వేలాది మందితో భారీ నిరసన ర్యాలీ
తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ ఆందోళనలు

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై పౌర నిరసనలతో హౌరెత్తింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని డిమాండ్‌ చేస్తూ పలు ముస్లిం సంఘాలు బుధవారం ‘చలో సెక్రెటేరియట్‌’కు పిలుపునిచ్చాయి. అయితే ముస్లింసంఘాల ర్యాలీకి తొలుత పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఈ అంశం మద్రాసు హైకోర్టుకు చేరింది. అనుమతిని నిరాకరిస్తూ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిరసనకారులు మార్చ్‌కు మొగ్గు చూపారు. దీంతో చెన్నైలోని వల్లజాV్‌ా రోడ్డు మీద గుమిగూడిన నిరసనకారులు రాష్ట్ర సెక్రెటేరియట్‌ వైపునకు మార్చ్‌గా వెళ్లారు. దీంతో మార్చ్‌ జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. సెక్రెటేరియట్‌ను నిరసనకారులు ముట్టడించే అవకాశం ఉండటంతో అటువైపుగా వెళ్లే దారి గుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిరసన ర్యాలీలో ఆందోళనకారులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ జెండాలను ప్రదర్శించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ర్యాలీని పోలీసులు సెక్రెటేరియట్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియం వద్ద అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులంతా అక్కడ గుమిగూడారు. పలువురు నాయకులు నిరసనకారులనుద్దేశిస్తూ ప్రసంగించారు.

అనంతరం జాతీయగీతాన్ని ఆలపించి ర్యాలీకి ముగింపు పలికారు. గతనెల రోజుల నుంచి చెన్నైలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత శుక్రవారం.. వాషర్మెన్‌పేట్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో అక్కడ ఆందోళనలు ఉధృతమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మహిళలు ప్రతిరోజు ఆందోళనలు నిర్వహిస్తుండటంలో అది చెన్నై షాహీన్‌బాగ్‌గా పేరొందిన విషయం తెలిసిందే.

అలాగే తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ పౌర ఆందోళనలు జరిగాయి. తిరుప్పూర్‌లో పలు ముస్లిం సంఘాలకు చెందిన ఐదు వేల మందికి పైగా నిరసనకారులు ర్యాలీని చేపట్టారు. సేలంలోని జిల్లా కలెక్టరేటు ముందు ముస్లిం సంఘాలకు చెందిన సభ్యులు ఆందోళన చేపట్టారు. డీఎంకే, కాంగ్రెస్‌, సీపీఐ సహా పలు పార్టీల నాయకులు ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే తిరునల్వేలి, క్రిష్ణగిరి, వెల్లూరు, కోయంబత్తూరు, తూత్తుకుడి, తిరుచ్చితో పాటు పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.

Courtesy Nava Telangana