•  హరితహారానికి భారీ ఏర్పాట్లు
  • జలవిహార్‌లో పలు కార్యక్రమాలు

ఖైరతాబాద్ : సీఎం కేసీఆర్‌ సోమవారం 67వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా సోమవారం భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు భాగస్వాములు కానున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి కార్యకర్త ఒక మొక్క నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విటర్‌లో పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లను, ప్రభుత్వ అధికారులూ హరితహారంలో పాల్గొనాలని కోరారు. వివిధ సంఘాలు, యూనియన్లు కూడా హరితహారంలో పాల్గొనాలని, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీఎం జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జలవిహార్‌ సిద్ధమవుతోంది. ఏర్పాట్లను మంత్రి తలసాని సమీక్షించారు. పాఠశాల విద్యార్థులతో కలసి ‘వీ లవ్‌ కేసీఆర్‌’ లోగోను ఆవిష్కరించారు. కేసీఆర్‌ బాల్యం, పాఠశాల విద్య, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ సాధనకు చేసిన కృషి, ముఖ్యమంత్రిగా అమలు చేస్తు న్న సంక్షేమ కార్యక్రమాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సోమవారం జలవిహార్‌లో కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. గుస్సాడి, కొమ్ము, కోయ, ఒగ్గుడోలు, బోనాలు, కోలాటం, పులి వేషాలు, యక్షగానం, బతుకమ్మ తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను ప్రారంభిస్తామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, కంటి వెలుగు, మిషన్‌ భగీరథ, రైతుబంధు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, ఐటీ హబ్‌ లాంటి సంక్షేమ పథకాలను ఎల్‌ఈడీ స్ర్కీన్‌లలో ప్రదర్శిస్తామని చెప్పారు. వేరా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు.

తలసానికి జీహెచ్‌ఎంసీ రూ.5 వేల జరిమానా!
‘వీ లవ్‌ యూ కేసీఆర్‌’ అనే కటౌట్‌ను నెక్లెస్‌ రోడ్డుపై ఏర్పాటు చేసినందుకు మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ రూ.5 వేల భారీ జరిమానా విధించింది. మంత్రులు కేటీఆర్‌, తలసానిల కటౌట్లను కూడా నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సురక్ష యోజన వెల్ఫేర్‌ సొసైటీ ట్విటర్‌లో ఫిర్యాదు చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఈసీ బృందం నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించడంతో జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది.

Courtesy Andhrajyothi