– దాదాపు 74 శాతం పెరిగిన ‘ఫ్రాడ్‌’లు
– గతేడాది 6,801 కేసులు వెలుగులోకి
– సరైన నియంత్రణ లేకపోవడమే కారణం!

ముంబయి: బ్యాంకుల్లో మోసాలను నిలవరించేందుకు తాము అనేక చర్యలు తీసుకుంటున్నామని.. వీటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్టు కేంద్రంలోని మోడీ సర్కారు చేబుతున్న మాటలు నీటి మూటలేనని తేలిపోయింది. మంగళవారం భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) విడుదల చేసిన ‘ట్రెండ్స్‌ అండ్‌ ప్రోగ్రెస్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ -2018-19’ నివేదిక ప్రకారం మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ మోసాలు 74 శాతం మేర పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 6,801 బ్యాంక్‌ మోసాలు నమోదయ్యాయని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. అంతకు ముందు ఏడాది వీటి సంఖ్య 5,916 గా నిలిచినట్టు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ మోసాల మొత్తం విలువ రూ.71,543 కోట్లుగా నిలిచిందని ఆర్బీఐ వెల్లడించింది. కార్యచరణ నష్టాలను నిలవరించేందుకు, పరిష్కరించేందుకు తగినంత అంతర్గత వ్యవస్థలు, సిబ్బంది లేకపోవడం కారణంగానే బ్యాంకుల్లో మోసాలు పెరిగాయని నివేదిక తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకుల్లో జరిగిన మోసాలలో 55.4 శాతం కేసులు ఈ కారణంగానే జరిగినట్టుగా తమ విశ్లేషణకు వచ్చిందని పెద్ద బ్యాంక్‌ నివేదిక వెల్లడించింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థల్లో మోసాలను గుర్తించడం, ఆ వెనువెంటనే వెల్లడించేందుకు గాను ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన విధివిధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విధానం మేరకు బ్యాంకుల్లో రూ.50 కోట్లు.. అంతకంటే ఎక్కువ మొత్తంలో నిరర్థక ఆస్తిగా మారిన రుణాలను.. మోసం జరిగేందుకు అవకాశం ఉన్నదన్న కోణంలో దర్యాప్తు చేసి బ్యాంకులు వాటిని రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మోసపూరిత లావాదేవీలను గుర్తించేందుకు ఇప్పటికే అమలులో ఉన్న విధానలకు అనుబంధంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను సర్కారు రూపొందించి అమలులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం వల్లే 2018-19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ మోసాలు వేగంగా వెలుగులోకి వచ్చాయని ఆర్బీఐ నివేదికలో ముక్తాయించింది.
ప్రయివేటు బ్యాంకుల్లోనూ..
ఆర్బీఐ నివేదిక వెల్లడించిన మేరకు ప్రయివేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో సైతం బ్యాంక్‌ మోసాలు పెరిగాయి. ఆర్బీఐ నివేదికలో వెలుగులోకి వచ్చిన మొత్తం మోసాలలో ప్రయివేటు బ్యాంకుల వాటా 30.7 శాతంగా నిలువగా, విదేశీ బ్యాంకుల వాటా 11.2 శాతంగా ఉంది. అంతకు ముందు ఏడాది ఈ విత్త సంస్థల్లో వెలుగులోకి వచ్చిన మోసాలు వరుసగా 7.7. శాతం, 1.3 శాతంగా నమోదయ్యాయి. బ్యాంక్‌ మోసాల మొత్తం నగదు విలువలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని మోసాల విలువ 91.6 శాతంగా నమోదు అయింది. బ్యాంకులు జారీ చేస్తున్న రుణాల విభాగంలో 3,606 కేసులు నమోదయ్యాయని వీటి విలువ రూ.64,548 కోట్ల దరిదాపుల్లో ఉన్నట్టుగా పెద్ద బ్యాంక్‌ తెలిపింది. విదేశీ మారకపు నిల్వల బదిలీల్లో 13 మోసం కేసులు వెలుగులోకి వచ్చాయని.. వీటి విలువ దాదాపు రూ.695 కోట్లకు దరిదాపుల్లో ఉంటుందని నివేదిక తెలిపింది. మరోవైపు మార్చితో ముగిసిన సంవత్సరంలో బ్యాంక్‌ కార్డులకు సంబంధించి 1,866 కేసులు నమోదయ్యాయని.. వీటి విలువ దాదాపు రూ.71 కోట్లకు సమానమని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది.

Courtesy Nava telangana