– లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీజేపీ విధానాలపై కేసీఆర్‌ ఫైర్‌
– ఇప్పుడు అవే పాలసీలకు రంగం సిద్ధం
– ఆర్టీసీ ప్రయివేటీకరణే ప్రత్యక్ష ఉదాహరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతేడాది అసెంబ్లీకి నిర్వహించిన ముందస్తు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలు అనుసరించిన, అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలోని అన్ని రంగాలూ దివాలా తీశాయని ఆయన ఆ సందర్భంగా ప్రస్తావించారు. ఈ యేడాది ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన అవే అంశాలను పునరుద్ఘాటించారు. వీటికి ప్రత్యామ్నాయ విధానాలను రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్‌ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మాజీ సీఎంలను, వివిధ పార్టీల నేతలనూ కలిశారు. కాంగ్రెస్‌, బీజేపీ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలపై చర్చించామని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇదే అంశం చర్చకొస్తున్నది. ముఖ్యమంత్రి చెప్పిన ఆ ఫెడరల్‌ స్ఫూర్తి ఎటు పోయిందంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను తీసుకొచ్చింది కాంగ్రెస్‌. వాటి కొనసాగింపుగా ప్రయివేటీకరణ అనేది అన్ని రంగాల్లో జరగాలన్నది ఆ పార్టీ పాలసీ. అందుకనుగుణంగా ప్రభుత్వ రంగాలను ఒక్కొక్కటిగా ప్రయివేటీకరిస్తూ వచ్చింది కాంగ్రెస్‌. వాటిని ఇప్పుడు మరింత వేగంగా అమలు చేస్తున్నది బీజేపీ. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకూ భిన్నమైన విధానాలను అవలంభిస్తామనీ, అందుకో సమే ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామనీ కేసీఆర్‌ గతంలో చెప్పారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు అవే పార్టీ విధానాలను అమల్జేసేందుకు ఆయన ఉవ్విళూరుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ ప్రయివేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చారనేది విదితమవుతున్నది.
ఇదే సమయంలో ఆర్టీసీ ప్రయివేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మోటార్‌ వాహన చట్టం సవరణ బిల్లును ఆయన సాకుగా చూపుతున్నారు. కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది కాబట్టే.. తాను ప్రయివేటీకరణ గురించి మాట్లాడుతున్నానంటూ ఆయన సమర్థించుకుంటు న్నారు. కానీ ఇదే టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. కేంద్రం రూపొందించిన పలు కార్యక్రమాలను అమలు చేయబోమని చెప్పింది. తెలంగాణ ప్రజలకు నష్టదాయకమైన కేంద్ర ప్రథకాలను ఇక్కడ అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేసీఆర్‌ శాసనసభలో స్పష్టం చేశారు. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భవ కంటే తాము అమల్జేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం వల్లనే ఎక్కువ మందికి లబ్ది కలుగుతుందని సీఎం అసెంబ్లీలో చెప్పారు. దీంతోపాటు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, హెల్మెట్లు ధరించకపోతే వాహనదారులకు విధించే జరిమానాలపై కూడా ఆయన కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించారు. వీటిని రాష్ట్రంలో అమలు చేయబోమంటూ తేల్చిచెప్పారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో ఏకంగా తీర్మానం చేసిన సంగతి విదితమే. ఇలా కేంద్రం చేసిన అనేక నిర్ణయాలను నిర్వందంగా తిరస్కరించిన కేసీఆర్‌.. ఆర్టీసీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అంటే తనకు నచ్చితే, ఇష్టమైతే అది ప్రజలకు, రాష్ట్రానికి నష్టమైనా ఫరవాలేదు.. కానీ అమలు చేయాల్సిందే అనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో కేంద్రం, దాని చట్టాలు అంటూ చెప్పుకోవటం సీఎంకు పరిపాటిగా మారిందని పలువురు మేధావులు విమర్శిస్తున్నారు. ఇది ఆయన చెప్పిన ఫెడరల్‌ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Courtesy Navatelangana…