మయాంక శర్మ
అనువాదం : కొండూరి వీరయ్య

నా పేరులోనే శర్మ ఉంది. అప్పుడప్పుడూ నా నుదుట తిలకం దిద్దుకుంటా. నేను నిఖార్సయిన హిందువుని. నేను యువకుడిగా ఉన్నపుడే విజయదశమికి జరిగే నవరాత్రులలో దుర్గ సప్తసది చదివించేవాడు. అక్షరాలు కూడా నేర్చుకోక ముందు గాయత్రీ మంత్రం బట్టీ పట్టాను. శివ భక్తుడినైన నాకు ఓం నమఃశివాయ అన్న పదం నాలుక మీదే ఉంటుంది. అది శుభ సందర్భం కావచ్చు. అశుభ సందర్బం కావచ్చు. నాకేదన్నా సమస్య ఎదురవ్వచ్చు. అన్ని వేళలా ఓం నమఃశివాయ అన్న పదం పెదాలమీద ఉంటుంది.

నమామి శమిషన్‌ నిర్వాన్‌ రూపం నాకు అమితంగా ఇష్టమైన మంత్రం. నేను బడికెళ్ళటానికి ముందే మా తాత ఈ మంత్రం నేర్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటారా ! నా వ్యాసం చివరికంటా చదివాక నన్ను ఏ అర్బన్‌ నక్సల్‌ అనో టుకడే టుకడే ముఠా సభ్యుడిని అనో ముద్ర వేస్తారు. అలా అపోహ పడొద్దు అని చెప్పటానికే ఈ వివరణ అంతా. నేను నిఖార్సయిన హిందువుని అయి ఉండి కూడా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలనే ప్రయత్నాలను వ్యతిరేకించాలని నిర్ణయించు కున్నాను. ఈ దేశంలో కొందరు దేశాన్ని హిందూ రాష్ట్రగా మార్చాలని కోరుకుంటున్నారు.

వాళ్ళ వాదన ఒక్కటే. 97 కోట్లమంది హిందూ దేవుళ్ళు 33కోట్ల మంది దేవతలకు తమదైన ఓ దేశం ఉండాలన్నది వారి వాదన. అలాంటి 130 కోట్లమందికి తమదైన దేశం లేదని మనం నమ్మాలని కోరుకుంటున్నారు. నేను హిందూ రాష్ట్రను సమర్ధించాలంటే నాకు మూడు ప్రశ్నలకు సమాధానం కావాలి. ఎవరి హిందూ రాష్ట్ర ఇది? బ్రాహ్మణులదా, క్షత్రియులదా, వైశ్యులదా లేక శూద్రులదా?

రుగ్వేదంలోని పురుష సూక్తికి సంబంధించిన ప్రశ్న ఇది. ఆదిమ మానవుడిని బలి ఇచ్చాక తల నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారని చెప్తోంది. ఇంకా ఆదివాసీలు, దళితులు వంటి హిందూ వర్ణ వ్యవస్థ బయట కూడా మనుషులున్నారు.

మరి హిందూరాష్ట్ర నిర్మాణంలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? బ్రాహ్మలకా? క్షత్రియు లకా? వైశ్యులకా? శూద్రులకా? కేవలం వేదవాక్కును అనుసరించాలా? పరమపురుషుని పాదాల నుంచి పుట్టిన సుమారు 70కోట్ల మంది హిందువుల గౌరవాన్ని ఎలా కాపాడుతుంది హిందూ రాష్ట్ర? వర్ణ వ్యవస్థలో భాగం కాని కోట్లాది మందికి హిందూ రాష్ట్ర ఎలాంటి భద్రత కల్పించబోతోంది?
భారత రాజ్యాంగం, ప్రజాతంత్ర రాజకీయాలు ఇలాంటి వారికందరికీ గుర్తింపు గౌరవాన్ని అందించాయి. ఈ పరిస్థితిని తిరగ దోడి హిందూ రాష్ట్ర రాజ్యాంగం తిరస్కరించిన విలువలన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తుందా?
రాబోయే కాలంలో కాబోయే హిందూ రాష్ట్రం గురించి ఇప్పుడే ఉత్సవాలు చేసుకుంటున్న వారంతా ఒక్క నిమిషం ఆగి ఈ విషయాలు ఆలోచించండి.

టుకడే టుకడే గాంగ్‌ని తుపాకీతో కాల్చాలా?
హిందూ రాష్ట్రంలో అసమ్మతి గళాల పట్ల ఎలాంటి వైఖరి చేపట్టబోతోంది అన్నది నా రెండో ప్రశ్న. అటువంటి అసమ్మతి గళాలకు ఇప్పుడు అర్బన్‌ నక్సల్స్‌ అనీ టుకడే టుకడే గ్యాంగ్‌ అనీ కొత్త పేర్లు పెట్టారు. నేను నిఖార్సయిన హిందూవుని అయినప్పటికీ నేను నా ముందు తరాలు నా తర్వాతి తరాల విద్యార్థులతో సహా సమకాలీన నిరసన గళాలు కారల్‌ మార్క్స్‌ వర్గ పోరాటంతో పాటు మహాత్మా గాంధీ, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, రచనలతో ఉదారవాద విలువలతో అంతో ఇంతో పరిచయం ఉన్న వాళ్లమే. అలనాటి సోవియట్‌ యూనియన్‌ భారతదేశానికి అత్యంత సన్నిహిత మిత్ర దేశం కావటంతో కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, మాగ్జిమ్‌ గోర్కీ, ఱఅషవ ్‌ష్ట్రవ వతీర్‌షష్ట్రఱశ్రీవ ఖూూ= ఫైడోర్‌ దొస్టోవిస్కి వంటి గొప్ప గొప్ప దార్శనికుల రచనలన్నీ మాకు అందుబాటులోకి వచ్చాయి. అప్పటికి భారతదేశంలో ప్రేమ్‌చంద్‌, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రు, అంబేద్కర్‌, లోహియా, జయప్రకాష్‌ నారాయణ్‌ రచనలతో పాటు ఈ రచనలు మాత్రమే మేము కొనుక్కోగల స్థాయిలో ఉండేవి. అవే కొనుక్కుని చదువుకునే వాళ్ళం. ఈ రచనలన్నీ మాకు ప్రశ్నించటం నేర్పేవి. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం నేర్పేవి. మాకు అత్యంత ప్రియమైన ఉపాధ్యాయులు కూడా గొల్వల్కర్‌ సావర్కర్‌ రచనలు చదవమని చెప్పలేదు. అప్పట్లోనే ఆరెస్సెస్‌కు గట్టి నమ్మకమైన కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు కూడా మా తరం పిల్లలకు సావర్కర్‌ గోల్వాల్కర్‌ రచనలు చదవమని చెప్పలేదు. అటువంటి రచనలు చదివి భిన్నమైన ప్రపంచ దృక్పథం కలిగిన వారికి హిందూ రాష్ట్రలో ఉండబోయే స్థానం ఏంటి? ఊచకోతా లేక ఓటు హక్కు రద్దు చేస్తారా? లేక నిర్బంధ శిబిరాలకు పరిమితం చేస్తారా?

ప్రియమైన భక్తులారా, ప్రభుత్వ విద్యాలయాల్లో నిర్దిష్ట పాఠ్య ప్రణాళికలో శిక్షణతో పాటు ప్రశ్నించటాన్ని కూడా నేర్చుకున్న ఈ విశాల జనసామాన్యాన్ని ఏమి చేయబోతున్నారో వివరించండి. ఈ ప్రశ్నించే తత్వం కేవలం జవహర్‌లాల్‌ నెహ్రు విశ్వవిద్యాలయానికే పరిమితమైనది కాదు అన్న విషయాన్ని కాస్త అర్ధం చేసుకోమని కోరుతున్నాను. దాని పరిధి చాలా విస్తారమైనది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏదో ఒక విషయంపై భిన్నాభిప్రాయాలు లేని ప్రదేశం ఒక్కటీ కూడా లేదంటే నమ్మండి.

ముస్లింలకు ప్రాథమిక హక్కులు రద్దు చేస్తారా ?
ఇక నా చివరి ప్రశ్న. హిందూ రాష్ట్రంలో 18 కోట్లమంది ముస్లిముల పరిస్థితి ఏమి కానుంది? ఊచకోత కొస్తారా? ఓటు హక్కు రద్దు చేస్తారా? వారికున్న ప్రాధమిక హక్కులు రద్దు చేస్తారా? లేక పాకిస్థాన్‌కో ఈ దేశంలోనే నిర్బంధ శిబిరాలకు తరలిస్తారా? అటువంటి చర్యల కారణంగా అయ్యే ఆర్థిక భారం గురించి కానీ మానవీయ భారం గురించి పక్కన పెడితే అసలు ఇవేవైనా పరిష్కారాలేనా? ఒకే ఒక్క మార్గం ఉంది. వాళ్లంతా మనవాళ్లే అని నమ్మకం కలిగించటం ఒక్కటే ఈ ప్రశ్నలకు పరిష్కారం. ప్రపంచమంతా చిన్న చిన్న దేశాల్లో మతం పేరుతో మారణకాండ జరుగుతూనే ఉంటుంది. కానీ భారతదేశమంత విశాలమైన దేశాల్లో ఇది కనీసం ఊహించను కూడా ఊహించలేం. కానీ ఈ రోజు ఇటువంటి ఘోరం గురించి కూడా బాహాటంగా మాట్లాడుకోవటం కనపడుతోంది.

నేను అడిగిన ఈ ప్రశ్నల్లో దేనికీ హిందూ రాష్ట్ర గురించి గుండెలు బాదుకునేవాళ్లెవ్వరూ సమాధానం చెప్పలేరని నాకు తెలుసు. అటువంటప్పుడు మనకున్న దాంతో – లౌకిక గణతంత్ర రాజ్యాంగంతో – సరిపెట్టుకుంటే చాలదా? అదేదో సరిపెట్టుకునేందుకు ఉన్న ప్రత్యామ్నాయం కానేకాదు. మనకున్నది అదొక్కటే మార్గం. మరి అటువంటప్పుడు మనకున్నదాన్ని పక్కనపడేసి సాధ్యం కానిదాని గురించి గందరగోళపడి దేశాన్ని గందరగోళ పెట్టడం దేనికి? స్వాతంత్య్రం వచ్చాక దేశం చాలా పురోగతి సాధించింది. ఈ పురోగతిని వెనక్కు తిప్పాలంటే అనూహ్యమైన నష్టాలు కష్టాలను భరించాల్సి ఉంటుంది.

అందువల్ల గౌరవనీయులైన భక్తులారా, ఓ వాస్తవాన్ని అంగీకరిద్దాం. హిందూ రాష్ట్ర నినాదం కేవలం బాధ్యత లేని అధికారాన్ని సంపాదించు కునే సాధనమే. వైవిధ్యం ఒక్కటే ఇక్కడి వాస్తవం. మిగిలిందంతా మిధ్యే.అలా కాకపోయి ఉంటే దేశంలోని వైవిధ్యానికి పాతరేసిన పాకిస్థాన్‌ కూడా అత్యంత ప్రశాంతమైన దేశంగా ఉండేది.

(Courtesy Nava Telangana)