– కె. వేణుగోపాల్‌

 ఎన్. వేణుగోపాల్

ఇప్పటికే సోదాలు, జప్తులు, దర్యాప్తు, విచారణ జరిగిపోయి, చార్జిషీట్లు కూడ దాఖలై, నేరారోపణల ఖరారు కూడ అయిపోయిన తర్వాత కొత్తగా మరొక దర్యాప్తు సంస్థ చేయగలిగినదేమిటి? ఇది కేవలం తమకు భిన్నమైన వైఖరి ఉన్న ప్రభుత్వం చేతి నుంచి తన చేతికి నిందితులను మార్చుకుని, మరింత వేధించడానికి కాకపోతే దీని ఔచిత్యమేమిటి? ఇప్పటివరకూ ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా ఉన్న పోలీసు అధికారి, ప్రభుత్వ న్యాయవాది, విచారించిన న్యాయమూర్తి (వాస్తవానికి ఇప్పటికి ముగ్గురు న్యాయమూర్తులు మారారు) అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేసును తన చేతి నుంచి మార్చడం అనుచితమని, దురుద్దేశ పూరితమని అంటున్నప్పుడు ఈ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించాలా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించాలా?

వరవరరావుతో సహా తొమ్మిది మంది ప్రజాపక్ష మేధావులు నిందితులుగా ఉన్న భీమా కోరేగాం – ఎల్గార్ పరిషద్‌ కేసును మహారాష్ట్ర పోలీసుల నుంచి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ)కి మార్చాలని కేంద్రం జనవరి 24న హఠాత్తుగా తీసుకున్న నిర్ణయపు పూర్వాపరాలను పరిశీలిస్తే దేశంలో ఎంతటి అక్రమపాలన సాగుతున్నదో అర్థమవుతుంది. గత యుపిఎ ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన ఎన్‌ఐఎ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక నేరాల దర్యాప్తును తన అదుపులోకి తీసుకునే అధికారం ఉందనే మాట నిజమే. కాని చట్టం ఇచ్చిన ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అసలు నేరస్తులను తప్పించడానికి, భిన్నాభిప్రాయాలున్న వారిమీద కక్ష సాధించడానికి, నిష్పూచీగా నిందితుల ఖైదు కాలం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి సంఘ్ పరివార్, హోం మంత్రిత్వ శాఖ చేస్తున్న కుటిల ప్రయత్నాలు ఈ బదిలీలో కనబడుతున్నాయి.

పుణెలో 2017 డిసెంబర్ 31న జరిగిన ఎల్గార్ పరిషద్ సభలో ఇచ్చిన రెచ్చగొట్టే ఉపన్యాసాల వల్ల ఆ మర్నాడు భీమా కోరేగాంలో హింస జరిగిందని ఈ కేసు మొదట నమోదయింది. వాస్తవానికి అక్కడ జరిగిన హింసాకాండకు కారకులూ కుట్రదారులూ శివ ప్రతిష్టాన్ హిందుస్థాన్ నాయకుడు శంభాజీ భిడే, సమస్త హిందూ అఘాది నాయకుడు మిలింద్ ఎక్బోటే. వీరిలో శంభాజీ భిడే ప్రధాని నరేంద్ర మోదీ చేత గురూజీ అని పిలిపించుకునే మాజీ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు. హింసాకాండ జరిగిన వెంటనే స్థానికుల ఫిర్యాదుతో ఆ ఇద్దరి మీద 2018 జనవరి 2నే ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది గాని దాని మీద పోలీసులు ఏ చర్యలూ తీసుకోలేదు. గురూజీని అరెస్టే చేయలేదు, ఎక్బోటేను అరెస్టు చేసి బెయిల్ మీద వదిలేశారు. హింసాకాండకు బాధ్యులైన సంఘ్ కార్యకర్తలనూ నాయకులనూ తప్పించడానికి, కేసును మసిపూసి మారేడుకాయ చేసి తమ ప్రత్యర్థుల మీదికి గురిపెట్టడానికి సంఘ్ నాయకులూ, పోలీసులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎల్గార్ పరిషద్ సభకూ, హింసాకాండకూ ముడి పెడుతూ జనవరి 7న పుణెలో మరొక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి, ఈ కేసును మాత్రం వడివడిగా ముందుకు కదిలించారు. ఈ కేసు చిలవలు పలువలుగా మారి ఎల్గార్ పరిషద్ సభలో పాల్గొన్న ఒకరినీ, ఆ సభతో ఏ సంబంధమూ లేని మరొక నలుగురినీ 2018 జూన్ 6 న అరెస్టు చేశారు. ఈ సభ, సభానంతర హింసాకాండ అనే సాధారణ కేసును మావోయిస్టుల ప్రేరణతో దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల భారీ కేసుగా, ప్రధాని మీద హత్యాప్రయత్నానికి జరిగిన కుట్రకేసుగా కట్టుకథలు సృష్టించి పత్రికల్లో, ఛానళ్లలో మారుమోగించారు. అప్పుడే పోలీసులు సాక్ష్యాధారాలుగా చూపిన ఎలక్ట్రానిక్ ఉత్తరాలు కూట సృష్టి అని, నకిలీవని అనేక మంది పరిశీలకులు, న్యాయకోవిదులు, ఫోరెన్సిక్ నిపుణులు వ్యాసాలు రాశారు. ఇది అబద్ధపు కేసు అని, ఆ ఆరోపణలన్నీ అర్థరహితమని అప్పటి మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌లు మాత్రమే కాదు, అప్పటికి బీజేపీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారం పంచుకుంటుండిన శివసేన కూడ వ్యాఖ్యానించింది.

అయినా ఆ అబద్ధపు కేసు ముందుకు కదిలింది. ఆగస్ట్ 28న దేశవ్యాప్తంగా ఆరు నగరాలలో పది మంది ఇళ్ల మీద దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వెంటనే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని వారిని గృహ నిర్బంధంలో ఉంచమని, వారు ఈలోగా కింది న్యాయస్థానాల్లో ఉపశమనం పొందవచ్చుననీ చెప్పింది. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాక ఆ ఐదుగురిలో ముగ్గురిని అక్టోబర్ 26న, వరవరరావును నవంబర్ 17న అరెస్టు చేసి పుణెలోని యరవాడ జైలులో నిర్బంధించారు. భారత న్యాయవ్యవస్థలో బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ (సాధారణ పరిస్థితుల్లో బెయిల్, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే జైలు) అనే సూత్రం ఉన్నప్పటికీ ఆరు నెలలలోపు చార్జిషీటు దాఖలు చేయనందుకు సాధారణంగా ఇచ్చే బెయిల్ నిరాకరించారు, ఆరోగ్యకారణాల మీద బెయిల్ నిరాకరించారు, చట్టపరమైన కారణాల మీద బెయిల్ నిరాకరించారు. ముగ్గురి విషయంలో హైకోర్టు కూడ బెయిల్ నిరాకరించింది. అసలు తమను విచారిస్తున్న న్యాయస్థానానికి ఆ అధికారమే లేదు గనుక తమను బెయిల్ పై విడుదల చేయాలని నిందితులు వేసిన దరఖాస్తు మీద ఫిబ్రవరి రెండో వారంలో ముంబాయి హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ కేసు తప్పుడు సాక్ష్యాధారాలతో, దుర్బుద్ధితో తయారైందని తేటతెల్లంగా ఉన్నప్పటికీ ఐదుగురు నిందితులు ఇరవై నెలలుగా, ముగ్గురు నిందితులు పదహారు నెలలుగా, వరవరరావు పదిహేను నెలలుగా యరవాడ జైలులో దుర్భరమైన పరిస్థితుల్లో నిర్బంధితులుగా మగ్గిపోతున్నారు.

భారత శిక్షాస్మృతి కింద కొన్ని నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం కింద కొన్ని నేరాలు ఆరోపించిన ఈ కేసులో ఇప్పటికే జరగవలసిన దర్యాప్తు జరిగిపోయింది. మొదట ఐదువేల పేజీలు, అనుబంధంగా పద్దెనిమిది వందల పేజీలు రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. విచారణ ప్రారంభించడానికి అవసరమైన ఆరోపణలు ఖరారు చేసే పని రెండు నెలల కింద జరిగింది. ఈ మధ్యలో కేసు దర్యాప్తు చేస్తున్న పుణె పోలీసు అధికారులు, వాదనలు వినిపిస్తున్న జిల్లా ప్రభుత్వ న్యాయవాది ఎన్నెన్ని అబద్ధాలు ఆడారో, కుట్రలు చేశారో, తప్పుడు ఆరోపణలు వినిపించారో, తమ ఆరోపణల పత్రాలు, ఆధారాలు నిందితుల న్యాయవాదులకు ఇవ్వబోమని ఆటంకాలు కల్పించారో వివరిస్తే ఒక గ్రంథమే అవుతుంది.

ఇప్పుడు అదంతా అయిపోయి కొత్త ఎత్తుగడగా స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో నడిచే ఎన్‌ఐఎ రంగప్రవేశం చేసింది. ఇరవై నెలలుగా సాగుతున్న, నిర్బంధితులు జైలులో ఉన్న ఈ కేసులో ఇప్పుడు కొత్తగా దర్యాప్తు జరపవలసినది ఏముందని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రవేశిస్తున్నది?

ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థలో జరిగిన మార్పులు చూడాలి. ప్రజా మేధావుల మీద పెట్టిన భీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసు మాత్రమే కాక, మహారాష్ట్ర వ్యాప్తంగా 2018 జనవరిలో వందలాది దళిత కార్యకర్తల మీద భీమా కోరేగాం హింసాకాండ కేసులు నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు జరిపిన హింసాకాండ, దానికి దళితులు తెల్పిన నిరసన సందర్భంగా అప్పటి భాజపా ప్రభుత్వం కేవలం దళిత కార్యకర్తల మీద మాత్రమే కేసులు మోపింది. ఈ కేసులన్నీ కుట్రపూరితంగా నమోదైనవని, ఎత్తివేయాలని డిమాండ్ గత రెండు సంవత్సరాలుగా వెల్లువెత్తుతున్నది. అందువల్ల కొత్తగా ఏర్పడిన శివసేన-ఎన్ సిపి – కాంగ్రెస్ ఐక్య సంఘటన మహా వికాస్ అఘాది ప్రభుత్వం ఆ కేసులను ఎత్తివేస్తానని వాగ్దానం చేసి, ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే తామే అబద్ధపు కేసుగా అప్పుడు వ్యాఖ్యానించిన ఎల్గార్ పరిషద్ కేసు ప్రస్తావన కూడ ముందుకు వచ్చింది. ఎన్‌సిపి నాయకుడు శరద్ పవార్ ఈ కేసు ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావిత పోలీసు అధికారుల కూటసృష్టి అని, వారే అబద్ధపు సాక్ష్యాధారాలను తయారుచేసి ప్రజామేధావులను ఈ కేసులో ఇరికించారని, అందువల్ల అసలు ఈ కేసు తయారైన తీరుపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఎస్‌ఐటి) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన నాయకులు కూడ ఈ డిమాండ్‌ను బలపరిచే వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రి ఆ ఇద్దరు పోలీసు అధికారులను ముం బాయికి పిలిపించి, ఈ కేసు గురించి వివరాలు అడిగి తెలుసుకున్న రోజునే ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగిస్తున్నామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువడింది. అంటే సక్రమ విచారణ జరిపితే బైటపడే అక్రమాలేవో ఆ కేసులో ఉన్నాయని స్పష్టమైంది. ఈ బదిలీకి చట్టం ఆమోదించవచ్చు గాని ఇందులో రాజకీయ, న్యాయ. చట్టపరమైన చిక్కులెన్నో ఇమిడి ఉన్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల సమస్య. కేంద్ర ప్రభుత్వం తన చేతిలోని ఎన్‌ఐఎను ఉపయోగించి రాష్ట్రాలలో తనకు నచ్చని వారిమీద ఇటువంటి కేసులు పెట్టి, అరెస్టు చేసి, వేధించవచ్చు. శాంతి భద్రతలు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయనే రాజ్యాంగ స్ఫూర్తికీ, సమాఖ్య భావనకూ విఘాతం కలుగుతుంది.

ప్రత్యేకించి ఈ కేసునే చూస్తే, ఇప్పటికే సోదాలు, జప్తులు, దర్యాప్తు, విచారణ జరిగిపోయి, చార్జిషీట్లు కూడ దాఖలై, నేరారోపణల ఖరారు కూడ అయిపోయిన తర్వాత కొత్తగా మరొక దర్యాప్తు సంస్థ చేయగలిగినదేమిటి? ఇది కేవలం తమకు భిన్నమైన వైఖరి ఉన్న ప్రభుత్వం చేతి నుంచి తన చేతికి నిందితులను మార్చుకుని, మరింత వేధించడానికి కాకపోతే దీని ఔచిత్యమేమిటి? ఇప్పటివరకూ ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా ఉన్న పోలీసు అధికారి, ప్రభుత్వ న్యాయవాది, విచారించిన న్యాయమూర్తి (వాస్తవానికి ఇప్పటికి ముగ్గురు న్యాయమూర్తులు మారారు) అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేసును తన చేతి నుంచి మార్చడం అనుచితమని, దురుద్దేశ పూరితమని అంటున్నప్పుడు ఈ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించాలా, కేంద్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించాలా?

నిజానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగానే కేసు దానంతట అది మారదు. రాష్ట్ర ప్రభుత్వం దానికి ఆమోదించి, తన దగ్గర ఉన్న కాగితాలన్నీ అప్పగించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే పద్ధతి ప్రకారం వ్యవహరించదలచుకున్నట్టు కనబడుతున్నది. జనవరి 24 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఈలోగా ఎల్గార్ పరిషద్ సభా నిర్వాహకుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి కోల్సె పాటిల్‌ ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తానన్నాడు. అధికారంలో ఉన్న మూడు పార్టీలూ దీనిని ఖండించాయి.

ఈ స్థితిలో ఎన్ ఐ ఎ జనవరి 28న ముంబాయిలో కొత్త ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. పాత కేసులో ఉన్న 23 మంది నిందితులలో 11 మంది మీద మాత్రమే కొత్త ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. రెండేళ్ల కిందటి నేరానికి, ఇప్పటికే విచారణ జరిగిన నేరానికి ఇప్పుడు ఎఫ్ ఐ ఆర్ ఏమిటనే ప్రశ్న తలెత్తింది. ఆ ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా కేసు తమకు అప్పగించాలని జనవరి 29న పుణె న్యాయమూర్తి ముందర ఎన్ఐఎ ఒక దరఖాస్తు వేసింది. తానేమి వైఖరి తీసుకోవాలో తన ప్రభుత్వం తనను ఆదేశించలేదని ప్రభుత్వ న్యాయవాది రెండు వాయిదాలు కోరారు. అలా బదిలీ చేసే అధికారం ఈ న్యాయమూర్తికి లేదని నిందితుల తరఫున న్యాయవాదులు వాదించారు.

ఈ చట్టపు చిట్టడవిలో ఎవరు ఏ గమ్యం చేరగలరో తెలియదు గాని, నిందితులకు మాత్రం ప్రతి వాయిదా తమ ఖైదు కాలాన్ని మరింత పెంచే కుట్రగా మాత్రమే మిగులుతుంది. రోజులూ వారాలూ గడుస్తున్నా బెయిల్ రాక, కేసు సంగతి తేలక, అసలు కేసు మీద అధికారం ఎవరిదో తేలక, అన్ని రోజులూ ఈ అమాయకులు చెరసాలలో మగ్గిపోవలసిందే. నిజానికి పాలకులకు కావలసింది అదే. ప్రభుత్వం పట్ల అసమ్మతి తెలిపే, మాట్లాడే, రాసే, తమ భావాలు ప్రకటించే గొంతులు తమ భావప్రకటనా స్వేచ్ఛను కోల్పోయి జైలులో మగ్గిపోవడమే పాలకుల లక్ష్యం. వరవరరావు మీద గత ఏపీ ప్రభుత్వం బనాయించిన 25 కేసుల్లో ఏ ఒక్క దానిలోనూ ఏ ఒక్క నేరమూ రుజువు చేయలేకపోయింది. కాని ఆయన జీవితంలో అతి విలువైన ఏడు సంవత్సరాలు ఆయన జైలు జీవితం అనుభవించి ఆరోగ్యమూ మానసిక ప్రశాంతతా పోగొట్టుకోవలసి వచ్చింది. అంతకాలమూ ఆయన కలమూ గళమూ సమాజానికి వినిపించకుండా చేయడంలో పాలకులు విజయం సాధించారు. ఇప్పుడు ఎన్‌ఐఎ ప్రయత్నపు కుటిలాలోచనా అదే.

Courtesy Andhrajyothi