• ఆ షో ముసుగులో క్యాస్టింగ్‌ కౌచ్‌!.. బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్నారా?
  • ఉత్తరాది సంస్కృతిని తెలుగువారిపై రుద్దుతారా?
  • ఆ షోను నిషేధించాలి.. వెలివెయ్యాలి
  • నిర్వాహకులు నా పత్రాలు నాకు ఇవ్వాలి
  • లేదంటే న్యాయ పోరాటం: యాంకర్‌ శ్వేతారెడ్డి

బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ను ‘ఇంప్రెస్‌’ చేయాలట! ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా? తెలుగువాళ్లపై గలీజ్‌ కల్చర్‌ రుద్దుతామంటే ఊరుకోం. బిగ్‌బాస్‌-3ని నిషేధించాలి. తెలుగు టీవీ నుంచి వెలివేయాలి… బిగ్‌బాస్‌ వల్ల ఎవరూ బాగుపడలేదు. బిగ్‌బాస్‌ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్‌ హౌస్‌ నడుపుతున్నారా?’’ అని యాంకర్‌, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి మండిపడ్డారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ జరుగుతోందని ఆమె ఆరోపించారు. బిగ్‌బాస్‌ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే తాను ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని ఆమె చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏప్రిల్‌లో బిగ్‌బాస్‌ సమన్వయకర్త ఒకరు తనకు ఫోన్‌ చేసి.. బిగ్‌బాస్‌-3కి తనను ఎంపిక చేశామని తెలిపారన్నారు. తనను ఎందుకు ఎంపిక చేశారని అడగ్గా.. పాపులర్‌ యాంకర్‌ కాబట్టి ఎంపిక చేశామని చెప్పారని వివరించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే వారికి తన నిర్ణయం తెలిపానన్నారు. సమన్వయకర్త రవికాంత్‌ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసి.. తనకు తోడుగా వచ్చిన వారిని దూరంగా పెట్టి మాట్లాడేవారని శ్వేతారెడ్డి వివరించారు. షోలో పాల్గొనడానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకునే సమయంలో కొన్ని కాగితాలపై తాను సంతకాలు చేశానని.. వాటికి సంబంధించి జిరాక్స్‌ కాగితాలు తనకు ఇవ్వలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలోనే.. ‘‘‘మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి? మా బాస్‌ని ఎలా ఇంప్రెస్‌ చేస్తారు?’ అని బిగ్‌బాస్‌ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ అడిగారు’’ అని శ్వేతారెడ్డి ఆరోపించారు. అప్పుడు తాను.. ‘నేనెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలి’ అని నిలదీశానని చెప్పారు. తనతో చాలాసార్లు సమావేశాలు పెట్టి, అగ్రిమెంట్‌ చేశారని, చివరకు ‘కమిట్‌మెంట్‌’ అడిగారని.. ఇది మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం కిందికి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ చాలామందితో ఇలాగే చేశారన్న విషయం తనకు తెలిసిందని.. కొంత మంది బాధితులు తనకు ఫోన్‌ చేస్తున్నారని శ్వేతారెడ్డి చెప్పారు.

ఇప్పటికే చాలా మంది బాధితుల వివరాలు సేకరించానని.. మిగతా వారు బయటికి వస్తారని ఆమె తెలిపారు. ఈ షోలో పాల్గొనడానికి సంబంధించి తనను సంప్రదించిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌.. ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదన్నారు. ‘నా డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిమ్మిక్కులు చేస్తున్నారా’ అని ఆమె మండిపడ్డారు. ఆ పత్రాలు తనకు ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని.. తనతో పాటు మహిళా సంఘాలు ఉన్నాయని హెచ్చరించారు. శ్రీరెడ్డి విషయంలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఏర్పాటు చేసిన కమిటీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ‘బిగ్‌బాస్‌-3’ని బ్యాన్‌ చేయాలని.. అసలు ఆ షోనే తెలుగు టెలివిజన్‌ నుంచి వెలివేయాని శ్వేతారెడ్డి డిమాండ్‌ చేశారు.

(Andhrajyothi Soujanyamto)