నినదించిన హిందూ, ముస్లిం, సిక్కులు
మలేర్‌కోట్లలో వేలాదిమందితో భారీ ప్రదర్శన
సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్‌లో నిరసనలు

చండీగఢ్‌ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన పట్ల పంజాబ్‌లో అన్ని మతాల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నది. సంగ్రూర్‌ జిల్లాలోని మలేర్‌కోట్ల పట్టణంలో సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనలో హిందూ, ముస్లిం, సిక్కు మతాలకు చెందిన వేలాదిమంది పాల్గొన్నారు. పంజాబ్‌లో హిందూత్వ ఎజెండాను అనుమతించబోమని ఐక్యంగా నినదించారు. ముస్లింల పట్ల వివక్షతో కూడిన చట్టాన్ని హిందువులు, సిక్కులు వ్యతిరేకించడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ నిరసనలు పంజాబ్‌ రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. పట్టణంలోని దాణా మండిలో నిర్వహించిన కార్యక్రమంలో 14 ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిన తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్పీఆర్‌, ఎన్నార్సీ పేరుతో ప్రజల్ని ఆందోళనకు గురి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రదర్శనలో పాల్గొన్న యువకులు చేబూనిన ప్ల కార్డులపై పలు సందేశాత్మక నినాదాలున్నాయి. ‘పుస్తకాలు అవసరమైనవారికి దానం చేయండి. అమిత్‌ షా అనే విద్యార్థికి భారత రాజ్యాంగం అనే పుస్తకం’ ఇవ్వండి అంటూ ఓ ప్లకార్డును ప్రదర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ తీరును తప్పు పడ్తూ మతాలకతీతంగా వేలాది గొంతులు నినదించడం దేశ ప్రజల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని లౌకికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరి 9 నుంచి ఈ పట్టణంలో సీఏఏకు వ్యతిరేకంగా ప్రదర్శనలు,ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదే పట్టణంలో ఈ నెల 1న నిర్వహించిన ర్యాలీలో 20వేలమంది ప్రజలు పాల్గొన్నారు.

ఆ ర్యాలీలో పాల్గొనేందుకు గ్రామాల నుంచి రైతులు కూడా తరలి రావడం గమనార్హం. ఈ నెల 24 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్టు పంజాబ్‌ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ నేత లక్ష్మణ్‌సింగ్‌ ప్రకటించారు. ఎజెండాను పంజాబ్‌లో అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో షహీద్‌ భగత్‌సింగ్‌ బంధువు ప్రొఫెసర్‌ జగ్‌మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు. మోడీ, అమిత్‌షాలాంటి పాలకులు దేశ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేయగా, దాన్ని కాపాడుకునేందుకు ప్రజలు రోడ్ల మీదికి రావాల్సి వస్తోందని జగ్‌మోహన్‌సింగ్‌ విమర్శించారు.

ఫ్లాట్‌ అమ్మి.. నిరసనకారులకు రొట్టెలు అందజేసి.. ఢిల్లీలో ఒక సిక్కు ఉదారత
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఒక సిక్కు తన ఫ్లాట్‌ను అమ్మి షాహీన్‌బాగ్‌లో నిరసనకారులకు లంగర్‌(భోజనశాల) ఏర్పాటు చేసి రొట్టెలు ఇప్పటికీ అందిస్తున్నారు. ఆయన ‘హిందూ ముస్లిం సిక్కు ఇసాయి బాయీ బాయీ’ అని చెప్తూ ఈ పనికి పూనుకున్నారు. ఆయన భార్య, కుమారుడు కూడా ఇతర నిరసన కేంద్రాలలో లంగర్‌ ఏర్పాటు చేశారు. నిరసన ఎంతకాలం జరిగినా.. నిరసనకారులకు ఇదేవిధంగా ఆహారం అందజేస్తామని తెలిపారు.

ఈ భూమ్మీద విప్లవాన్ని తీసుకొస్తా.. తొలిసారి నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళ స్పందన
న్యూఢిల్లీ : సోదరీభావం, సంఘీభావం అనే భావనతో ‘మహిళా ఏక్తా మంచ్‌’ వారు ఈనెల 14 నుంచి 16 వరకు ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, 24 గంటలు నిరసనలు కొనసాగుతున్న కేంద్రాలను సందర్శించారు. అందులో మొదటిసారి నిరసనలో పాల్గొంటున్న ఒక మహిళను ప్రశ్నించగా.. ‘ఈ నిరసనలో క్షేత్రస్థాయిలో పాల్గొనీ, ఈ భూమ్మీద విప్లవం తీసుకురావాలనుకుంటున్నాను’ అని ఉద్వేగంగా సమాధానమిచ్చింది.

Courtesy Nava Telangana