గతంలో జీహెచ్‌ఎంసీతో పాటు ప్రధాన నగరాల్లోని యాచకులు జైళ్లకు
రెండేండ్లుగా అక్కడే మకాం
పోషణకు రూ.5 కోట్లు ఖర్చు
సర్కారు డబ్బులివ్వకపోవటంతో తాజాగా బయటకు
బి.వి.యన్‌.పద్మరాజు

మనది ధనిక రాష్ట్రం.. మిగులు రాష్ట్రమంటూ ఇన్నాళ్లూ గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. ఆఖరుకు బిచ్చగాళ్లను సైతం పోషించలేక చేతులెత్తేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. అదేంటి.. యాచకులను ప్రభుత్వం సాకటమేంటి..? ఆ తర్వాత పోషించలేమంటూ వదిలేయటమేంటి..? అనుకుంటున్నారా…? ఇక్కడే అసలు గమ్మత్తు దాగుంది. వివరాల్లోకెళితే… హైదరాబాద్‌ మహానగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన జంక్షన్లు, కూడళ్లు, సిగల్‌ పాయింట్ల వద్ద నిత్యం అనేక మంది యాచకులు భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. వీరిలో నాలుగైదేండ్ల పసివాళ్ల దగ్గర్నుంచి డెబ్బై ఏండ్ల ముసలోళ్ల వరకూ ఉండటాన్ని మనం గమనిస్తుంటాం. హైదరాబాద్‌లోని పలు కూడళ్ల వద్ద చంటి బిడ్డలను భుజాన వేసుకున్న మహిళలు ధర్మం చేయండంటూ వాహనదారులను వేడుకునే సందర్భాలు అనేకం.

వీరిలో అత్యధిక మందిని కొన్ని మాఫియా ముఠాలు వెనకుండి నడిపిస్తున్నాయనీ, అడుక్కోవటం ద్వారా వచ్చే డబ్బుల్లోంచి వారికి రోజుకూలీ ఇచ్చి.. మిగతా సొమ్మును ‘దందాల’ బ్యాచ్‌ నొక్కేస్తుందంటూ గతంలో అనేకసార్లు వార్తలొచ్చాయి. పోలీస్‌ అధికారులు కూడా వీటిని ధృవీకరించిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ముఠాల బారి నుంచి యాచకులను కాపాడాలనుకున్నదో లేక నిజంగా వారి జీవితాలను బాగు చేద్దామనుకున్నదో తెలియదు గానీ తెలంగాణ ప్రభుత్వం..

ఓ రెండేండ్ల క్రితం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎమ్‌సీతోపాటు ఇతర నగర పాలక సంస్థల్లోని యాచకులందర్నీ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ జైళ్లకు తరలించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చంచల్‌గూడ, చర్లపల్లి కారాగారాలకు వారిని పోలీసులు స్వయంగా తీసుకుని వెళ్లారు. తరలింపు సందర్భంగా యాచకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ నయానో భయానో నచ్చజెప్పి వారిని వ్యాన్లలోకి ఎక్కించారు.

ఆ క్రమంలో ఎంతకాలమైనా ప్రభుత్వమే వారిని పోషిస్తుందనీ, పోలీస్‌, జైళ్లశాఖ కలిసి వారి ఆలనా పాలనా చూసుకుంటాయని సర్కారు హామీనిచ్చింది. యాచకులకు తిండి, బట్టలు, మందులు, ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎమ్‌సీ ప్రతియేటా నిధులు విడుదల చేస్తాయని తెలిపింది. ఆ హామీ మేరకు చంచల్‌గూడ (పురుష యాచకులు) చర్లపల్లి (మహిళా యాచకులు) జైలు అధికారులు బిచ్చగాళ్ల పోషణ, సంరక్షణ బాధ్యతలను స్వీకరించారు. ఇది జరిగి రెండేండ్లయింది.
ఈ కాలంలో చంచల్‌గూడలో ఉంచిన దాదాపు వెయ్యి మంది యాచకుల పోషణార్థం అక్కడి అధికారులు రూ.3 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇందుకోసం జైలు అభివృద్ధి నిధుల(జైల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌)ను వెచ్చించారు. చర్లపల్లిలో మరో రూ.2 కోట్ల దాకా ఖర్చయ్యాయి. కానీ సంబంధిత సొమ్మును ఇటు జీహెచ్‌ఎమ్‌సీగానీ, అటు ప్రభుత్వంగానీ తిరిగి జైలు అధికారులకు ఇవ్వలేదు.

దీంతో రాన్రాను యాచకులను పోషించటం వారికి కష్టంగా మారింది. తమ దగ్గరున్న నిధులు అయిపోగా.. సర్కారు నుంచి ఒక్కపైసా రాకపోవటంతో వారు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. కొద్దికాలంపాటు ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూసి.. ఆ తర్వాత చేసేదేమీ లేక యాచకులను యధావిధిగా బయటకు వదిలేశారు. ఇలా వదిలివేయబడ్డ వారిలో కొంతమందిని బంధువులు, తెలిసిన వారు తీసుకెళ్లగా, మరికొంత మందిని పలు స్వచ్ఛంద సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. కానీ అత్యధిక మంది బెగ్గర్స్‌ మాత్రం గతంలో మాదిరిగా ప్రధాన సిగల్స్‌, జంక్షన్ల వద్దకు చేరిపోయారు.

Courtesy Nava Telangana