విద్యుత్‌ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమానికి 19 ఏండ్లు నిండాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆగస్టు 28న హైదరాబాద్‌లోని ప్రశాంతంగా సాగుతున్న ప్రదర్శనపై వాటర్‌ కెనాన్లు, లాఠీలతో విరుచుకుపడింది. ఆగని ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టింది. బషీర్‌బాగ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అమరులు కాగా పదుల సంఖ్యలో యువతీ యువకులకు ఆ తూటాలు తగిలాయి. వేలాదిమంది గాయపడ్డారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఆనాటి ప్రభుత్వం అలా వ్యవహరించగా ఇప్పటికీ అవే విధానాలు తెలుగురాష్ట్రాల సహా మిగతా రాష్ట్రాల్లోనూ అమలు జరుగుతున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండవసారి ఏర్పడిన తరువాత ప్రవేశ పెట్టిన తొలి బడ్జెట్‌లో విద్యుత్‌ రంగంలో కార్పొరేట్లకు కల్పించిన వివిధ రాయితీలు, చేపట్టనున్న సంస్కరణల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సుదీర్ఘంగా వివరించారు. విద్యుత్‌ రంగంపై పాలకుల కేంద్రీకరణ ఎంతలా వుందో చెప్పడానికి ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే!
హైదరాబాద్‌: పర్యావరణ ప్రభావం, కాలుష్య ప్రమాదాలను దృష్టిలో వుంచుకొని ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ వాటాను తగ్గించి, సంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుదుత్పత్తికి మొగ్గు చూపుతున్నారు. తగినంత సూర్య కాంతి లభించకపోవడం, గాలి వేగంగా వీయకపోవడం వంటి ప్రకృతి రీత్యాగల కారణాలతోపాటు రోజులో కొంత సమయమే ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సరఫరా చేయడానికి తగిన ఎవాక్యుయేషన్‌/ ట్రాన్స్‌మిషన్‌ లైన్లు లేకపోవడం తదితర ఆటంకాలున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మూలంగా సౌర విద్యుత్‌ ప్యానెళ్ల ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గింది. అలాగే పవన విద్యుత్‌ ఉత్పత్తి వ్యయమూ తగ్గుముఖం పట్టింది. ఈ సానుకూల, ప్రతికూలతల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆ రంగం తీరు తెన్నులు గమనించాలి. గడచిన పదేండ్లలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి పెరుగుదల వున్నప్పటికీ గడచిన రెండేళ్లగా ఆ వేగం తగ్గి ఇప్పుడు వెనకపట్టు పట్టింది. కొత్త సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంలో పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే 14 శాతం తగ్గి 11,700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8,30,700 కోట్లు) పడిపోయింది. చైనాలో 39 శాతం, యూరప్‌లో 4 శాతం, అమెరికాలో 6 శాతం తగ్గినట్టు బ్లూమ్‌బెర్గ్‌ సంస్థ పేర్కొంది.

ప్రపంచమంతటా తగ్గుతుంటే భారత్‌లో మాత్రం ఈ ఏడాది పెట్టుబడులు పది శాతం పెరగడం గమనార్హం. అంటే ప్రపంచమంతటా సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు వేగం తగ్గుతుంటే భారత్‌లో అది పెరుగుతోంది. సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రధాన పాత్ర విదేశీ కార్పొరేట్లదే. విదేశీ కంపెనీలు మెర్జర్‌, ఎక్విజిషన్‌ మార్గంలో కొన్ని భారతీయ చిన్న పెట్టుబడిదార్ల ప్లాంట్లనూ చేజిక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) సమావేశంలో భారత సంప్రదాయేతర విద్యుత్‌ అవకాశాలను గరిష్టంగా వాడుకోవడానికి ఐదు అంశాల ప్రణాళికను రూపొందించారు (వివరాలకు డబ్ల్యుఇఎఫ్‌ వెబ్‌సైట్‌). అవి (1) హైబ్రీడ్‌ సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు (2) విద్యుత్‌ సరఫరాకు మరిన్ని లైన్లు నిర్మించడం (3) కంప్యూటరీకరణకు ఖర్చు పెంచడం (4) బ్యాటరీల్లో విద్యుత్‌ నిల్వ చేసే సామర్ధ్యం పెంచడం (5) డిస్కామ్‌లను ప్రయివేటుకు అప్పగించడం. ఇలాంటి అనేక అంశాల పర్యవసానంగానే 2022 నాటికి 175 గిగా వాట్ల సంప్రదాయేతర విద్యుదుత్పత్తి సామర్ధ్యం లక్ష్యంగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు నిర్ణయం వెనుక దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలు దాగివున్న విషయాన్ని గమనించడం అవసరం.

సంస్కరణలు- డిస్కమ్‌లపై దృష్టి 
నయా ఉదారవాద ఆర్థిక విధానాలతోపాటే 1990వ దశకంలో విద్యుత్‌ సంస్కరణలు ప్రారంభమైనాయి. తొలి దశలో ఒడిషా, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో అమలు చేయగా ఆ తరువాత అత్యధిక రాష్ట్రా లు ఆ బాట పట్టాయి. విద్యుత్‌ బోర్డులను ఉత్పత్తి (జెన్‌కో), సర ఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ (డిస్కామ్‌) మూడు ముక్కలుగా విభ జించారు. తొలుత విద్యుదుత్పత్తి ద్వారా దోపిడీపై కేంద్రీకరిం చారు. ప్రయివేటు కంపెనీలు కుప్పలుతెప్పలుగా వచ్చి ప్లాంట్లు నెలకొల్పి ప్రభుత్వాలతో అడ్డగోలు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకున్నారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్ల చేత ఆమోద ముద్రలు వేయించారు. విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజల పై భారాలు వేశారు (ప్రజల ప్రతిఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఆ తరువాతి సంవత్సరాల్లో సాధారణ గృహ వినియోగ చార్జీలను దాదాపు పెంచలేదు). ప్రయివేటు విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటులో యంత్ర సామగ్రి ధరను ఎక్కువ చేసి చూపడం మొదలు విదేశాల నుంచి బొగ్గు, ద్రవరూప సహజవాయువు దిగుమతిలోనూ ధరలోనూ అనేక మోసాలకు పాల్పడ్డారు. విద్యుదుత్పత్తి ద్వారా దోపిడీకి ఇప్పటికే దార్లు పడ్డాయి. సౌర, పవన విద్యుత్‌లో పీపీఏల దోపిడీ మరింతగా పెరుగుతున్నది.

సంస్కరణల అమలులో ఉత్పత్తి విభాగంపై 2003 వరకు దృష్టి పెట్టారు. ఆ తరువాత (సరఫరా రంగంలో ప్రయివేటు దోపిడీకి ప్రస్తుతం అంత అనువుగా లేదు కనుక దాన్ని వదిలేసి) పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌) రంగాన్ని ప్రయివేటుకు అప్పగించడానికి తెర లేపారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటలు నిరంతరాయ కరెంటు, ఉదయ, ఉజ్వల, సౌభాగ్య ఇలా రకరకాల స్కీముల ద్వారా డిస్కమ్‌లలో సంస్కరణల కోసం రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నది. వాటిని అమలు చేయడానికి రాష్ట్రాలకు కొన్ని రాయితీలూ ఇస్తోంది. రాయితీలు బాగానే కనిపిస్తున్నా ఆ షరతులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం వున్న కొన్ని వెసులుబాట్లు పోతాయి. అందరిపైనా భారాలు పెరుగుతాయి. డిస్కామ్‌లలో సంస్కరణలే లక్ష్యంగా కేంద్ర విద్యుత్‌ అథారిటీ ‘డ్రాఫ్ట్‌ డిస్ట్రిబ్యూషన్‌ పెర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌’ను రూపొందించింది. దాని అమలు తీరును 2019 జులై 16న సమీక్షించిన విద్యుత్‌ శాఖామంత్రి రెండవ తరం విద్యుత్‌ సంస్కరణలతో దాన్ని జమిలి చేయాలని ఆదేశించారు. మంత్రిత్వశాఖలో ఒక ఉన్నత స్థాయి బృందాన్ని నియమించిన మంత్రి పెర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు పంపాలని కోరారు.

ఒకే గ్రిడ్‌ కిందకు తేస్తే ఏమవుతుంది..! 
దేశమంతటినీ ఒకే గ్రిడ్‌ కిందికి తీసుకు రావాలన్న ప్రయత్నం వెనుక కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి పూర్తిగా తీసుకోవాలన్న కుట్ర కూడా దాగివుంది. డిస్కాములన్నీ బ్యాంకు గ్యారంటీలిచ్చి తీరాలనీ, లేకపోతే ఆగస్టు ఒకటి నుంచి గ్రిడ్‌ నుండి కరెంటివ్వనని షరతు విధించి దాన్ని బలవంతంగా అమ లు చేసిన విషయం తెలిసిందే. మున్ముందు ఇలాంటి షరతులు చాలా రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు నిలబడుతుందా లేక భారాలు వేస్తుందా చూడాలి. ఇటీవల సౌర, పవన విద్యుత్‌ పీపీఏలను సమీక్షిస్తానంటే కేంద్రం వెనువెంటనే అడ్డుకోవాలని ప్రయత్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తాను చెప్పిన మాట, ఇచ్చిన జీవో అమలుకు గట్టి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. రెండోతరం విద్యుత్‌ సంస్కరణల ముప్పును ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలి. కార్పొరేట్లకు అండగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటుంటే…ప్రజా ఉద్యమాలతో మరోసారి పిడికిలి బిగించక తప్పదన్న అభిప్రాయం ఇటు జనంలోనూ.. ప్రజాసంఘాల్లోనూ వ్యక్తమవుతున్నది. ఒక్కసారిగా ఆనాడు బషీర్‌బాగ్‌లో అమరులైన ఉద్యమకారులను మననం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైరదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ముంచు కొస్తున్న ప్రమాదం 
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెండో తరం సంస్కరణలు అమలు జరిగితే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వుంటుంది. రానున్న మూడేండ్లలో మొత్తం మీటర్లను మార్చేసి స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తారట. ఇటీవల వచ్చిన చైనా మీటర్లే గిర్రున తిరిగేస్తున్నాయని, భారీగా బిల్లులొస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. స్మార్ట్‌ మీటర్‌ అయితే వినియోగదారు ఏ సమయంలో ఎంత కరెంటు వాడుతున్నారో రికార్డు చేసి సంబం ధిత కార్యాలయానికి రీడింగ్‌ పంపుతుంది. బాగా డిమాండ్‌ వున్న సమయంలో (ఉదా హరణకు ఉదయం 8-10గం., సాయంత్రం 6-9గం. ఇలా) ఎక్కువ చార్జీ, మిగతా సమయాల్లో మరో చార్జీ వసూలు చేస్తారు. మీటర్‌ రీడర్ల ఉద్యోగాలు పోతాయి. అలాగే ఇప్పుడు వాడిన కరెంటుకు నెల తరువాత బిల్లు చెల్లించే పద్ధతి పోయి ముందుగా (ప్రీ పెయిడ్‌) డబ్బు కట్టే విధానం వస్తుంది. ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వినియోగదారులకు ఉపయోగపడు తున్న క్రాస్‌ సబ్సిడీ విధానానికీ పాడె కట్టబోతున్నారు. కాస్ట్‌ టు సర్వ్‌ (ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి నుండి వినియోగదారుకు చేరే వరకు అయిన ఖర్చు) కంటె 20 శాతం మించి క్రాస్‌ సబ్సిడీ ఎవరికీ ఇవ్వరాదని షరతు. ఉదాహరణకు ప్రస్తుతం కాస్ట్‌ టు సర్వ్‌ యూనిట్‌కు రూ.6.06గా వుంది. కొత్త నిబంధన ప్రకారం ఏ వినియోగదారుకూ యూనిట్‌ రూ.4.85 కన్న తక్కు వకు సరఫరా చేయరాదు. ప్రస్తుతం 50 యూనిట్ల లోపు గృహ వినియోగదారుకు యూనిట్‌ రూ1.45కే సరఫరా చేస్తున్నారు. ఇకమీదట అది రూ.4.85 అవుతుంది. అంటే నెలకు ఆ కుటుంబానికి రూ.170 అదనపు భారం పడుతుంది. అలాగే వినియోగ దారు చార్జీ పెంచాలని మరో షరతు. ఇలాంటి అనేక హానికరమైన అంశాలు రెండో తరం సంస్కరణల్లో దాగివున్నాయి. డిస్కాముల పూర్తిస్థాయి ప్రయివేటీకరణ అంటూ జరిగితే అది ఆంధ్రప్రదేశ్‌తోనే మొదలయ్యే ప్రమాదముంది. దేశం లోనే మంచి పని తీరు కనపరుస్తున్న డిస్కాముల్లో ఈపీడీసీఎల్‌ (విశాఖపట్నం) ముందు పీఠిన వుంది. కసాయి కండ్లు ఎప్పుడూ బాగా కండకట్టిన పొట్టేలుపైనే వుంటాయి కాబట్టి మన డిస్కాములే ముందు బలి పశువులు కావచ్చు.

 

(Courtacy Nava Telangana)