బిసి శిఖండి మోడీ

యుద్ధరంగంలో ప్రత్యర్థి భీష్ముడిని అస్త్రసన్యాసం చేయించి  నిస్సహాయస్థితిలో పడవేయడానికి అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ తన బీసీ కుల అస్తిత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను (దోపిడీ దొంగలను) కాపాడే  కాపలాదారు (చౌకీదారు) పాత్ర వహించిన మోడీ కూడా  నేరస్తుడే. కాపలాదారే ఇంటికి కన్నం వేసినట్టు, కంచేచేను మేసినట్లు నరేంద్ర మోడీ  (చౌకిదార్ చోర్) దొంగలకే దొంగ అని రాహుల్ గాంధీ చేసిన విమర్శ కి సూటిగా సమాధానం చెప్పుకోలేక మోడీ బిసి అస్తిత్వాన్ని అడ్డంపెట్టుకుంటున్నాడు. రాహుల్ గాంధీ మోడీ కులస్తులందరినీ కించపరుస్తున్నాడని బీసీ కుల సెంటిమెంట్ ని రెచ్చ గొడుతున్నాడు. మోడీ లలో దొంగ మోడీలు వేరయా అన్నట్లు మోడీ కులస్తులందరూ దోపిడి దొంగలు కాదు. అసలు మోడీ కులస్తులు బీసీలే కాదు. మన తెలుగు రాష్ట్రాల్లో గానుగ తిప్పి నూనె తీసే గాండ్ల కులస్తులనే గుజరాత్ లో తేలి కులస్తులు అంటారు.  నూనె (తేల్) తీసేవారిని కాకుండా,  నూనె వ్యాపారం చేసే తేలి ఉప కులస్తులనే మోడీలంటారు.  వారు  వాణిధ్య కులంగా అభివృద్ధి చెందిన అగ్రకులాల వారే తప్ప బిసిలు కారు. ఇప్పటివరకు ఆ కులం బిసి జాబితాలో లేదు. ఇటీవల నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అక్రమంగా తన కులాన్ని బిసి జాబితాలో చేర్పించి అక్రమానికి పాల్పడ్డాడు. మోడీ కి 55 ఏళ్ళు వయస్సు వచ్చేదాకా బిసి కానివాడు ఇప్పుడు అకస్మాత్తుగా బిసి అయిపోతాడా? మోడీ నిజమైన బిసి అయితే (PMO) ప్రధానమంత్రి ఆఫీసులో ఒక్క బిసి అధికారి కూడా ఎందుకులేడు? అగ్రకులాల బంటుగా, ఏజెంటుగా ఊడిగం చేస్తున్న మోడీ బిసి అని చెప్పుకోవటం బిసిలకే అవమానం తప్ప గర్వకారణం కాదు. బిసి అస్తిత్వాన్ని అడ్డంపెట్టుకొని తన తప్పులని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న ఈ తప్పుడు బిసిని తలకెత్తుకోడానికి బిసిలెవ్వరూ సిద్దంగా లేరు. అంతేకాదు 70 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన అనేక అగ్రకుల ప్రధానులెవ్వరూ ఓబీసీలకు ద్రోహం తలపెట్టడానికి సాహసించలేకపోయినా ప్రధాని మోడీ అందుకు తలపడ్డాడంటే  బిసి అని చెప్పుకోవటానికి అతడు అర్హుడు కాడు.  ఇటీవల హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రకులస్థులు అసహనంతో బిజెపికి ఓటు వేయలేదని తెలుసుకున్న ప్రధాని మోడీ ఆగమేఘాలమీద 48 గంటల్లో పార్లమెంట్ లో అగ్రకుల పేదలకు ఈబిసి పేరిట పది శాతం రిజర్వేషన్లు కల్పించడమే అందుకు నిదర్శనం. జాట్లు, పటేళ్ళు, మరాఠీలు, కాపులు తదితర వ్యవసాయ అగ్రకులాల వారు బిసిలు కాదని, ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పుచెప్పినా పట్టించుకోకుండా రాజ్యాంగ సవరణతో అధికార దుర్వినియోగానికి పాల్పడి అగ్రకులాలకి ఊడిగం చేయటం బిసిలకు ద్రోహం చెయ్యటమే. నిజమైన ఓబీసీలకు జరిగిన గత వర్తమాన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే చిత్తశుద్ది లేని, దమ్ము దైర్యం లేని ప్రధాని నరేంద్రమోడీ బిసి అస్తిత్వాన్ని శిఖండి లాగా అడ్డుపెట్టుకోవటం సిగ్గుచేటు.