– బీహార్‌లో విరుచుకుపడిన ఖాకీలు
– వలసకార్మికులపై విరిగిన లాఠీ

పాట్నా : శ్రామిక్‌ రైలులో కేరళ నుంచి బీహార్‌లోని కతిహార్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వందలాది మంది వలసకార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సొంత జిల్లాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటుచేయాల్సిందిగా కోరుతూ గురువారం ఉదయం వలసకార్మికులు నిరసనకు దిగారు. దీంతో రెచ్చిపోయిన ఖాకీలు వారిపై ఇష్టానుసారం లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనలో 10 మందికిపైగా వలసకార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి తిరిగివచ్చిన వలసకార్మికులను 14 రోజులపాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచటం, వారిని సొంత జిల్లాలకు పంపేందుకు రవాణా సౌకర్యాలను కూడా బీహార్‌ ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి నిలిపివేసింది. అలాగే జూన్‌ 15 నాటికి బ్లాక్‌ స్థాయిలో అన్ని క్వారంటైన్‌ కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేరళ నుంచి కతిహార్‌ రైల్వే స్టేషన్‌కు గురువారం ఉదయం చేరుకున్న వలసకార్మికులకు సొంత జిల్లాలకు వెళ్లేందుకు ఎలాంటి సౌకర్యాలూ కల్పించలేదు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగగా, వారిపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. ‘కేరళ నుంచి 48 గంటలకుపైగా భోజనం, తాగు నీరు కూడా లేక రైలులో ప్రయాణించి కతిహార్‌ చేరుకున్నాం.

చేతిలో డబ్బులు కూడా లేవు. ప్రభుత్వం బస్సులు ఏర్పాటుచేస్తున్నట్టు ముందుగా చెప్పారు. కానీ, ఇక్కడకు వచ్చాక.. ఎలాంటి సౌకర్యాలూ లేవు..

శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న మాపై పోలీసులు విరుచుకుపడ్డారు.. ఇప్పుడు మేం సొంతూర్లకు ఎలా పోవాలి?’ అని శరణ్‌ ప్రాంతానికి చెందిన వలస కార్మికుడు నాగేందర్‌రారు ప్రశ్నించారు. ‘వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచకపోతే.. కోవిడ్‌ కేసులు పెరిగే అవకాశమున్నది.

రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగటానికి గత నెలలో రాష్ట్రానికి వచ్చిన వలసకార్మికులే కారణమని ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పుడు వలసకార్మికులను క్వారంటైన్‌లో ఉంచకుండా గ్రామాల్లోకి అనుమతిస్తే.. అంటువ్యాధులు మరింత పెరిగే ప్రమాదముంది. అలాగే ఎన్నో కష్టాలు పడి రాష్ట్రానికి వచ్చిన వారిని ఈ విధంగా లాఠీలతో స్వాగతించటం దారుణం’ అని ఓ సీనియర్‌ ఆరోగ్య అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.

Courtesy Nava Telangana