– రెచ్చగొట్టిన కమలంపార్టీ నేత కపిల్‌మిశ్రా
– ఢిల్లీ జాఫ్రాబాద్‌లో పౌర నిరసనకారులపై రాళ్లదాడి
– టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన పోలీసులు

న్యూఢిల్లీ : సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో శాంతియుత నిరసనలు చేస్తున్న వారిపై కాషాయ మూకలతో బీజేపీ వీరంగం సృష్టించింది. ‘జైశ్రీరాం’ నినాదాలు చేస్తూ నిరసనకారులపై రాళ్లదాడి చేసి రెచ్చగొట్టింది. బీజేపీ నాయకుడు కపిల్‌మిశ్రా ముందుండి సీఏఏ అనుకూల ర్యాలీ నడిపాడు. ఓవైపు జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద మహిళలు శాంతియుతంగా సీఏఏకు వ్యతిరేకం గా నిరసనలు చేస్తుండగా.. దీనికి పోటీగా మౌజ్‌పూర్‌లో కపిల్‌ మిశ్రా ఆధ్వర్యంలో సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించారు. ప్రదర్శనగా వెళ్లి.. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు వెనుకుండి రాళ్లు రువ్వుతున్న వారిని ఉసిగొల్పారు. దొరికిన వారిని కొట్టడానికి కాషాయ మూకలు వెనుకాడలేదు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అప్పటికే పలువురు నిరసనకారులు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. అపుడు పరిస్థితిని అదుపులోకి తేవటానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను ప్రయోగించారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్తపరిస్థితి నెలకొన్నది.
అసలేం జరిగింది..?

ఢిల్లీలోని మౌజ్‌పూర్‌కు సమీపంలోని జాఫ్రాబాద్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు శనివారం రాత్రి నుంచే జరుగుతున్నాయి. బీజేపీ వివాదాస్పద నాయకుడు కపిల్‌ మిశ్రా సైతం సీఏఏకు అనుకూలంగా మౌజ్‌పూర్‌లో ఆదివారం ర్యాలీని నిర్వహించారు. అయితే మౌజ్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు చేరుకున్న సీఏఏ మద్దతుదారులు.. జాఫ్రాబాద్‌ వద్ద నిరసనకారులను గమనించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై సీఏఏ మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోయారు. జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్దకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్న కపిల్‌ మిశ్రా, ఆయన అనుచరులు అక్కడ నానా హంగామా సృష్టించారు. నిరసనకారులు ఇక్కడి రోడ్డును వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఒక వీధిలో నుంచి చాటుగా వచ్చిన ఆయన అనుచరులు, సీఏఏ మద్దతుదారులు పౌర నిరసనకారులపై రాళ్ల వర్షం కురిపించారు. నిరసనకారులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ‘జైశ్రీరాం’ నినాదాలు చేస్తూ అంతకంతకూ రెచ్చిపోయారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసు వ్యవస్థ అంతా కేంద్రం చేతుల్లో ఉండటంతో.. ఆ సమయంలో తక్కువ మంది పోలీసులను పంపారు. ఆ తర్వాత అదనపు పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఇరువర్గాల వారిపై లాఠీచార్జి చేశారు. అప్పటికీ అదుపులోకి రాకపోవటంతో టియర్‌ గ్యాస్‌లను ప్రయోగించారు. భద్రతా కారణాల దృష్ట్యా మౌజ్‌పూర్‌-బాబర్‌పూర్‌ మెట్రో స్టేషన్‌ను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నాయనీ, తగిన భద్రతా సిబ్బందిని మోహరించినట్టు పోలీసు జాయింట్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు.

శాంతియుతంగా నిరసనలు చేస్తున్న తమపై సీఏఏ మద్దతుదారులు కావాలనే రాళ్లదాడికి దిగారని పౌర నిరసనకారులు వాపోయారు. ప్రజాస్వామ్యయుత పద్దతిలో సాగిస్తున్న తమ ఆందోళనలకు భంగం కలిగించే ఉద్దేశంతో వారు ఇటువంటి కుటిలయత్నాలకు పూనుకుంటున్నారని చెప్పారు. అయితే సీఏఏ నిరసనకారులు ఇక్కడ(జాఫ్రాబాద్‌) మరో ‘షాహీన్‌బాగ్‌’ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నారనీ.. అలా కానివ్వమంటూ.. సీఏఏ మద్దతుదారుడు హెచ్చరించ డం గమనార్హం. రాళ్లదాడిలో గాయాలైనవారిలో పలువురు నిరసనకారులతో పాటు ఓ టీవీ జర్నలిస్టూ ఉన్నారు.

జాఫ్రాబాద్‌లో మహిళల నిరసనల హౌరు,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌర ఆందోళనలు
వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ వద్ద శనివారం రాత్రి దాదాపు 200 మంది మహిళలు దీక్షను మొదలుపెట్టారు. జాతీయజెండాలను పట్టుకుని ‘ఆజాదీ’ నినాదాలు వినిపించారు. వీరితో మరికొందరు మహిళలు, చిన్నారులు సైతం వచ్చి చేరడంతో ఆ ప్రాంతంలో నిరసనకారుల సంఖ్య రాత్రికిరాత్రే పెరిగిపోయింది. ”మాకు సీఏఏ, ఎన్నార్సీల నుంచి స్వాతంత్య్రం కావాలి” అని నిరసనకారుల్లో ఒకరు అన్నారు. మహిళలు నిరసన నేపథ్యంలో ఆప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆదివారం ఉదయం మెట్రో స్టేషన్‌ను కూడా ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. జాఫ్రాబాద్‌ పాయింట్‌ వద్ద రైళ్లు ఆగవని స్పష్టం చేశారు. బారికేడ్లను ఇక్కడ నుంచి తొలగించాలంటూ మహిళలు పోలీసులను కోరారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలుపుతున్న వేలాది మంది నిరసనకారుల గొంతులను, మనోభావాలను వినాలనీ, తదనుగుణంగా తప్పనిసరి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని, ప్రధాని మోడీని ఒక మహిళ కోరారు. రోడ్డును నిర్బంధించకూడదనీ, ఇక్కడ నుంచి వెళ్లాలంటూ నిరసనకారులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారని సీనియర్‌ పోలీసు అధికారి వేద్‌ ప్రకాశ్‌ సూర్య తెలిపారు. పారామిలిటరీ భద్రతా సిబ్బందిని కూడా పిలుస్తామని చెప్పారు.

మెట్రోస్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగిన మహిళలు చేతికి నీలిరంగు బ్యాండ్లను కట్టుకొని కనిపించారు. అలాగే ‘జై భీం’ నినాదాలను వినిపించారు. పలువురు మహిళలు అంబేద్కర్‌ చిత్రపటాలను ప్రదర్శించారు. జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకొని కనిపించారు. ‘నో సీఏఏ, నో ఎన్నార్సీ, నో ఎన్పీఆర్‌’, ‘వురు రిజెక్ట్‌ సీఏఏ’ అని రాసి ఉన్న ప్లకార్డులు నిరసనకారుల చేతుల్లో దర్శనమిచ్చాయి. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశరాజధానిలో షాహీన్‌బాగ్‌ తర్వాత అంతటి స్థాయిలో మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు జాఫ్రాబాద్‌ కావడం గమనార్హం. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గత డిసెంబర్‌లో వేలాది మంది నిరసనకారలు జాఫ్రాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ద జాతీయజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. దాదాపు రెండునెలలకు పైగా షాహీన్‌బాగ్‌లో మహిళలు చేస్తున్న నిరసనలు.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్‌ ప్రేరణతో పలు ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చాంద్‌బాగ్‌లోనూ ఇలాంటి నిరసనలే జరిగాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రజలు బయటకు వచ్చి రాజ్‌ ఘాట్‌ వరకూ మార్చ్‌గా వెళ్లారు. అయితే వారి ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో రోడ్డు పైనే బైఠాయించిన నిరసనకారులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వజీరాబాద్‌ రోడ్డును బ్లాక్‌ చేశారు. ఆందోళనలో నేపథ్యంలో అక్కడ సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మోహరించింది. ఖురేజీ, హౌజ్‌ రాణి లలోనూ గత నెలరోజులకు పైగా మహిళలు నిరసనలు చేస్తున్నారు. భీం ఆర్మీ పిలుపు మేరకు ఈ రెండు ప్రాంతాల్లో నిరసనకారులు మార్చ్‌ను నిర్వహించారు. ఆందోళనల కారణంగా ఈ ప్రదేశాల్లో పోలీసులు మోహరించారు. ఖురేజీలో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా.. హౌజ్‌ రాణిలో మార్చ్‌ను నిరసనకారులు కొనసాగించారు.

షాహీన్‌బాగ్‌పై కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన సుప్రీం మధ్యవర్తి
షాహీన్‌బాగ్‌ నిరసనలపై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలైంది. సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తుల్లో ఒకరైన వజాహత్‌ హబీబుల్లా షాహీన్‌బాగ్‌లో రోడ్డు దిగ్బంధనంపై ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్‌ నేడు(సోమవారం) విచారణ జరపనుంది. ”షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన శాంతియుతంగా జరుగుతున్నది. షాహీన్‌బాగ్‌ చుట్టూ ఐదు పాయింట్లను పోలీసులు దిగ్బంధించారు” అని తన అఫిడవిట్‌లో వజాహత్‌ హబీబుల్లా పేర్కొన్నారు.

Courtesy Nava Telangana