హైదరాబాద్‌ సిటీ/మెహిదీపట్నం : పోలీసుల ఉరుకులు, పరుగులు, నిరసనకారుల అరెస్టుల మధ్య భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ అలియాస్‌ రావణ్‌ హైదరాబాద్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దళిత, ముస్లిం, ఆదివాసీ ప్రోగ్రెసివ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రేతిబౌలిలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. సభకు చివరి క్షణాల్లో న్యాయస్థానం అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు చంద్రశేఖర్‌ను విమానాశ్రయం వద్దే అడ్డుకునేందుకు యత్నించారు.

అయితే, అది విఫలమై చంద్రశేఖర్‌ నగరంలోకి వచ్చారు. మల్లేపల్లిలోని స్నేహితుడి వద్ద ఉండగా చంద్రశేఖర్‌, ఆయన లాయర్‌ మహమూద్‌ను హబీబ్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించారు. తొలుత వీరిని స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడినుంచి మరో ప్రాంతానికి తరలిస్తుండగా జై భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని బోయిన్‌పల్లి వరకు వెంటాడారు. భీమ్‌ ఆర్మీ తెలంగాణ అధ్యక్షుడు సుజిత్‌ రావణ్‌, ఇద్దరు ప్రతినిధులను గోల్కొండ హోటల్‌లో అరెస్టు చేశారు. మరోవైపు రేతిబౌలిలో సమావేశానికి వస్తున్నవారిని పోలీసులు తిరిగి పంపించేశారు.

Courtesy Andhrajyothi