వూహాన్‌లో కరోనా గుర్తింపులో షి-జెంగ్లీ పాత్ర

బీజింగ్‌, మార్చి: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ జాతిని చైనా గబ్బిలం మహిళ (బ్యాట్‌ విమెన్‌)గా సుపరిచితురాలైన షి-జెంగ్లీ 2004లోనే కనుగొన్నారు. గత ఏడాది డిసెంబరులో వూహాన్‌ నగరంలో కరోనా వ్యాపించడంతో.. చైనా ప్రభుత్వం ముందుగా సలహా తీసుకుంది ఆమె నుంచే. ఆమె సూచనలతోనే చైనాలో వన్యప్రాణుల మాంస భక్షణపై నిషేధం విధించారు. ఆమె ఏళ్ల తరబడి గబ్బిలాల గుహల్లో ‘కరోనా’ జాతి వైర్‌సలపై పరిశోధనలు చేశారు. ఆమె పరిశోధన పత్రాలు దిగ్గజ సైన్స్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా.

హుటాహుటిన వూహాన్‌కు
ఆ రోజు డిసెంబరు 30, 2019. వూహాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన షీ-జెంగ్లీ షాంఘైలో జరుగుతున్న ఓ సదస్సులో గబ్బిలాల నుంచి వచ్చే సార్స్‌ వంటి వైర్‌సల గురించి కీలకోపన్యాసం చేస్తోంది. అంతలో ఆమెకు వూహాన్‌లోని ఉన్నతాధికారి నుంచి ఫోన్‌  వచ్చింది. వెంటనే ఆమె రైలులో వూహాన్‌కు బయలుదేరింది. అక్కడికి వెళ్లాక.. ఆస్పత్రిలో వింత జ్వరం, అసాధారణ నిమోనియా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించింది. వారి నమూనాలను సేకరించి పరిశీలించింది. అంతే..! ఆమె అనుమానం నిజమైంది. అది కరోనా వైరస్‌. అప్పుడే ఆమెకు ఒక అనుమానం వచ్చింది. ‘‘ఈ వైరస్‌ మా ల్యాబ్‌ నుంచి రాలేదు కదా?’’ అని. కానీ, తరువాతి పరిశోధనలో.. పళ్లను తినే గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు, ఇది కరోనా జాతికి చెందిన మరో వైరస్‌ అని నిర్ధారణకు వచ్చారు. వన్యప్రాణి మాంస భక్షణతో ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె హెచ్చరికలతోనే గత నెల 24న మాంసాహారాన్ని నిషేధిస్తున్నట్లు చైనా సర్కారు ప్రకటించింది. షి-జెంగ్లీ గడిచిన 16 సంవత్సరాలుగా గబ్బిలాల నుంచి వచ్చే వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్నారు. 2002-03 మధ్యకాలంలో సార్స్‌ వైరస్‌ పంజా విసిరినప్పుడే.. ఆమె గబ్బిలాల్లో ఉండే సార్స్‌పై పరిశోధన జరిపారు. సార్స్‌, ఎబోలా వ్యాధులకు గబ్బిలాలే కారణమని మొదట చెప్పింది కూడా ఆమే. వూహాన్‌లో కరోనా బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో.. కరోనా జన్యుపటం, సార్స్‌ జన్యుపటం ఒకేలా ఉండటాన్ని గుర్తించి, కొత్త వ్యాధికి ‘సార్స్‌ కోవి-2’గా నామకరణం చేశారు.

Courtesy Andhrajyothi