సీఏఏ బూచిచూపి ఒక్కొక్కరి నుంచి రూ. 8-10 వేలు దండుకుంటున్న మధ్యవర్తులు
పాతబస్తీలో సగటున సుమారు రెండింతలు
బల్దియాకు వెల్లువలా  జనన ధ్రువీకరణ దరఖాస్తులు
1947కు ముందు పుట్టినవారూ ముందుకొస్తున్న వైచిత్రి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ప్రభావం హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)పై పడింది. పలు ప్రాంతాలకు చెందిన పౌరులు జనన ధ్రువపత్రాలు పొందేందుకు బల్దియా సర్కిల్‌ కార్యాలయాల వద్ద ఎగబడుతున్నారు. చార్మినార్‌ జోన్‌లోని అయిదు సర్కిళ్ల పరిస్థితి అందుకు అద్దం పడుతోంది. జోన్‌ మొత్తంగా చూస్తే గతేడాది నవంబరులో సగటున రోజుకు 180 దరఖాస్తులు వస్తే, 2020 జనవరిలో రోజుకు సుమారు 400 దరఖాస్తులు వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వాతంత్య్రం రాకముందు పుట్టినవారూ దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని తిరస్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇదే అదనుగా దళారులు.. అలాంటి వారి వద్ద రూ.8వేల నుంచి రూ.10వేల వంతున గుంజుతూ నకిలీ పత్రాలతో సర్టిఫికెట్లు ఇప్పిస్తుండటం గమనార్హం.

నకిలీ పత్రాలతో దళారుల హవా
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిళ్లు ఉన్నాయి. సీఏఏ నేపథ్యంలో చార్మినార్‌ జోన్‌ పరిధిలోని మలక్‌పేట, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్‌ సర్కిళ్ల నుంచి గతంతో పోలిస్తే దరఖాస్తులు రెట్టింపు సంఖ్యలో వస్తున్నాయని రిజిస్ట్రారు కేవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. 15 ఏళ్లకు మించి పాత తేదీల్లో జన్మించినట్లు వస్తున్న దరఖాస్తులను సంబంధిత పోలీస్‌ స్టేషన్లకు పంపి, విచారణ కోరుతున్నామని స్పష్టం చేశారు. జోన్‌ ఉన్నతాధికారిని వివరణ కోరగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సర్కిళ్లు సర్దార్‌మహల్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముందు భాగమంతా దళారులు, ఏజెంట్లతో నిండి ఉంటుంది. ప్రాంగణంలోని పౌరసేవ కేంద్రాలు, ఇతర విభాగాల్లోనూ వాళ్లదే హవా. అవసరం ఉన్నా, లేకున్నా ధ్రువపత్రాలు తీసుకోవాలని ప్రజలతో దరఖాస్తులు చేయిస్తున్నారు. ఫలితంగా రద్దీ పెరుగుతోంది’ అని వివరించారు. జోన్‌ కార్యాలయాన్ని పరిశీలించిన ‘ఈనాడు’కు అక్కడ  చిన్నారులకు ఒకలా, పెద్దలకు మరోలా నకిలీ పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేయించటం కనిపించింది.

నిబంధనలకు నీళ్లు.. ఆస్పత్రులతో కుమ్మక్కు
చిన్నారులకు జనన ధ్రువపత్రాల జారీలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం బల్దియాతో అనుబంధమున్న ప్రతి ప్రసూతి ఆస్పత్రి.. పుట్టిన శిశువు వివరాలను సంబంధిత వార్డు కార్యాలయానికి చేరవేస్తుంది. తల్లిదండ్రులు వార్డు అధికారిని సంప్రదించి జనన ధ్రువపత్రం తీసుకుంటారు. ధ్రువపత్రం వివరాలను బల్దియా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంది. అయితే, పలు డివిజన్ల అధికారులు ఆస్పత్రుల నుంచి ఖాళీ నమోదు పత్రాలు తీసుకొని దందాకు తెరలేపారు. ఆస్పత్రుల్లో కాకుండా, ఇతర ప్రాంతాల్లో జన్మించిన శిశువుల పేర్లను అందులో నమోదు చేసి తంతు నడిపిస్తున్నారు.

Courtesy Eenadu