• దశాబ్దాలుగా వివాదాల సుడి
  • 120 ఎకరాల భూములపై వివాదాలు
  • అధికారులపై ఒత్తిళ్లు… రికార్డులు తారుమారు
  • దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన మహిళా తహసీల్దార్‌ దారుణహత్య ఉదంతం వెనుక కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. అత్యంత వివాదస్పదమైన ఈ భూముల వ్యవహారంలో కొందరు పెద్దలు తల దూర్చడంతో సమస్య మరింత జఠిలమై చివరకు మారణకాండకు దారితీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూములపై కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. కోర్టు కేసులు లేదా అధికారుల నిర్ణయాల వల్ల వందల కోట్ల రూపాయల ఆస్తులు కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భాలు కోకొల్లలు. ఇలాంటి పెద్ద కేసుల్లో కూడా ఆస్తులు పొగొట్టుకున్న వారు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు తప్ప ఇలాంటి దురాగాతాలకు పాల్పడిన సంఘటలను ఎన్నాడూ జరగలేదు. మొదటి సారిగా నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మహిళా తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. నిందితుడు సురేష్‌ ఇంత దారుణానికి ఒడిగట్టడాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. ఈ హత్యోదంతంతో బాచారంలోని భూముల వివాదం ఏమిటనే దానిపై ఉన్నతస్థాయి విచారణ మొదలైంది. ఈ భూముల వివాదానికి సంబంధించిన వివరాలు తవ్వి తీస్తుండడంతో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అత్యంత వివాదాస్పదమైన ఈ భూముల వ్యవహారంలో కొందరు పెద్దల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విలువైన భూములపై కన్నెసిన కొందరు పెద్దలు ఈ భూముల రికార్డులను మార్చి, వీటిని వివాదంగా మార్చారు. దీంతో అసలు పట్టాదారులు, కౌలుదారులు, అనుభవదారులు, కబ్జాదారుల మధ్య వివాదాలు పెరిగిపోయి. కోర్టు కేసుల వరకు వెళ్లాయి. స్థానికుల కథనం ప్రకారం బాచారంలోని సర్వేనంబరు 90 నుంచి 101 వరకు దాదాపు 400 ఎకరాలకుపైగా భూమికి రాజ్యలక్ష్మీబాయి అనే ఆమె హక్కుదారు. ఆమెకు పిల్లలు లేకపోవడంతో మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావును దత్తత తీసుకుని, ఈ భూములను ఆయనపై రాసింది. అయితే తరువాత కాలంలో రాజా ఆనందరావు ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఖాళీగా ఉన్న ఈ భూములను స్థానికులు కొందరు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంతా కూడా పక్కనే ఉన్న గౌరెల్లికి చెందిన వారు. అయితే శివార్లలో భూముల ధరలు పెరగడంతో ఈ భూముల హక్కుదారులమని కొందరు తెరపైకి వచ్చారు. రాజా ఆనందరావు దగ్గర ఈ భూములు కొనుగోలు చేశామని కొందరు, ఆయన వద్ద కౌలు తీసుకున్నామని మరికొందరు తెరపైకి వచ్చారు.

వివాదంలో పెద్దల హస్తం?….1990 నుంచి ఈ భూములపై వివాదాలు మొదలయ్యాయి. 2004 తరువాత కొందరు రాజకీయ నేతలు కళ్లు పడ్డాయి. అప్పట్లో పెద్దలు.. కౌలుదారులుగా చెప్పుకుంటున్న వారి నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ఈ విషయంలో స్థానికులకు, వారికి వివాదాలు మొదలయ్యాయి. ఇంతలో కొంతమంది అసలైన హక్కుదారలమని తెరపైకి వచ్చారు. దీని వెనుక కూడా ఈ పెద్దలే ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఇలా దాదాపు 120 ఎకరాలపై వివాదాలు హైకోర్టు వరకు వెళ్లాయి. సుమారు 77 ఎకరాలు కౌలుదారుల చేతిలో, 42 ఎకరాలు పట్టాదారుల ఆధీనంలో ఉన్నాయి. ఈ వివాదాలకు సంబంధించి నిందితుడు సురేష్‌ కూడా హైకోర్టుకు వెళ్లాడు. ఈలోగానే పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల కోసం తహసీల్దార్‌పై వత్తిడి తెచ్చారు. తహసీల్దార్‌ తనకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంతో దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ వివాదస్పద భూముల వ్యవహారంలో ఒక మంత్రికి సంబంధించిన వారితో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, ఒక మీడియా సంస్థల అధినేత, వైఎస్‌ హయాంలో చక్రం తిప్పిన మరో నేతకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ భూములు కొని ఈ వివాదాలను మరింత పెంచారు. ఇలా భూములు కొన్న పెద్దలు తమకు అనుకూలంగా రికార్డులు మార్చాలని అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు.

Courtesy Andhrajyothi..