ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆదివారం రాత్రి రక్తసిక్తమయ్యింది. పోలీసు బలగాల పహారాలో, వీధి దీపాలు ఆర్పేసి, ఇంటర్నెట్‌ సేవలు నిలిపేసి, మారణాయుధాలు చేబూని, ముసుగులు ధరించిన ఓ పిశాచాల గుంపు.. రెండున్నరగంటలపాటు సాగించిన ఈ పైశాచికత్వం చూస్తుంటే అంతా ఓ పథకం ప్రకారమే జరిగిందా? అని అనిపించక మానదు! దశాబ్దాల చరిత్రలో భావ సంఘర్షణే తప్ప భౌతిక ఘర్షణలు ఎరుగని ఈ చదువుల క్షేత్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. ఆది నుంచీ అది ప్రగతిశీల భావాల కేంద్రం. లౌకిక, ప్రజాతంత్ర విలువల కేతనం. ఈ దేశాభ్యుదయానికి గొప్ప ప్రేరణగా నిలుస్తున్న మేధో సౌధం. ఆ కారణం చేతనే ఒక పురోగామి సంస్థగా విరాజిల్లుతున్న ఈ వెలుగుల ప్రాంగణం.. ఇప్పుడు ఆ కారణం చేతనే చీకటి కుట్రలకు నెత్తురోడుతోందా? తమ తెరచాటు పన్నాగాలకు అక్కడ ఎదురవుతున్న ప్రతిఘటనకు ఆ చీకటి శక్తులు భయపడుతున్నాయా? అవును.. ఆదివారం నాటి ఈ బీభత్సకాండ ఈ భయాన్నే ప్రతిబింబిస్తోంది.

ఆదివారం ఉదయం నుంచే క్యాంపస్‌లోకి గుర్తుతెలియని ఆగంతకుల ప్రవేశం మొదలైంది. అనుమానించిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోగా.. రాత్రి 6.30గంటల ప్రాంతంలో హఠాత్తుగా యాభైమందికి పైగా ఉన్న ముసుగుమూక ఇనుపచువ్వలూ కర్రలూ కత్తులతో క్యాంపస్‌ వీధుల్లో కవాతు ప్రారంభించింది. 7గంటలకల్లా హాస్టల్‌ గదుల్లో చొరబడి దొరికినవారిని దొరికినట్టుగా విచక్షణారహితంగా చితకబాదడం మొదలుపెట్టింది. విద్యార్థులేగాక అధ్యాపకులూ లక్ష్యంగా ఈ దమనకాండ సాగినంతసేపూ యూనివర్సిటీలో స్ట్రీట్‌లైట్లు ఆగిపోవడం, ఇంటర్నెట్‌ నిలిచిపోవడం ఓ విచిత్రం! ఆ చీకటి విధ్వంసంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించడాన్ని సైతం సదరు మూక అడ్డుకోవటం గమనార్హం. అంబులెన్సు వాహనాల టైర్లలో గాలి తీసి, అద్దాలు బద్దలు కొట్టి నానా బీభత్సం సృష్టిస్తున్నా స్పందించే నాథుడే లేడు. చివరికి 10.30గంటల తరువాత ఆ మూక యూనివర్సిటీ అవతలివైపు గేటు నుంచి సురక్షితంగా నిష్క్రమించాక గానీ వీధిదీపాలు వెలుగలేదు, పోలీసులు అక్కడికి చేరుకోలేదు!

ఆ చీకటి తెల్లవారిన తరువాత ఈ దురాగతానికి నివ్వెరపోవడం దేశం వంతయింది. ఈ అమానవీయ, అప్రజాస్వామిక దుర్మార్గానికి కారకులెవరంటే.. అన్నివేళ్లూ అధికారపార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ వైపు, దాని వెనకున్న సంఫ్‌ుపరివారం వైపే చూపిస్తుండటం సత్యదూరమేమీ కాదు. జరగాల్సిందంతా జరిగిపోయాక ఏమీ తెలియనట్టు ఏలినవారు విచారం వ్యక్తం చేయడం మరీ విడ్డూరంగా ఉంది! కానీ.. నిజమేమిటో తెలుసుకోవడానికి పెద్ద విచారణలూ పరిశోధనలేమీ అవసరం లేదు. పగిలిన తలలెవరివో, విరిగిన చేతులెవరివో చూస్తే చాలు.. అసలు విషయం తెలిసిపోతుంది. క్షతగాత్రులంతా వామపక్ష విద్యార్థులూ, మేధావులే కావడం నిజాన్ని నిగ్గుతేలుస్తుంది. ఘటన జరిగిన సమయంలో యూనివర్శిటీ యాజమాన్యం, పోలీసులు వ్యవహరించిన తీరు దాన్ని మరింత తేటతెల్లం చేస్తోంది. ఈ ఘటనపై పలు వార్తా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ వెల్లడిస్తున్న వీడియోలు చూస్తే పరిస్థితి మరింత విశదమవుతుంది. దాడికి గురవుతున్న విద్యార్థులు ”ఏబీవీపీ గో బ్యాక్‌” అని నినదించడం.. దాడి చేస్తున్న మూకలు ”మార్క్స్‌వాద్‌ డౌన్‌ డౌన్‌”, ”జాతీయవాద్‌ జిందాబాద్‌”, ”పోలీస్‌ జిందాబాద్‌” అని నినదించడం వాస్తవానికి అద్దం పడుతోంది. క్యాంపస్‌లోకి ఆ అరాచక మూకలను నివారించలేని పోలీసులు… దాడి విషయం తెలిసి అక్కడికి చేరుకున్న వామపక్ష నేతలను మాత్రం అడ్డుకోవడం ఘటన వెనకున్న శక్తులేమిటో స్పష్టం చేస్తోంది.

మొదటి నుంచీ వామపక్ష భావజాలానికీ, ప్రగతిశీల మేధో వికాసానికీ ఆలవాలంగా ఉంటున్న ‘జేఎన్‌యూ’ సంఫ్‌ుపరివార్‌ శక్తులకు మింగుడుపడని సమస్యగానే ఉందన్నది జగద్విదితం. ఇటీవలి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ లాంటి వివాదాస్పద చట్టాలకు పౌరసమాజంలో ఊహించనిరీతిలో నిరసన పెల్లుబుకడం, ప్రత్యేకించి విద్యార్థి, యువజనం పెద్దయెత్తున ఉద్యమించడం వెనుక కూడా ‘జేఎన్‌యూ’ ఓ ప్రేరణాశక్తిగా ఉందన్న ఇంటలిజెన్స్‌ వర్గాల అంచనాతో.. ప్రభుత్వం కూడా గుర్రుగా ఉందన్న మాటా జగద్వితమే. ఈ నేపథ్యం నుంచి చూస్తే తప్ప ఈ దాడి వెనుకున్న చీకటి కోణం అర్థం కాదు. ఇప్పటికే 70రోజులకు పైగా పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తుండటంతో అక్కడ పెద్దయెత్తున పోలీసు నిఘా ఏర్పాటు చేసారు. దేశమంతా రగులుతున్న పౌరసత్వ నిరసన జ్వాలల పేరుతో ఆ నిఘాను మరింత రెట్టింపు చేసారు. మరి ఇంతటి రాక్షసకాండ జరుగుతుంటే ఆ నిఘా ఏమైనట్టు? అంతటి నిఘా కండ్లుగప్పి ఈ ముసుగుమూకలు ఆ ప్రాంగణంలోకి ఎలా చొరబడ్డట్టు? ఆ రోజు ఉదయం నుంచే గుర్తుతెలియని వ్యక్తుల కదలికలను పసిగట్టిన విద్యార్థుల ఫిర్యాదును అధికారులు ఎందుకు పట్టించుకోనట్టు? సరిగ్గా ఆ సమయంలోనే క్యాంపస్‌లోని స్ట్రీట్‌లైట్లన్నీ ఎందుకు వెలగడం మానేసినట్టు? ఇంటర్నెట్‌ ఎందుకు నిలిచిపోయినట్టు? సరిగ్గా ఆలోచిస్తే ఈ సమాధానంలేని ప్రశ్నలే జరిగిందేమిటో తేల్చిచెబుతుంటే.. ముసుగుల వెనుక నిజాలను ఎలా దాచగలరు?