ఢిల్లీ, ముంబయిలలో భారీ ప్రదర్శనలు..
ప్రార్థనల నేపథ్యంలో పోలీసుల దిగ్బంధనంలో ఢిల్లీ, యూపీ..
– 21 జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌.. మరో ఇద్దరి మృతి
ఏఎంయూలో 1200 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు

న్యూఢిల్లీ, లక్నో, ముంబయి : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు నానాటికీ ఉధృతమవుతూనే ఉన్నాయి. ఈ నెల 12 న సీఏఏ చట్టంగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఈశాన్య భారతం మొదలు దేశమంతా భగ్గుమంటూనే ఉన్నది. ఇందులో భాగంగా పదిహేనో రోజైన శుక్రవారం సైతం నిరసనకారులు దేశవ్యాప్తంగా తమ నిరసనలు కొనసాగించారు. దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధానితో పాటు అసోం, యూపీ, బెంగాల్‌, కర్నాటక, రాజస్థాన్‌లలోనూ ప్రజలు రోడ్లమీదకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలిపారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఢిల్లీ, యూపీలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రధాని నివాసం ముట్టడికి యత్నం..
దేశరాజధానిలో సీఏఏ నిరసనలలో భాగంగా భీమ్‌ ఆర్మీకి చెందిన వందలాది మంది నిరసనకారులు లోక్‌కళ్యాణ్‌మార్గ్‌లో ఉన్న ప్రధాని మోడీ నివాసం ముట్టడికి యత్నించారు. ఇటీవలే అరెస్టు చేసిన భీమ్‌ ఆర్మీ అధినేత చంద్రశేఖర్‌ ఆజాద్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వారు మోడీ నివాసానికి ర్యాలీగా వెళ్లగా పోలీసులు లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌ ప్రవేశం, బయటకు వెళ్లే దారులను మూసివేసి నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు. దీంతోపాటు ఢిల్లీలో ఉన్న యూపీ భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన జామియా మిలియా వర్సిటీ విద్యార్థి నాయకులనూ పోలీసులు అడ్డుకున్నారు. యూపీ భవన్‌ వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. అలాగే, జామా మసీదు వద్ద ప్రార్థనల అనంతరం భారీ ఎత్తున గుమ్మిగూడిన నిరసనకారులు.. సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ నాయకుడు అక్లా లంబ, మాజీ ఎమ్మెల్యే షోయబ్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబ మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగం ప్రధానమైన సమస్యగా ఉన్నదనీ కానీ మోడీ సర్కారు మాత్రం ఎన్నార్సీ పేరు మీద ప్రజలను రోడ్లమీదకు తీసుకువస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.
ఇంటర్నెట్‌ బంద్‌…
యూపీలో 21 జిల్లాల్లో ఇంటర్నెట్‌ను బంద్‌ చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయనే ఆరోపణతో ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పోలీసులు చెప్పారు. మరోవైపు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో యూపీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మొహరించారు. మసీదులు, ప్రధాన కూడళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. డ్రోన్ల సాయంతో భద్రతను పర్యవేక్షించారు. ఇదిలాఉండగా.. సీఏఏ ఆందోళనల్లో పాల్గొని గతవారం పోలీసుల బుల్లెట్లు తగిలి గాయపడిన ఫిరోజాబాద్‌కు చెందిన ఇద్దరు పౌరులు ఢిల్లీలోని ఏయిమ్స్‌లో గురువారం మరణించారు. ఈ నెల 24న ఫిరోజాబాద్‌లో జరిగిన ర్యాలీలో మహ్మద్‌ హరూన్‌, మహ్మద్‌ షఫీక్‌లు పాల్గొనగా పోలీసుల కాల్పుల్లో గాయాలపాలయ్యారు. వీరి మరణంతో యూపీలో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 372 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సీఏఏ ప్రతులు కాల్చివేత
పూణెలో భీమ్‌ ఆర్మీకి చెందిన కార్యకర్తలు సీఏఏ ప్రతులను కాల్చివేసి తమ నిరసను తెలిపారు. ఈ చట్టం భారత రాజ్యాంగ సూత్రాలను వ్యతిరేకమనీ, దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. మరోవైపు ఢిల్లీ, యూపీకి చెందిన విద్యార్థులు, సామాజిక, హక్కుల కార్యకర్తలు ‘ఇంక్విలాబ్‌ మోర్చా’ పేరిట ముంబయిలోని ఆజాదీ మైదాన్‌ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆజాద్‌ మైదాన్‌లో నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారు రోడ్లమీదే బైటాయించారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఐద్వా అధ్యక్షురాలు మాలిన భట్టాచార్య మాట్లాడుతూ.. ‘మోడీ సర్కారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులను ఈ సర్కారు హరించివేస్తున్నది. ఈ సమయంలో అందరం ఏకం కావాలి. ఈ పోరాటంలో మహిళలు ముందుండాలి’ అని తెలిపారు.
1200 మందిపై ఎఫ్‌ఐఆర్‌..
144 సెక్షన్‌ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణతో అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లోని సుమారు 1200 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరిలో విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కూడా ఉన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలలో పోలీసుల బుల్లెట్లు తాకి మరణించిన వారికి సంఘీభావంగా ఈ నెల 24న ఏఎంయూలో దాదాపు 2 వేల మంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అయితే 144 సెక్షన్‌ అమల్లో ఉండగా, నిరసనకారులు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే ప్రదర్శన చేశారని పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. కాగా, దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
యూపీలో సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతూ మరణించిన వారి మృతిపై న్యాయ విచారణ చేయాలని ప్రముఖ బాలీవుడ్‌ దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన పలువురు బాలీవుడ్‌ నటులు అపర్ణాసేన్‌, స్వరభాస్కర్‌, అయ్యూబ్‌ల సంతకాలతో కూడిన ఓ లేఖను విడుదల చేశారు. మృతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు తెలిపారు. అలాగే ఈ చట్టంపై యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
ఆ ఆలోచనే లేదు : విజయన్‌
కేరళలో నిర్బంధ గృహాలను నిర్మించే ఆలోచనే లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కార్యాలయం తెలిపింది. ఈమేరకు దేశంలోకి అక్రమంగా చొరబడిన వారికి, వీసాల గడువు ముగిసి వారిని నిర్బంధించేందుకు గానూ పినరయి సర్కారు డిటెన్షన్‌ సెంటర్లను నిర్మించే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తలను సీఎంవో ఖండించింది. కాగా, కేరళలో ఎన్నార్సీని అమలుచేయబోమని ఇప్పటికే విజయన్‌ స్పష్టం చేసిన విషయం విదితమే.
గొగోయ్ కు 14రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ
న్యూఢిల్లీ: అసోంలో సీఏఏ వ్యతిరేక నిరసనలను ముందుండి నడిపించిన ఆర్టీఐ కార్యకర్త, రైతు నాయకుడు అఖిల్‌ గొగోయ్ కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు.. 14రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. అఖిల్‌ చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలతో పోలీసులు ఈ నెల 20న అరెస్ట్‌ చేయగా, గురువారం ఆయన ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఆయన వ్యక్తిగత డ్యాక్యుమెంట్లు, పుస్తకాలను సీజ్‌ చేసింది. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన ఎన్‌ఐఏ.. విచారణకు మరికొద్ది రోజుల సమయం కావాలని కోరగా, కోర్టు 14రోజులపాటు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. కాగా, అఖిల్‌కు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అసోంలో అప్పటి కాంగ్రెస్‌ పాలనలో ఆయనపై 2009లో కేసు నమోదైంది.
మోడీ అబద్దాలకోరు : తరుణ్‌ గొగోయ్
దేశంలో ఇంతవరకు ఒక్క నిర్బంధ కేంద్రాన్ని (డిటెన్షన్‌ సెంటర్స్‌) కూడా నిర్మించలేదని ప్రధాని మోడీ చెప్పిన మాటలు అబద్దమని అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగోయ్ అన్నారు. మోడీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… ‘మోడీ అబద్దాలు చెబుతున్నారు. వాజ్‌పేయి ప్రభుత్వంలోనే నిర్బంధ గృహాలను నిర్మించాలని భావించారు. కానీ, 2009లో గువహతి కోర్టు ఉత్తర్వులతో మొదట వీటిని నిర్మించారు. కానీ మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోలపుర జిల్లాలోని మటియా వద్ద దేశంలోనే అతి పెద్దదైన (సుమారు 3 వేల మందిని ఉంచేందుకు వీలుగా) నిర్బంధ గృహాన్ని నిర్మించేటందుకు గానూ ఎన్డీయే సర్కారు రూ. 46 కోట్లను మంజూరు చేసింది. అసోంలో ఇలాంటి కేంద్రాలు ఇప్పటివరకు ఆరు ఉన్నాయి. అయితే ఇవి జైళ్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.’ అని తెలిపారు.
ఈ సారి నార్వే మహిళను..
సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న జర్మన్‌ విద్యార్థిని వీసా నిబంధనల ఉల్లంఘనల పేరుతో భారత్‌ నుంచి స్వదేశానికి పంపించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. నార్వేకు చెందిన మరో పర్యాటకురాలినీ భారత్‌నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. జాన్‌-మెట్టే జాన్సన్‌ అనే నార్వే దేశస్థురాలు 2014నుంచి భారత్‌లో పర్యటిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్‌లోనూ వచ్చింది. ఈ సందర్భంగా కేరళలో సీఏఏకు వ్యతిరేకంగా సోమవారం తలపెట్టిన భారీ ర్యాలీలో జాన్సన్‌ పాల్గొన్నది. దీనికి సంబంధించిన ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేస్తూ.. ‘ప్రజలు తలపెట్టిన లాంగ్‌మార్చ్‌ విజయవంతమైంది. 12కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీ ఎంతో శాంతియుతంగా జరిగింది. ప్రజలంతా నిబద్ధతతో తమ గళాలను వినిపిస్తున్నారు. దారిలో రెండుసార్లు శీతలపానియాలూ అందించారు’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌.. ఫారెనర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) దృష్టికి వెళ్లడంతో శుక్రవారం ఆమె ఉంటున్న కొచ్చిలోని హౌటల్‌కు సంబంధిత అధికారులు చేరుకుని ప్రశ్నించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందున వీలైనంత తొందరగా దేశంవిడిచి వెళ్లాలని ఆదేశించారు.

Courtesy Nava telangana