పంతొమ్మిదో శతాబ్దంలో ఇంగ్లీషు విద్య ద్వారా మొదలైన సంఘ సంస్కరణ అనేదాన్ని ఒక్కో వర్గం తమదైన దృక్పధంతో నిర్వచించుకుందని చెప్పాలి. అప్పట్లో దేశవ్యాప్తంగా ముందుకు వస్తున్న ‘ఆది’ ఉద్యమాన్ని తెలుగు నాట ప్రారంభించించి హైందవ సమాజం చేత జంతువుల కంటే హీనంగా పరిగణించబడే మాల మాదిగలే ‘ఆది ఆంధ్రులు’ అని ఒక ఆత్మగౌరవ ప్రకటన చేశాడు.

భాగ్యరెడ్డి ఆనాటి సమాజంలో దళితుల మౌలిక సమస్యలైన అంటరానితనం, అవిద్య, వారికి కనీసపు మానవ హక్కులు లేకపోవడం, అంతర్గతంగా వారి వెనుకబాటుతనానికి చిహ్నాలుగా మద్యపానం, మూడాచారాలు, జంతుబలులు, స్త్రీల పరంగా జోగిని వ్యవస్థలపై తన పోరాటాన్ని ప్రారంభించి సుమారు నలభై సంవత్సరాల పాటు అలుపెరుగని యుద్ధం చేశాడు.

దళితులు యీ దేశపు మూలవాసులని(Sons of the soil), బ్రాహ్మణ వాద సాహిత్యాన్ని దళిత కోణం నుంచి భాగ్యరెడ్డి విశ్లేషించాడు. ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా బ్రాహ్మణ బనియాల నాయకత్వంలో జాతీయోద్యమం జరుగుతుంటే దేశ వ్యాప్తంగా దళితులు ఆత్మగౌరవ వుద్యమాన్ని ప్రారంభించి మాకు తెల్ల దొరలకంటే యిక్కడి పెత్తందారులైన నల్లదొరల నుంచి స్వతంత్ర్యం కావాలని ‘స్వరాజ్యం, ‘స్వతంత్ర్యం’ అనే విషయాలలో తమ ఆకాంక్షలను వ్యక్తం చేశారు.

దళితుల పరంగా ఒక ఉద్యమ సంస్థ కూడా లేని ఆ చీకటి రోజుల్లో ఆయన వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి దళితులను సంఘటిత శక్తిగా చేశాడు… అంతేగాదు భాగ్యరెడ్డి ఏకంగా ఈ దేశం దళితులదని గుండెలమీద చెయ్యేసుకుని దేశం నడిబొడ్డున నిలబడి ఆత్మగౌరవ పొలికేక పెట్టి జాతిని మేల్కొలిపిన దళిత వైతాళికుడు.

చల్లపల్లి స్వరూపరాణి