– గ్లోబల్‌ జీడీపీ మైనస్‌ 5.2 శాతానికి..
– భారత వృద్ధి మైనస్‌ 3.2 శాతానికి..
– కరోనాతో కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థలు : ప్రపంచ బ్యాంక్‌

వాషింగ్టన్‌ : రెండో ప్రపంచ యుద్దం తర్వాత తొలిసారి కరోనా వల్ల అతిపెద్ద సంక్షోభం చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విజృంభించడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల ఆదాయాలు భారీగా తగ్గిపోయాయనీ, కోట్లాది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని విశ్లేషించింది. 2020లో ప్రపంచ జీడీపీ ఏకంగా మైనస్‌ -5.2 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. ఇంతక్రితం జనవరిలో 2.5 శాతం వృద్ధి ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే. గడిచిన 150 ఏండ్లలో నాలుగు అతిపెద్ద సంక్షోభాల్లో ఇది ఒక్కటిని పేర్కొంది. 1914, 1930 -32, 1945-46 తర్వాత కరోనా వల్ల 90 శాతం దేశాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. 1870 తర్వాత ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చే ఒక మహమ్మారి కారణంగా ప్రపంచం తిరోగమనంలో పడడం ఇదే ప్రథమమని పేర్కొంది. కాగా 2021లో ప్రపంచ జీడీపీ మళ్లీ 4.2శాతం పెరుగొచ్చని విశ్లేషించింది. యూరోజోన్‌ ోని అభివృద్ధి చెందిన దేశాల జీడీపీ 7 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. వర్థమాన దేశాల ఆర్దిక వ్యవస్థలు 2.5 శాతం మేర క్షీణించవచ్చని తెలిపింది. చైనా ఆర్ధిక వ్యవస్థ మాత్రం 1 శాతం వృద్ధినినమోదు చేసే అవకాశాలున్నాయని పేర్కొంది.

భారత వృద్ధి (-) 3.2 శాతానికి క్షీణత
భారత ఆర్థిక వద్ధిపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వద్దిని నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా వద్ధి రేటు మైనస్‌ 3.2 శాతానికి పడిపోవచ్చని విశ్లేషించింది. ముఖ్యంగా కరోనా వైరస్‌ కట్టడికి వివిధ దశల్లో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడంతో కోలుకోలేని దెబ్బ పడిందని పేర్కొంది. అయితే 2021లో వృద్ధిరేటు తిరిగి పుంజుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యల మూలంగా వినియోగం భారీగా క్షీణించిందనీ, సేవల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని తెలిపింది. అలాగే ఈ అనిశ్చితి ప్రయివేటు పెట్టుబడులను అడ్డుకుంటుందని వ్యాఖ్యానించింది. మూడీస్‌, ఫిచ్‌, ఎస్‌ అండ్‌పీ వంటి గ్లోబల్‌ సంస్థలు ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ 4 నుంచి 5 శాతం ప్రతికూల వద్ధి అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే.

Courtesy Nava Telangana