించడం నెహ్రూ మొదటి తప్పిదం. దీని వల్లే భారత్‌ హరిసింగ్‌ రాజ్యంలో సగభాగాన్ని పాకిస్థాన్‌కు కోల్పోయింది. షేక్‌ అబ్దుల్లాతో కలిసి ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన 370 అధికరణను, భారత రాజ్యాంగంలో చేర్చి దేశ సార్వభౌమాధికారాన్ని కాంప్రమైజ్‌ చేయడం నెహ్రూ రెండో తప్పిదంగా వారు చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా 370 అధికరణ అడ్డగించిందని వారి అభియోగం. అంతే కాక మిలిటెన్సీ పెరిగినప్పుడల్లా, ఈ స్వయంప్రతిపత్తి అన్న మిషతో కేంద్ర బలగాలకు సహకరించకుండా ఒమర్‌ – ముఫ్తీ ప్రభుత్వాలు వేర్పాటు వాదులను, మిలిటెంట్లను, వారికి సహకరించే వారినీ రక్షిస్తూ వచ్చాయని బీజేపీ చెబుతోంది. కాబట్టి, మిలిటెంట్లను మట్టుపెట్టే వరకు జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి ఆ తర్వాత రాష్ట్ర హోదా పునఃస్థాపిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. పైగా 370 అధికరణ ద్వారా భారత రాజ్యాంగంలో మైనారిటీలకూ, వెనుకబడిన వర్గాలకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వలేకపోయారనీ, పైగా లద్దాఖ్‌ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని ఇప్పుడు ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామన్నారు. కశ్మీరీ పండిట్లను తరిమివేసినప్పుడు, 5వేల మంది పండిట్ల ఊచకోతకు ఈ ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలనీ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు, కశ్మీరీ పండిట్లను తిరిగి అక్కడికి పంపించడం సాధ్యమవుతుందంటున్నారు. ఇవి పాక్షిక వాస్తవాలేననీ, ఇది చాలా ప్రమాదకరమైన విధానమని నేను వాదిస్తాను.

కశ్మీరు స్వయంప్రతిపత్తిని కొనసాగిస్తూ కేవలం రక్షణ, ఆర్థిక అంశాల మీద భారత దేశానికి అధికారాన్ని ఇచ్చే షరతుపై మాత్రమే రాజు హరిసింగ్‌ విలీనానికి అంగీకరించారు. షేక్‌ అబ్దుల్లా 1936 నుండే రాజా హరిసింగ్‌ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతూ, ప్రజలపై పట్టు సాధించిన నాయకుడు. కానీ హరిసింగ్‌ లాగే, కశ్మీరుకు స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుకున్నవాడు. పాకిస్థాన్‌ 1947లో కశ్మీరును బలవంతంగా హస్తగతం చేసుకోవడాన్ని తీవ్రంగా నిరసించాడు. నెహ్రూ స్వయంప్రతిపత్తిని ఇస్తానన్నందునే విలీనాన్ని సమర్థించిన వ్యక్తి. ఆ స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోతే కేవలం మిలటరీతో కశ్మీరును ఆక్రమించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఇక, కశ్మీరు లోయ మాత్రమే స్వాధీనం చేసుకుని మిగతా ప్రాంతాలను వదలడానికి చాలా కారణాలు ఉన్నాయి. నెహ్రూ ప్రధానమంత్రిగా కాక ఒక కశ్మీరీ పండిట్‌లాగా వ్యవహరించాడనీ అంటారని పరిశోధకులు రాశారు. అందుకే, కశ్మీరు లోయలోనే పండిట్లు పరిమితమైనందు వల్ల వారి క్షేమాన్ని అవసరాలను పట్టించుకునే మేరకు సైన్యాన్ని ప్రాథమికంగా వాడాడని, దాని వెనుక ప్రాంతంలో ఫక్తూన్‌ పఠాన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని కైవసం చేసుకుని స్థిరంగా ఉంచుకోవడం కష్టం అని భావించాడనీ రాశారు. పైగా రోడ్లు లేకపోవడం వల్ల అంత దూరం సైన్యం వెళ్ళడం కూడా సాధ్యం కాదని, ముందుకెళ్ళే విషయంపై సైన్యాధికారుల్లో ఏకాభిప్రాయం కూడా లేదు. అదే సమయంలో పంజాబ్‌ ప్రాంతంలో దేశ విభజన వల్ల లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నందున కశ్మీరులో అలాంటి పరిస్థితి రానివ్వ వద్దని భారత నాయకత్వం అభిప్రాయం. విలీనం కూడా పూర్తయినందున పాకిస్థాన్‌కు టెక్నికల్‌గా ఇక ఎలాంటి అధికారమూ లేదని విశ్వసించినందునే నెహ్రూ ఐక్యరాజ్య సమితికి కశ్మీరుపై నివేదించారు. కేవలం రాజు నిర్ణయాలకు అంతర్జాతీయ న్యాయ సూత్రాల్లో మద్దతు పోతున్న రోజులవి. కాబట్టి ప్లెబిసైట్‌ పెట్టాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. అయితే, ఇది పాక్‌, భారత్‌లో ఏ దేశానికీ ఇష్టం లేని పరిష్కారం. సైన్యాలను ఉపసంహరించాక ఐక్యరాజ్య సమితి ఈ సూచనను ఇరు దేశాలు బుట్టదాఖలు చేశాయి.

షేక్‌ అబ్దుల్లా మనసు మార్చుకుని ఎన్నికల్లో పాల్గొని, నెహ్రూ ప్రభుత్వంతో 370 అధికరణను చేయించాడు.. ఇది కేవలం నెహ్రూ నిర్ణయమని, పటేల్‌కు ఇష్టం లేదన్నది కేవలం కట్టుకథ. పటేల్‌ అంత బలహీనుడూ కాదు, మతి లేని వాడూ కాదు. ఆ పరిస్థితుల్లో అదే మెరుగైన నిర్ణయమని అందరూ భావించారు. అయితే, ఆ తర్వాత రణం మళ్ళీ మొదలైంది. దేశంలో అన్ని చోట్లా జమీందారి రద్దు, భూ సంస్కరణలు అమలుకు ప్రయత్నించిన కాలమది. కశ్మీరు లోయలో 90% వ్యవసాయ భూమి పండిట్ల చేతుల్లో ఉండడంతో ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా అ భూమిని స్వాధీనం చేసుకుని, భూమి లేని ముస్లిం కుటుంబాలకు పంచారు. ఇది పండిట్లకు తీవ్రంగా కోపం తెప్పించడమే కాదు, హిందూ–ముస్లిం వివాదాన్ని తీవ్రతరం చేసింది. పండిట్లను చంపేసి, ఆస్తులు తీసేసుకుంటున్నాడని చెబుతూ తన మద్దతును ఉపసంహరించడం ద్వారా కాంగ్రెస్‌ 1953లో షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వాన్ని పడగొట్టింది. పాకిస్థాన్‌తో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడన్న అభియోగంతో 11 సంవత్సరాలు జైల్లో పెట్టింది. భారత్‌కు సహకరించిన తమ నాయకుడిని జైల్లో పెట్టడంతో కశ్మీరీ ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. వివాదం రాజపుండులా మారింది. సమస్య పెరుగుతూ వచ్చింది. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వంతో మరొక ఒప్పందం చేసుకుని షేక్‌ అబ్దుల్లా మళ్ళీ అధికారంలో కొచ్చాడు. కానీ రెండేళ్ళ తర్వాత 1980లో మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం డిస్‌మిస్‌ చేసింది. ప్రతిసారీ 370 అధికరణ ఆర్డినెన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకోవడాన్ని కశ్మీరు పార్టీలు ప్రతిఘటించాయి.

దీనికోసం 370 అధికరణలో చేసిన సవరణలు కశ్మీరులో వివాదాస్పదమయ్యాయి. నిజానికి 370 పై జరిగిన పెక్కు సవరణల వల్ల ప్రారంభంలో ఇచ్చిన స్వయంప్రతిపత్తి 90 శాతం నిర్వీర్యం అయ్యింది. దానితో కేంద్రం జమ్మూకశ్మీర్‌ను 356 అధికరణలోకి తేవడం ద్వారా రాష్ట్రపతి పాలనను అమలు చేసే వెసులుబాటు తెచ్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇష్టారీతిన వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించింది. దీన్ని నిరసించిన వారిని అరెస్టులు చేస్తూ, కాల్పులకు, ఎన్‌కౌంటర్లకు పాల్పడటం ద్వారా భారత ప్రభుత్వం డీల్‌ చేస్తూ వచ్చింది. కానీ సమస్య జటిలం అవుతూనే వచ్చింది. 1991 నుండి పాక్‌ సహాయంతో ఇస్లామిక్‌ తీవ్రవాదం పుట్టుకొచ్చింది. భద్రతా దళాలపై తీవ్రవాదులు విరుచుకు పడ్డారు. 1994లో పండిట్లపై శ్రీనగర్‌లో జరిగిన నరమేధంలో 44 మందిని హతం చేశారు. దానితో పండిట్లను కేంద్రప్రభుత్వమే క్యాంపులకు తరలించింది. 50 వేల మందికి పైగా శరణార్థులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు వలసపోయారు. ఇదే క్రమంలో కశ్మీరీ ముస్లిముల్లో ఎన్‌కౌంటర్లకూ బలైన వారు కొందరైతే, కనిపించకుండా పోయిన వారు ఎందరో! అలా పండిట్ల కంటే హింసలో ఎక్కువగా వారూ నష్టపోయారు. 2002లో వాజపేయి ప్రభుత్వం ‘ఇన్సానియత్‌– జమూరియత్‌ – కశ్మీరియత్‌’ పేరున శాంతి స్థాపించే ప్రయత్నాలు చేసింది. సరిహద్దు ఆవలి బంధువులను చూడడానికి కశ్మీరీలకు వీసాలు మంజూరు చేసింది. కాంగ్రెసు ప్రభుత్వం వీటిని మరింత ముందుకు తీసుకుపోయింది.

2014 అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని భాజాపా ప్రభుత్వం నిరంకుశ ధోరణులు పునఃప్రారంభించింది. ఉగ్రవాద అణచివేతల్లో భాగంగా వాళ్ళు దాక్కున్న ఇళ్ళపై దాడులు ఉధృతం చేసింది. చుట్టుపక్కల వాళ్ళను, ఇంట్లో వాళ్ళనూ ఎన్‌కౌంటర్లు చేయడం మొదలైంది. దానికి ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించడం, రాళ్ళు రువ్వడం జరిగింది.

ఈ పరిస్థితుల్లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, జమ్మూకశ్మీరు రాష్ట్ర ప్రతిపత్తి ఎత్తివేసి కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి కుదించడం ద్వారా శాంతి స్థాపన ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ ఆర్టికల్‌ని నిర్వీర్యం చెయ్యడాన్ని కశ్మీరు ప్రజలు నిరసించారో, ఆ ఆర్టికల్‌ ఉనికినే రద్దు చేసి, మిమ్మల్ని చావగొట్టి చెవులు మూసి శాంతిని స్థాపిస్తాం అని చెప్పడం హాస్యాస్పదం. అక్కడి ప్రజలతో కనీసం మాట్లాడే వీలు లేనిది ప్రస్తుత పరిస్థితి. స్థానిక నాయకుల ప్రభావం పరిమితం అయిపోయిన తరుణంలో, ఉన్న వాళ్ళను హౌజ్‌ అరెస్ట్ చేస్తే ఇంక మాట్లాడే వాళ్ళెవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు వెళ్తారా? మోదీ – అమిత్‌ షా వెళ్తారా? సోషల్‌ మీడియాలో వీరంగం చేసే వాళ్ళు వెళతారా? అక్కడ అసలు మొహల్లాలోకి వెళితేనే కొట్టి చంపేసేంత ఆగ్రహంలో ప్రజలు ఉన్నారు. భధ్రతాదళాలు గన్నులు పట్టుకుని, కర్ఫ్యూలు పెట్టి ఇన్నాళ్ళూ మేనేజ్‌ చేస్తూ ఉన్నాయి. ఇళ్ళలో ఆహారం అయిపోతే ప్రజలు రోడ్ల మీదికి వస్తారు. కాల్పుల ద్వారా కట్టడి ఎంతని చేస్తారు? మీడియాని అందుకే బహిష్కరించారు. స్థానిక నిర్వహణా యంత్రాంగం కూడా సహకరించడం అనుమానమే. కాబట్టి ఆర్టికల్‌ 370ని రద్దుచేసి, ఢిల్లీలో జబ్బలు చరుచుకోవచ్చుగానీ, కశ్మీరు లోయలో ప్రజల మనసులను ఎలా గెలుచుకుంటారు? ఇదివరకటి కంటే పెద్ద సంఖ్యలోనే నిరసనలు జరగొచ్చు. మారణకాండ జరిగితే అంతర్జాతీయ సమస్య అవుతుంది. పాకిస్థాన్‌, చైనాలు వ్యతిరేకించవచ్చు. పాకిస్థాన్‌ను చైనా పరిధిలోంచి తప్పించి తన వైపునకు తిప్పుకునేందుకు అమెరికా కూడా భారత్‌కు మద్దతు పాక్షికంగా తగ్గించి, కశ్మీర్‌ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనొచ్చు. ఇంక ఐఎస్‌ఐఎస్‌ రంగప్రవేశం చేస్తే, పరిస్థితి ఏమిటి? ఆ విధంగా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలందరినీ ‘రిస్కు’లో పెడుతోంది.

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీరుకు పెట్టుబడులు వస్తాయన్న ఒక అతి తెలివి వాదన చేస్తోంది ప్రభుత్వం. అసలు ఏ బోర్డర్‌ స్టే్‌ట్‌లోకీ ప్రయివేటు పెట్టుబడులు రావు. రావాలన్నా ఈ ఆర్టికల్‌ భూమిని లీజుకు తీసుకోవడాన్ని ఆపదు. కాబట్టి అది పెట్టుబడులను ఆపిందనడం హంబక్‌. బలంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేమని ఎన్నో దేశాలు గ్రహించి ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తూంటే, మోదీ ప్రభుత్వం దాన్నే అనుసరిస్తున్నది. నెహ్రూ 370 ఆర్టికల్‌ తెచ్చి తప్పు చేస్తే, దాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం అంతకన్నా పెద్ద తప్పు చేసింది. శరీరంపై గాయాలైనా మానతాయి గానీ, హృదయాల మీద చేసిన గాయాలు తగ్గడానికి చాలా కాలం పడుతుంది.

అయితే, నా ఉద్దేశంలో స్వయం నిర్ణయాధికారం కశ్మీరు సమస్యకు పరిష్కారం కాదు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి ఎల్‌ఓసీనే సరిహద్దుగా అంగీకారం చేసుకుని, ప్రజాస్వామ్య పద్ధతిలో సమస్యను పరిష్కరించాలి. కానీ, 370ని రద్దు చేసి, కర్ఫ్యూపెట్టి, కశ్మీరీల బాగు కోసమే అంటూ వాళ్లకు చెప్పకుండా చేయడం కూడదు. వైద్యం వికటిస్తే ఉనికికే ప్రమాదం. కశ్మీర్‌ ప్రజలు ఈ గండం నుంచి తొందరగా గట్టెక్కుతారని ఆశిద్దాం.

(Courtacy Andhrajyothi)